మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలి
ఐద్వా పోరాటంతోనే ఆస్తిలో మహిళలకు సగభాగం : ఐద్వా సంగారెడ్డి జిల్లా నాల్గో మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సమాజంలో స్త్రీ లేకుంటే మనుగడ లేదని, సమాజానికి వెలుగు ఆమెనేనని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ అన్నారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో గురువారం ఐద్వా సంగారెడ్డి జిల్లా నాల్గో మహాసభ జరిగింది. ఐద్వా జెండా ఎగురవేసి మహాసభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మీ మాట్లాడుతూ.. 1981లో ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి అనే నినాదంతో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా కోసం 1984లో ఐద్వా పోరాటం చేయడం వల్లే నాటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ మహిళలకు ఆస్తిలో మగవారితో సమానంగా వాటా పొందేలా చట్టం తీసుకొచ్చారని వివరించారు. 
మహిళలు స్వయం వక్తిగా ఎదిగేందుకు మహిళా పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందుతారన్నారు. ఎలాంటి షరతులూ లేకుండా మహిళలకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వం కూడా భూమి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. మహిళలకు భూమి ఉంటే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని, వ్యవసాయం చేయడంలో మహిళలు ముందంజలో ఉంటారన్నారు. అదే విధంగా మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై రోజు రోజుకూ దౌర్జన్యాలు, హింస, లైంగికదాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
ప్రస్తుతం సమాజంలో మనువాద పోకడలు పెరిగిపోయాయని, ఈ పోకడల వల్ల మహిళలు ఇంటి నుంచి బయటకు రావద్దనే నిబందనలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు ఎక్కువయ్యాయని, వాటిని నిరోధించేందుకు ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు. మహిళలకు అండగా ఐద్వా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని కోరారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశాలత, జిల్లా అధ్యక్షులు సునీత, కార్యదర్శి లలిత, నాయకులు లక్ష్మీ, మల్లీశ్వరి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

 
                                    