– దారుణంగా హత్య చేసిన కాంగ్రెస్ గుండాలు
నవతెలంగాణ – బోనకల్ : చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావుని శుక్రవారం తెల్లవారుజామున కాంగ్రెస్ గుండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పాతరపాడు గ్రామపంచాయతీలో ఓడిపోతామని భయంతోనే కాంగ్రెస్ గుండాలు అత్యంత కిరాతకంగా కాపు కాశి హత్య చేశారని సీపీఐ(ఎం) ఆరోపించింది.
తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగా కాంగ్రెస్ గుండాలు కాపు కాశి కత్తులతో పొడిచి చంపారు. సామినేని రామారావు హత్య ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. మృతదేహాన్ని ఖమ్మం సీపీ సునీల్ దత్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు తదితరులు సందర్శించారు. సామినేని రామారావు హత్యను సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

 
                                    