Monday, December 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపక్షం రోజుల్లో చేనేత సమస్యలు పరిష్కరించాలి

పక్షం రోజుల్లో చేనేత సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

లేకపోతే నవంబర్‌ 20న మహాధర్నా
చేనేత ముడిసరుకులు, ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలి : చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-హయత్‌ నగర్‌

పక్షం రోజుల్లో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల 20న హ్యాండ్‌లూమ్‌ టెక్స్‌టైల్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు మహాధర్నా చెపడతామని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్స్‌లో రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్‌ అధ్యక్షతన సోమవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్‌ ప్రవేశపెట్టిన గత కార్యక్రమాల నివేదికపై చర్చించారు. అనంతరం చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. చేనేత కార్మికుల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి దాదాపు ఏడాదిన్నర దాటిందని, ఎప్పుడు చేస్తారోనని కార్మికులు కండ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారని అన్నారు. పక్షం రోజుల్లో రుణమాఫీ చేయకపోతే నవంబర్‌ 20న నాంపల్లి హ్యాండ్‌లూమ్‌ టెక్స్‌టైల్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. చేనేత చేయూత నగదు బదిలీ పథకం స్థానంలో చేనేత భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించి నెలలు గడుస్తున్నా చేయడం లేదన్నారు. నేతన్న బీమా పథకంలో వయసుతో నిమిత్తం లేకుండా బీమా ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరమైనా..కార్మికులు మరణించి ఏడాది దాటినా బీమా అందించకపో వడం విచారకరమన్నారు.చేనేత ముడి సరుకులు నూలు, రంగులు, రసాయనాలపై, చేనేత చీరలపై జీరో జీఎస్టీ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు 12 ఏండ్ల నుంచి ఎన్నికలు జరపడం లేదని, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరవు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి సంవత్సరం దాటిందని గుర్తు చేశారు. సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి టెస్కోకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌ రుణాలు మాఫీ చేసి రుణాలను పునరుద్ధరించాలన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సలహాదారు బడుగు శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి, ఉపాధ్యక్షులు వనం ఉపేందర్‌, వర్కాల చంద్ర శేఖర్‌, సహారా నాయకులు శేఖరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కర్నాటి వెంకటేశం, గజం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -