నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని ఘౌస్‌నగర్ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి జరిగిన హత్య సంఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. HKGN పాన్‌షాప్ యజమాని మొహ్సిన్(35) పై గుర్తు తెలియని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. సమాచారం అందుకున్న వెంటనే బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని ముట్టడించారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాల సేకరణ కొనసాగుతోంది. మొహ్సిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దాడి వెనుక గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత విభేదాలు, వ్యాపార వివాదం లేదా పాత విరోధమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాంతంలోని CCTV ఫుటేజీలను సేకరించి నిందితుల కదలికలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. “మృతుని కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటాం,” అని బండ్లగూడ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ ఘటనతో ఘౌస్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.



