Friday, October 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినైతికతే మానవీయత

నైతికతే మానవీయత

- Advertisement -

మనిషి జీవితానికి ఉన్నత లక్ష్యం ఉండాలి. తినడం, బతకడం, పోటీపడటం ఇవే జీవితం కాదు. మనిషి పెరుగుదల అంటే శారీరకంగా కాదు, మానసికంగా, నైతికంగా, ఆరోగ్యంగా, శాస్త్రీయంగా ఎదగడం. మన సంస్కృతి మనిషిని యంత్రంగా కాకుండా సమగ్ర వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దే మార్గం చూపింది. శాంతి,ప్రజాస్వామ్యం రెండూ ఒకే నాణానికి రెండు పార్శాలు. ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. మనిషికి కేవలం తిండి, వస్త్రం, నివాసం మాత్రమే కాదు శాస్త్రీయ, మానవీయ విలువలూ అత్యవసరం. ఈ విలువలతోనే భారతదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. ఆంగ్లేయులు భారతదేశాన్ని విడిచి వెళ్లడానికి కారణం మన సైనిక బలం ఒక్కటే కాదు, మన నైతిక బలం. అయితే నేటి ప్రజాజీవితంలో విలువలు బలహీనపడ్డాయి. కుల,మతతత్వాలు, హింస, అవినీతి, దురాశ సమాజాన్ని కుళ్లజేస్తున్నాయి.

ఇలాంటి వాతావరణంలో మన దేశం సాంకేతికంగా ముందుకెళ్తున్నా, నైతికంగా వెనక్కి వెళ్తోంది. ఆధునిక సాంకేతికత ప్రగతికి తోడ్పడాలి, నేరాలకు కాదు. ఇండియా జస్టిస్‌ రిపోర్ట్‌ 2025 ప్రకారం దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్‌ విభాగాల్లో సైంటిఫిక్‌ సిబ్బంది ఖాళీలు సగటున 50శాతం పైగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 40.5, తెలంగాణలో 91, హర్యానాలో 73, ఉత్తరప్రదేశ్‌లో 66, పశ్చిమ బెంగాల్‌లో 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.హింసలు, నేరాలు పెరుగుతున్న దేశంలో, ఈ స్థాయి నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. నేరాల విచారణలో కీలకమైన ఫోరెన్సిక్‌ నిపుణుల కొరత వల్ల అనేక కేసులు నిలిచిపోతున్నాయి. ఇది ప్రజల్లో న్యాయ నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.ప్రభుత్వాలు వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలి. న్యాయం వేగంగా జరిగే వ్యవస్థను బలోపేతం చేయాలి.

సమాజంలో మానవీయ విలువలు పెంపొందించకపోతే హింస పెరుగుతుంది. మనిషి ఎదగాలంటే ముందు ఆలోచనలో స్వచ్ఛత ఉండాలి. ”మనిషి పెరిగితే చాలదు, ఎదగాలి” అంటే శరీరం కాదు, మనసు పెరగాలి, ఆలోచన విస్తరించాలి.పెరగడం సహజం, ఎదగడం గర్వకారణం.ఎదిగినవారు విభిన్నంగా ఆలోచిస్తారు, నూతన మార్గాలను వెతుకుతారు.కాని నేటి సమాజంలో ”నాకెందుకు?” అనే నిర్లిప్తత మానవతను నశింపజేస్తోంది. ఇలాంటి ఆలోచనల వల్ల మనిషి ఎదగకముందే వృద్ధుడవుతాడు.”ఎవరో వస్తారు, ఏదో చేస్తారు” అని ఎదురుచూస్తూ జీవితాన్ని వృథా చేసేస్తాడు. కార్యసాధకుడు భయపడడు. భయానికి విరుగుడు – ఆత్మవిశ్వాసం. మంచి ఆలోచనలు, నిబద్ధతతో ముందుకు సాగడమే విజయానికి మార్గం. కవి శ్రీశ్రీ చెప్పినట్లుగా ”గాయం తెలియని శిల్పం లేదు, నిప్పు ఎరుగని ఖడ్గం లేదు.

”జీవితంలో ఏదీ మన దగ్గరికి తానుగా రాదు. శోధించి, సాధించాల్సిందే. మన ఆలోచనలే మన దిశను నిర్ణయిస్తాయి. క్రమబద్ధమైన, లోతైన ఆలోచనలు మన జ్ఞానాన్ని, మానసిక ధైర్యాన్ని పెంచుతాయి.మంచి ఆలోచనలు మంచి ఫలితాలు తెస్తాయి. చెడు ఆలోచనలు, చెడు ఫలితాలనిస్తాయి. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే అవుతాడు. ఆలోచన శుద్ధి మనసుకు శాంతి, జీవితానికి స్పష్టత, విజయానికి బాట. స్వార్థం, అత్యాశలను తగ్గిస్తే మనిషి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. పాశ్చాత్య జ్ఞానులు చెప్పిన మాట శాశ్వత సత్యం. డబ్బు మనిషి చేతిలో ఉండాలి, మనిషి డబ్బు చేతిలో కాదు. మనిషి ఎదుగుదల అంటే ఉద్యోగం, పదవి, డబ్బు కాదు.

అది నైతికతతో కూడిన ఆలోచన, ఆచరణ, సేవా భావం, సామాజిక బాధ్యత.ఎదిగినవాడు తనతో పాటు సమాజాన్ని కూడా ఎదిగించాలి. ఆలోచనలో సత్ప్రవర్తన, జీవితంలో నిబద్ధత, ఇవే నిజమైన వ్యక్తిత్వ సూచికలు. మనిషి పెరిగితే ముసలివాడు అవుతాడు,ఎదిగితే సమగ్ర వ్యక్తిత్వం గల మనిషి అవుతాడు.ఎదిగిన మనసు, నిబద్ధతతో కూడిన ఆలోచనలతో పాటూ..నాయకత్వ స్థానాల్లో ఉన్న పాలకులు చాలా పాత్రలు పోషించాల్సి ఉంటుంది.రోజువారి బాధ్యతలతో పాటు ముఖ్యంగా చేయాల్సినవి రెండు ఉన్నాయి. ఒకటి దేశ సమగ్ర అభివృద్ధికి, సమ్మిళిత ప్రగతికి వ్యూహరచన. రెండవది ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన సమాజాన్ని ప్రోత్సహిస్తూ రెండో తరం నాయకులను తయారు చేయడం.ఇవే మన దేశానికీ దిశానిర్దేశం.

మేకిరి దామోదర్‌, 9573666650

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -