Sunday, October 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పత్తి కొనుగోళ్లలో నష్టం జరగకుండా పటిష్ట చర్యలు : కలెక్టర్

పత్తి కొనుగోళ్లలో నష్టం జరగకుండా పటిష్ట చర్యలు : కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజార్షి షా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లు అక్టోబర్ 27, 2025 నుండి ప్రారంభం కానున్నాయని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రైతులకు ఎంఎస్‌పీ (ఎంఎస్పీ) ధర లభించేలా సీసీఐ కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా పత్తి కొనుగోళ్లు “కపాస్ కిసాన్ యాప్” ద్వారా మాత్రమే జరగాలని ఆదేశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాలను ముందుగానే పరీక్షించేందుకు మార్కెట్‌ యార్డులో ట్రయల్ రన్‌ నిర్వహించబడిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఈఓ ల ఆధ్వర్యంలో 10 మంది రైతులను ఎంపిక చేసి, వారి పత్తిని గ్రామాల్లో ఆరబెట్టి తేమ శాతం 8% నుండి 12% మధ్యగా నిర్ధారించారని, అక్టోబర్ 24న జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదిలాబాద్–ఏ ఆదిలాబాద్–బీ కొనుగోలు కేంద్రాలను ప్రాథమికంగా ప్రారంభించినట్లు తెలిపారు. అక్టోబర్ 27వ తేదీ నుండి ప్రతి రోజు ఉదయం 9.00 గంటలకు రైతులు, జిన్నింగ్‌ మిల్‌ యజమానులు, సీసీఐ ప్రతినిధుల సమక్షంలో వేలంపాట ద్వారా ప్రైవేట్‌ ధర నిర్ణయించబడుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 27 నాటికి ఆదిలాబాద్ లో ఏ,బీ కేంద్రాలలో మొత్తం 252 మంది రైతులు స్లాట్లు బుక్ చేసుకున్నారని, మొత్తం సుమారు 8,128 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరగనున్నట్లు తెలిపారు.

ఎవరైనా వాస్తవాలను తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయకూడదని, అసత్య ప్రచారాలకు తావు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి, మద్దతు ధర విషయంలో ఎటువంటి అన్యాయం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే శుక్రవారం జరిగిన ప్రాథమిక కొనుగోలు కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన రైతు ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. రైతులు అవాస్తవాలను నమ్మవద్దని, ఎలాంటి ఆందోళన చెందకుండా నాణ్యమైన పత్తిని మార్కెట్‌ యార్డుకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -