– ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
యువత మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాన్ని చేజేతుల పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలు యువత పెడదోవన పట్టకుండా ఉంచడంలో దోహదం చేస్తాయన్నారు.
అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ బి.సాయి చైతన్య ఆదేశాల మేరకు మండల స్థాయి వాలీబాల్ పోటీలను వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగిందన్నారు. వాలీబాల్ పోటీలకు యువత నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు.వాలీబాల్ క్రీడల నిర్వహణకు క్రీడా మైదానాన్ని ఇచ్చి సహకరించిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి సీఐ శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ వాలీబాల్ టోర్నమెంట్లో 20జట్లు పాల్గొన్నాయి. ప్రథమ విజేతగా కుకునూర్, ద్వితీయ విజేతగా పడగల్, తృతీయ విజేతగా అక్లూర్ నిలిచాయి. విజేతలకు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి జ్ఞాపికలను అందజేసి క్రీడాకారులను అభినందించారు.కార్యక్రమంలో ఎస్ఐ కే.సంజీవ్, పోలీస్ సిబ్బంది, పిటీలు, క్రీడాకారులు, పాఠశాల సిబ్బంది, యువకులు, తదితరులు పాల్గొన్నారు.



