నవతెలంగాణ-హైదరాబాద్: గాజా శాంతి ప్రణాళిక ఒప్పందాన్ని ఇజ్రాయిల్ పదే పదే ఉల్లంఘిస్తోంది.గాజాలో రాత్రిపూట ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో సుమారు 60మంది మరణించారని, వారిలో చాలా మంది చిన్నారులు ఉన్నారని స్థానిక ఆస్పత్రి అధికారులు బుధవారం తెలిపారు. ఇజ్రాయిల్ వైమానిక దాడుల తర్వాత రాత్రి సుమారు 10 మృతదేహాలు ఆస్పత్రికి చేరుకున్నాయని, ముగ్గురు మహిళలు, ఆరుగురు చిన్నారులవి ఉన్నాయని సెంట్రల్ సిటీ డీర్ అల్ -బలాలోని అక్సా ఆస్పత్రి తెలిపింది.
దక్షిణ గాజాలో, ఖాన్‌యూనిస్ లోని నాజర్ ఆస్పత్రి ప్రాంతంలో ఇజ్రాయిల్ ఐదు దాడులు జరిపిందని అధికారులు తెలిపారు. అక్కడి నుండి 20 మృతదేహాలు వచ్చాయని, వాటిలో 13మంది చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారని అన్నారు. సెంట్రల్ గాజాలోని పలు చోట్ల, అల్ అవ్దా ఆస్పత్రి 30 మృతదేహాలు వచ్చాయని తెలిపింది. వాటిలో 14మంది చిన్నారులు ఉన్నారు. హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ గాజాపై శక్తివంతమైన దాడులు నిర్వహించాల్సిందిగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ సైన్యాన్ని ఆదేశించిన తర్వాత ఈ దాడులు చోటుచేసుకున్నాయి.



