Friday, October 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎకరాకు రూ.50వేలు నష్టపరిహారమివ్వాలి

ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారమివ్వాలి

- Advertisement -

20 శాతం తేమ ఉన్నా ధాన్యం కొనాలి
పంట పరిహారంపై ఆందోళనలు
బీసీ రిజర్వేషన్‌పై బీజేపీ ద్వంద్వ వైఖరి
రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కేంద్రం వివక్ష
అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిన మోడీ
నిరుద్యోగ జేఏసీకి సీపీఐ(ఎం) మద్దతు : పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఖమ్మంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.50వేల చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వర్షాల వల్ల ధాన్యంలో తేమ శాతం పెరిగిన దృష్ట్యా 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని కోరారు. వెంటనే నష్టాలను అంచనా వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం చెల్లించాలన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో గురువారం విలేకరుల సమావేశంలో జాన్‌వెస్లీ మాట్లాడారు. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పంట నష్టాలను సేకరిస్తున్నామని తెలిపారు. నష్టాలను అంచనావేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామ న్నారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే వారితో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

చేతికొచ్చే సమయంలో వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ.30వేల నుంచి రూ.60వేలకు పైగా రైతులు నష్టపోయారని తెలిపారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం వర్షాలకు కొట్టుకుపోయిందన్నారు. పంటలు దెబ్బతినటంతోపాటు చేలల్లో మేటలు వేసిన ఒండ్రు, ఇతరత్రా చెత్తాచెదారం తొలగించటానికి మరికొంత వెచ్చించాల్సి ఉంటుం దన్నారు. అనేక చోట్ల ఆస్తి, ప్రాణనష్టం సంభవించాయని తెలిపారు. పత్తితీత దశలో వర్షాలు రావటంతో నల్లగా మారిందన్నారు. ఫలితంగా రైతులు పెట్టుబడి, శ్రమ కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక చోట్ల మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో కోతకు వచ్చే వరి కూడా నేలవాలిందన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమల్లో బీజేపీ నాటకం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ వైఖరి కారణంగానే ఇది అమలు కావటం లేదని విమర్శించారు. ఈ రిజర్వేషన్‌ల విషయంలో పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలన్నా.. రాజ్యాంగ సవరణ జరగాలన్నా కేంద్ర ప్రభుత్వం పరిధిలోవే అని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ నాటకాలాడుతోందని, ద్వంద్వ వైఖరి అనురిస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్‌ను 9వ షెడ్యూల్‌లో చేర్చి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం కోసం పోరాడాలనుకునే శక్తులు కేంద్ర ప్రభుత్వంపైనా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌, సర్వేలు చేశామంటే కుదరదని, అఖిలపక్షంతో కలిసి కేంద్రంపై పోరాడాలని సూచించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. పోస్టుల భర్తీపై పోరాటం
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించటంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగాలేదని జాన్‌వెస్లీ అన్నారు. బకాయి రూ.8వేల కోట్లుంటే రూ.1200 కోట్లు చెల్లిస్తామని ఒప్పందం చేసుకొని చెల్లించపోవటంతో ప్రయివేటు విద్యాసంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదన్నారు. దీని వల్ల విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. నిరుద్యోగ జేఏసీ ఆందోళనలకు సీపీఐ(ఎం) మద్దతు ఇస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వ నోటిఫికేషన్‌లలోని పోస్టులనే భర్తీ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్యం
రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యపూరిత వైఖరి అనుసరిస్తోందని జాన్‌వెస్లీ ఆరోపించారు. బనకచర్ల విషయంలో ఆంధ్రా-తెలంగాణ వాటా తేల్చాలన్నారు. ఈ విషయంలో ఏకపక్షంగా బీజేపీ వ్యవహరించి తెలంగాణకు అన్యాయం చేయటానికి ప్రయత్నించడాన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రానికి బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వటంలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఇవ్వటంలోనూ నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. రాజ్యాంగాన్ని, హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగి స్వతంత్ర నిర్ణయాలు తీసుకో వటంలో మోడీ విఫలమవుతున్నారని విమర్శించారు. సామ్రాజ్యవాద విధానాలు, ట్రంప్‌ టారిఫ్‌లకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలన్నింటితో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల సందర్శన
మొంథా తుపాను ప్రభావిత మండలాలు కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పర్యటించినట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. నాణ్యతతో సంబంధం లేకుండా పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని కోరారు. ఎకరానికి 60 బస్తాల దిగుబడి రావాల్సిన వరి 30 బస్తాలు మాత్రమే వస్తోందన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, ఎండీ అబ్బాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీరాంనాయక్‌, వై.విక్రమ్‌, బుర్రి ప్రసాద్‌, తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేశ్‌, కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, నవీన్‌రెడ్డి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి పిట్టల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -