హైటెక్ సిటీ, అన్నీ 40 అంతస్తులు..
ఒకడు 19 వ అంతస్తులో మరొకడు 36లో
అన్నీ పిట్టగూళ్ళు… గుబురు చెట్టు ఆకుల పొదల్లో నిశ్శబ్ద రొద
ముక్కులతో పొడుచుకోడాలు… రెక్కలతో కొట్టుకోడాలు
కిచకిచ అరచి అరచి… చివరికి అభద్రత కౌగిట్లో నిద్రపోవడాలు
బయట సిమెంట్ రోడ్లపై రక్తనాళాల్లో పరుగెత్తే
కొలస్ట్రాల్, ప్లాస్మా, రెడ్ సెల్స్, వైట్ సెల్స్.. ప్లేట్లెట్స్ వలె
పరుగు ఎక్కడికో తెలియదు
డ్రైవర్ పెయిడ్… డిస్టినేషన్ మాత్రమే తెలుసతనికి
ఎందుకు.. ఎక్కడికి.. ఎవరికోసం – కర్త కర్మ క్రియ –
ఒక భూబిలంలో అగ్ని అఖాతం
అతను 35 వ అంతస్తులోనుండి 3 వ అంతస్తు
బాల్కనీలోని పద్నాలుగేళ్ళ ప్రేయసిని
జూమ్ లో ఫోటో తీస్తూంటాడు
కౌమార దశ… కవోష్ణరక్తంలోని జలదరింత ఏమిటో అర్థం కాదు
ఇగిరిపోడానికీ, ఇంకిపోడానికీ మధ్య తేడా తెలియదు
అన్నీ సజాతి విజాతి ధృవాల ఆకర్షణ వికర్షణ తీవ్రతలే
ఒక దశ అది… Articulation –
2
నిజానికి మనిషి ఎవనికివాడు ఒక శుద్ధవ్యవస్థ జన్మతః
ఊపిరి పీల్చుకుంటున్న క్షణం నుండి మొదలౌతుంది
do…undo… redo… never do… No do… చివరికి no due
ఇక what to do? అనేది యవ్వన దశ
what not to do అనేది వేదాంత అంతఃచర్చ
అది మెదడులో పురుగు. . ఒకటే గుల గుల – మెలాంకలీ
3
అపుడు ఒక ఆమెనో, ఒక అతనో రంగప్రవేశం చేస్తూండగా
జలజల రక్తరౌరవ ఉగ్రత.. లోపల వందల కోతుల గీకుడు
మెలికలు తిరిగిపోవుళ్ళు…
రాత్రుళ్ళు రాని కలలకోసం ఎదురుచూపులు
చేతులను తొడలమధ్య ఒత్తుకోవడాలు
పెళ్ళో, లివింగ్ టుగెథరో, అన్మ్యారీడ్ కపుల్సో
ఏదో ఒకటి తట్టెడు నిప్పులపై బకెట్ నీళ్ళ కుమ్మరింత కావాలె
తనకుతానే ఒక ఏకవ్యక్తి వ్యవస్థగా భావిస్తున్న భవనం
కళ్ళముందే మెలమెల్లగా కూలిపోతూ, శిథిలమౌతూంటే
జారిపోతూంటాడు మనిషి.. నూనె రోడ్లపై
అది సందిగ్ధ అసందిగ్ధ అనిర్ధారిత దశ
యవ్వనం తీరమేలేని ఒక సముద్రం-
4
ప్రాతః సంధ్యలు మారుతాయి, ఋతువులు మారుతాయి
కాలాలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి
ఇంటర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గురించి తెలుస్తూంటుంది
శక్తి, బలం, సత్వం, తన్యత, బహుధృవ కేంద్రకాలు
అంతా పిచ్చి పిచ్చిగా, వెర్రి వెర్రిగా, అర్థం కానిది ఏదేదో
కొన్ని స్త్రీ పరీమళాలు, మరికొన్ని పురుష వాసనలు
ఏదో కావాలని ఎటో ఎగిరిపోవాలని… రెక్కలకోసం అన్వేషణ
50 కి కొద్దిగా అటో ఇటో ఔతున్నపుడు
శరీరంలోనుండి విద్యుత్తువంటి ఏదో
అదృశ్యధాతువు అదృశ్యమైపోతున్న ఫీలింగ్
దేహవాహకంలోనుండి ‘కరెంట్ ‘ నిష్క్రమిస్తోందా అన్న భయం
చెదలు పట్టడం ఇక మొదలు అది అతి అరాచక అవ్యవస్థిత దశ-
5
అంతా ఐపోతోంది… అంతా చేజారిపోతోంది…
శిఖరంపైనుండి లోయలోకేనా ఇక
రాత్రంతా దగ్గు, రేపు రక్త పరీక్షలకోసం
ల్యాబ్కు వెళ్ళాలి… అతిభయం
అసలు తను రైలెక్కనేలేదు.. కంపిస్తున్న ప్లాట్ఫాంపై
ఎవరూ లేని ఒంటరి తనై
ఎదుట ఎప్పుడూ ఆకుపచ్చగా మారని ఎర్రని సిగల్ లైట్
అన్నీ మహౌద్వేగాలే.. ఎమోషన్స్.. ప్రేయసి బ్రేకప్లో దుఃఖోద్వేగం,
రిజాయిండర్లో రాజీ ఉద్వేగం, అది ‘కార్సినామా’
అని నిర్ధారణ ఐనపుడు భయోద్వేగం
‘ఎమోషన్’ కాకుండా నిరామయంగా ఉండండని
వృద్ధాశ్రమ సలహా.. శూన్యోద్వేగం
వెరసి… చివరగా అత్యంత అంత్య దశ
బస్… ఖేల్ ఖతం … తాలీ బజావ్
- రామా చంద్రమౌళి, 9390109993


