నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి నాలుగు రోజుల పాటు బీహార్‌లో ఛత్ పండుగ జరగనుంది. ఈ వేడుకల కోసం రాష్ట్రం బయట ఉన్నవారంతా గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో రైళ్లు, బస్సులు, వాహనాలు ఫుల్ రష్‌గా ఉంటున్నాయి. అయితే చత్ పండుగ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అదనపు రైలు అందుబాటులో ఉంచామని ప్రధాని మోడీ చెప్పారు.కానీ ప్రయాణీకుల రద్దీకి తగ్గ రైలు అందుబాటులో లేకపోవడంతో బీహార్ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ వ్యవహారంపై లాలూ ప్రసాద్ యాదవ్ మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్.. అబద్ధాల రాజుగా లాలూ ప్రసాద్ యాదవ్ అభివర్ణించారు. ‘‘నిరాకరణీయమైన అబద్ధాల రాజు’’, ‘‘నినాదాల అధిపతి’’ అయిన మోడీ.. దేశంలోని మొత్తం 13,198 రైళ్లలో 12,000 రైళ్లు ఛత్ పండుగ సందర్భంగా బీహార్‌కు వెళ్తాయని బిగ్గరగా చెప్పారని… ఇది కూడా పచ్చి అబద్ధమే అని తేలిందని ధ్వజమెత్తారు.
20 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో వలసల కష్టాలను భరించిన బీహారీలు.. ఛత్ అనే గొప్ప పండుగ సమయంలో కూడా సరైన రైలు సేవలను పొందలేకపోయారని పేర్కొన్నారు. ‘‘నా తోటి బీహార్ వాసులు అమానవీయ పరిస్థితుల్లో రైళ్లలో ప్రయాణించవలసి వస్తుంది. ఇది ఎంత సిగ్గుచేటు?.’’ అంటూ లాలూ ప్రసాద్ విరుచుకుపడ్డారు. ‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా బీహార్ నుంచి ప్రతి సంవత్సరం 4 కోట్లకు పైగా ప్రజలు పని వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బీహార్‌లో ఎటువంటి ప్రధాన పరిశ్రమలను స్థాపించలేదు. ఈ వ్యక్తులు స్పష్టంగా బీహార్ వ్యతిరేకులు..’’ అంటూ లాలూ ప్రసాద్ ఎక్స్‌లో ధ్వజమెత్తారు.



