అమెరికాకు మోకరిల్లిన మోడీ
ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల నిర్ణయం..యూఎస్ నుంచి రికార్డ్ దిగుమతులు
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ఆంక్షలకు ప్రధాని మోడీ తలొగ్గారు. రష్యా నుంచి చౌకగా లభించే చమురు కాకుండా యూఎస్ నుంచి దిగుమతులను పెంచారు. ట్రంప్ బెదిరింపులకు భపడి రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేశారు. ట్రంప్ ఆదేశాల మేరకు రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. తాత్కాలికంగా చమురు కొనుగోలును నిలిపివేశాయి. స్పాట్ మార్కెట్ల నుంచి కొనుగోళ్లతో ఆ లోటును భర్తీ చేసుకుంటున్నామని రిఫైనరీలకు చెందిన కీలక వ్యక్తులు వెల్లడించారు. అమెరికాకు సహకరిస్తామన్న ప్రధాని మోడీ హామీ మేరకు భారత రిఫైనరీలు అమెరికా కంపెనీల నుంచి చమురు బుకింగ్ పెంచుకున్నట్టు వాణిజ్య, ప్రభుత్వ వర్గాల సమాచారం. రష్యా సంస్థలైన రాస్‌నెఫ్ట్, లుకాయిల్‌తో పాటు వాటి అనుబంధ సంస్థల నుంచి అమెరికా కంపెనీలు, వ్యక్తులు చమురు కొనకుండా అక్టోబరు 22న అమెరికా నిషేధం విధించింది.
అమెరికాయేతర సంస్థలు కొనుగోలు చేస్తే పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. ఈ రెండు సంస్థలతో కొనసాగుతున్న లావాదేవీలను నవంబర్ 21 నాటికి ముగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలకు భారత్ తలొగ్గి రష్యన్ చమురు దిగుమతులను భారీగా తగ్గించింది. రష్యన్ చమురు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న రిలయన్స్ ఇండిస్టీస్ సైతం రోస్నెప్ట్‌తో ఉన్న 25 సంవత్సరాల ఒప్పందం (రోజుకు 5 లక్షల బ్యారెల్స్) కింద కొనుగోళ్లను ఆపేస్తుంది. కొత్త ఆర్డర్లు పెట్టడం లేదని ఆ వర్గాలు వెల్లడించాయి. రిఫైనరీ ఉత్పత్తుల దిగుమతులపై ఈయూ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుం టామని తెలిపింది. అమెరికా, బ్రిటన్, ఈయూ ప్రకటించిన ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఆంక్షల అమలు, నియంత్రణ చట్టాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) వంటి ప్రభుత్వ సంస్థలు తమ రష్యన్ చమురు కొనుగోలు ఒప్పందాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
రికార్డు స్థాయిలో యూఎస్ చమురు దిగుమతి
ట్రంప్ బెదిరింపులకు భయపడి అమెరికా నుంచి భారత్ భారీగా చమురు దిగుమతులను పెంచేసింది. బీజేపీ సర్కార్ ఆదేశాల మేరకు అమెరికాకు అనుకూల సంకేతాలను అందించేందుకే భారత రిఫైనరీలు ఆ దేశ కంపెనీల నుంచి చమురు కొనుగోలును పెంచుకున్నాయి. అక్టోబర్ 27 నాటికి రోజుకు 5.4 లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి నమోదయ్యింది. ఫలితంగా 2022 తర్వాత యూఎస్ నుంచి చమురు కొనుగోళ్లు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఈ నెల ముగింపు నాటికి ఇది సుమారు 5.75 లక్షల బ్యారెల్స్‌కు చేరనుందని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ నుంచి దిగుమతులు సగటున 3 లక్షల బ్యారెల్స్‌గా ఉంది. ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం రష్యా నుంచే ఎక్కువగా ముడిచమురు దిగుమతి అవుతుండగా ఇరాక్, సౌదీ అరేబియా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.
ట్రంప్ ఒత్తిడి మేరకే.. రష్యా చమురు దిగుమతులపై భారత్ వెెనక్కి : సీపీఐ(ఎం) మాజీ జనరల్ సెక్రెటరీ ప్రకాశ్‌కరత్
ట్రంప్ ఆంక్షలతోనే మోడీ సర్కార్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకుంటుందని సీపీఐ(ఎం) మాజీ జనరల్ సెక్రెటరీ ప్రకాశ్‌కరత్ అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కొత్త ఆర్డర్లను నిలిపివేశాయన్నారు. ప్రయివేటు రంగంలోని రిలయన్స్ కూడా కొనుగోళ్లను నిలిపివేస్తోన్నట్టు ప్రకటించిందన్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని మోడీ యూఎస్‌కు కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.



