Wednesday, October 29, 2025
E-PAPER
Homeజాతీయంఇంటికో ప్రభుత్వ ఉద్యోగం

ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం

- Advertisement -

సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా మహాగట్‌బంధన్‌ మ్యానిఫెస్టో
మహిళలకు రూ.2,500 సాయం
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

నవతెలంగాణ- పాట్నాబ్యూరో
బీహార్‌ సమగ్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ప్రతిపక్షాల ఐక్య వేదిక మహాగట్‌బంధన్‌ తన ఎన్నికల ప్రణాళిక (మ్యానిఫెస్టో)లో దార్శనిక అంశాలను పొందుపర్చింది. ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) పునరుద్ధరణ, వక్ఫ్‌ సవరణ చట్టం అమలు రాష్ట్రంలో నిలిపివేత తదితర 25 అంశాలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించింది. మంగళవారం పాట్నాలో జరిగిన కార్యక్రమంలో 32పేజీల మ్యానిఫెస్టోను మహాగట్‌బంధన్‌ నాయకులు విడుదల చేశారు. ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం, మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థికసాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగులుగా పదోన్నతి కల్పిస్తామని తెలిపారు. వితంతువులు, సీనియర్‌ సిటిజన్లకు రూ.1,500 నెలవారీ పెన్షన్‌, వికలాంగులకు రూ.3,000 నెలవారీ సహాయం అందజేస్తా మని పేర్కొన్నారు.

కార్పొరేట్‌ కంపెనీల దోపిడీని అరికట్టడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేద కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్ల అందజేత, ఉద్యోగులకు పాత పెన్షన్‌ పథకాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 136 బ్లాకుల్లో కొత్త కళాశాలలు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. రైతులు పండించే అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగార్థులకు, విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఫీజు మినహాయింపు ఇస్తామని, దళితులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమల్జేస్తామని మహాగట్‌బంధన్‌ తన మ్యానిఫెస్టోలో భరోసానిచ్చింది. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోపు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చట్టబద్ధమైన కృషి చేస్తామని తెలిపింది.

అలాగే వక్ఫ్‌ సవరణ చట్టాన్ని బీహార్‌లో అమల్జేయబోమని ప్రకటించింది. మహాగట్‌బంధన్‌ సారథిగా ఆర్జేడీ అధ్యక్షులు తేజస్వీ యాదవ్‌ను ఇప్పటికే తమ వేదిక పక్షాన సీఎం అభ్యర్థిగా ప్రకటించి అధికార పక్షానికి సవాలు విసిరిన ప్రతిపక్షాల వేదిక ఇప్పుడు మ్యానిఫెస్టోను సైతం అందరికంటే ముందుగా విడుదల చేసి ముందంజలో నిలిచింది. కాగా అధికార జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ తన మ్యానిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేసేవీలుంది. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ అధ్యక్షులు తేజస్వీ యాదవ్‌, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా, వికాస్‌ షీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) నాయకులు, మహాగట్‌బంధన్‌ డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్‌ సాహ్ని, సీపీఐ (ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు అవధేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కుప్పకూలిన శాంతిభద్రతలు : తేజస్వీయాదవ్‌
ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో బీహార్‌లో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, జేడీయూ, బీజేపీ ప్రజలను కష్టాల సుడిగుండంలోకి నెట్టేశాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. మ్యానిఫెస్టో విడుదల సందర్భంగానూ, సరన్‌ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లోనూ ఆయన ప్రసంగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -