జిల్లా కలెక్టర్ రాజర్షి షా
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జిల్లాలో నవజాత శిశువుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన నూతన శిశు సంరక్షణ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవజాత శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గించేందుకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరింత అంకితభావంతో, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో గిరిజన ప్రాంతం అధికంగా ఉండటం, పలు భౌగోళిక, సామాజిక సవాళ్లు ఉన్నా వైద్య బృందం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే వైద్య శాఖ చేపడుతున్న చర్యల వలన మాత, శిశు, బాల మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. ప్రతి ప్రసవ కేంద్రంలో, ప్రతి జనన సమయంలో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు.
నవజాత శిశు మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఐసీఎంఆర్ కార్యక్రమం లో భాగంగా రిమ్స్ ఆదిలాబాద్, నిలోఫర్, ఏఐఐఎంఎస్ ఆసుపత్రులు, హైదరాబాద్ సహకారంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారని, ఈ శిక్షణ ద్వారా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రతి శిశువుకూ సమయానికి సురక్షిత సేవలు అందించే నైపుణ్యం పెంపొందించుకోవాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రతి వైద్యుడు, నర్సు ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఆచరణలోకి తీసుకురావాలని, ప్రతి శిశువుకు సమయానికి అవసరమైన ప్రాణరక్షక సేవలు అందేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం శిక్షణలో నవజాత శిశు పునరుద్ధరణ, తల్లిపాలు అందించే ఉత్తమ పద్ధతులు, కంగారూ మదర్ కేర్, సంక్రామణ నియంత్రణ విధానాలు వంటి అంశాలపై నిపుణులు ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డా. జైసింగ్ రాథోడ్, వైద్యులు, నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.




