డిసెంబర్ 12న గిరిజన సంక్షేమ కమిషనరేట్ ముందు నిరసన
గిరిజన సంక్షేమ శాఖ జేడీకి టీపీటీఎఫ్ నేతల నోటీసు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మూడు దశల పోరాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వచ్చేనెల 12,13 తేదీల్లో పాఠశాలల ముందు, అదేనెల 24న ఐటీడీఏ కార్యాలయాల ముందు, డిసెంబర్ 12న గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ ముందు నిరసన ప్రదర్శనలను చేపట్టనున్నట్టు పిలుపునిచ్చింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ) ఎం దిలీప్ కుమార్‌ను గురువారం హైదరాబాద్‌లో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి కలిసి ప్రత్యక్ష నోటీసును అందజేశారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పండితులు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేసి వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 
సీఆర్టీలను రెగ్యులరైజ్ చేసి టైం స్కేల్‌ను వర్తింపజేయాలని కోరారు. అన్ని పాఠశాలలకూ ప్యాటర్న్ ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని సూచించారు. ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసి ప్రతి బడికీ ప్రధానోపాధ్యాయుల పోస్టును మంజూరు చేయాలని తెలిపారు. ప్రతి బడికీ సర్వీస్ పర్సన్లను నియమించాలనీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వసతి గృహాలకు ప్రత్యేకంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. అన్ని ఆశ్రమ పాఠశాలలకు డిజిటల్ బోధనోపకరణాలు, సైన్స్ పరికరాలు, కంప్యూటర్ ల్యాబ్‌లను మంజూరు చేయాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలను అందించాలని తెలిపారు.

 
                                    