Saturday, November 1, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి8వ కేంద్ర వేతన నిబంధనల వెనుక…

8వ కేంద్ర వేతన నిబంధనల వెనుక…

- Advertisement -

పదినెలల తర్వాత 28అక్టోబర్‌ 25న కేంద్ర మంత్రివర్గం 8వ వేతన యంత్రాంగ సూచన నిబంధనలను నిర్ణయించింది. 16 జనవరి 25న కేంద్ర మంత్రివర్గం వేతన కమిటీని ప్రకటించింది. కాని సభ్యులను నియమించ లేదు. సూచన నిబంధనలను నిర్ణయించలేదు. ఈపనికి పదినెలలెందుకో దేవపుత్రులకే తెలుసు. కేవలం వేతన యంత్రాంగ ప్రకటన ఎందుకో ఏలినవారికే ఎరుక. 8వ వేతన యంత్రాంగ తాత్కాలిక సంస్థ అధ్యక్షురాలిగా న్యాయమూర్తి రంజన ప్రకాశ్‌ దేసాయి, పాక్షిక సమయ సభ్యులుగా పులక్‌ ఘోష్‌, సభ్యకార్యదర్శిగా పంకజ్‌ జైన్‌ వ్యవహరిస్తారు. 18 నెలల్లో సిఫారసులను అందిస్తారు. అవసరమనిపిస్తే ఏవైనా విషయాలపై మధ్యంతర నివేదికలను ఇవ్వచ్చు.

ఆధునిక సాంకేతిక యుగంలో ఈ పనులకు ఏడాదిన్నర కాలం ఎక్కువ. న్యాయమూర్తి రంజన ప్రకాశ్‌ దేసాయి రాజ్యాంగ, పౌర, నేర చట్టాల, లింగ న్యాయ, మానవ హక్కుల నిపుణురాలు. ఆమెకు ఆర్థిక అంశాల్లో పట్టు లేదు. బాంబే హైకోర్టులో న్యాయవాది కాలమంతా ఆమె ప్రభుత్వ న్యాయ పదవుల్లో ఉన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత 1డిసెంబర్‌ 2014 నుండి జమ్ము,కశ్మీర్‌ నియోజకవర్గ పునర్విభజన, లోక్‌పాల్‌ నియామకాల అధ్యక్షురాలు వంటి ప్రభుత్వ పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం గుజరాత్‌ ఏకీకృత పౌరస్మృతి నిపుణుల కమిటీ అధికారి. ఈమె ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో ప్రభుత్వ పక్షం వహించకుండా ఉండగలరా?

బెంగళూరు భారతీయ నిర్వహణ సంస్థలో పనిచేస్తున్న ఆచార్య పులక్‌ ఘోష్‌ సాంకేతిక ఆర్థికవేత్త. గతంలో ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యులు. జీవితమంతా బహుళజాతి సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు సలహాదారుగావ్యవహరించారు. ఈయన ఉద్యోగుల అనుకూల సిఫారసులు చేయలేరు. 30డిసెంబర్‌25న పదవి విరమణ చేయనున్న ఐఏఎస్‌ అధికారి పంకజ్‌ జైన్‌ ఇపుడు పెట్రోలియం, సహజ వాయు శాఖ కార్యదర్శి. గతంలో మోడీ ప్రభుత్వంలో అనేక ఆర్థిక పదవులు నిర్వహించారు. ఈయన ఎవరి పక్షం వహించగలరో అమాయకులు కూడా ఊహించగలరు. వేతన యంత్రాంగ సూచన నిబంధనలు ఉద్యోగుల జీతభత్యాల, పెన్షన్ల మార్పుకట, పెంపునకు కాదు. గతంలో సవరణ అన్న ద్వంద్వార్థ పదాన్ని వాడేవారు. ఇపుడు మార్పు అని తమ ఉద్యోగ వ్యతిరేకతను చాటారు. ఇక నిబంధనలను పరిశీలిద్దాం..

1 దేశంలోని ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక జాగ్రత్త అవసరాలు. దేశ ఆర్థిక స్థితి ఆకాశానికి ఎగిసిందని పాలకులు ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక అధో గతిని సూచించే ఆర్థిక జాగ్రత్తను పాటించమని వేతన యంత్రాగానికి నిబంధన విధిస్తారు. ఇవి పరస్పర విరుద్ధాలు. అయినా ఆర్థిక పరిస్థితిని పరిశీలించవలసిన, పొదుపును పాటించవలసిన బాధ్యత వేతన యంత్రాంగానిదా? ప్రభుత్వానిదా? వేతన యంత్రాంగం ఉద్యోగుల, పెన్షనర్ల ఆర్థిక స్థితులు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అంశాలను పరిగణించాలి. ఈ నిబంధనలు వేతన, పెన్షన్ల నియంత్రణకే.
2.అభివఅద్ధి ఖర్చులకు, సంక్షేమ చర్యలకు సరిపడా వనరుల నిర్ధారణ. బహుళజాతి సంస్థలు, సంపన్నులు చెల్లించ వలసిన పన్నులు రాబట్టి, బ్యాంకుల నిరర్థక ఆస్తులను తగ్గించి ఆర్థిక వనరులను అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ పనిని వేతన యంత్రాగానికి అప్ప జెప్పడం అంటే వేతనాలను, పెన్షన్లను అదుపు చేయమనే.
3.(ఉద్యోగుల) వాటా, నిధులు లేని పెన్షన్‌ పథకాల ఖర్చు (తగ్గింపు). పాత పెన్షన్‌ పథకంలో కూడా ఉద్యోగుల జీతాల నుండి కొంత సొమ్మును పెన్షన్‌ నిధికి జమచేస్తారు. పెన్షన్‌ చెల్లింపులో ప్రభుత్వ బాధ్యతను, పౌరుల హక్కును సుప్రీంకోర్టు పలుమార్లు నొక్కి చెప్పింది. ఈ నియమం కొద్దిగా కొనసాగుతున్న పాత పెన్షన్‌ పథకాన్ని ఆపడానికే.

4.కేంద్ర వేతన సిఫారసులను అనుసరించే రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితులపై కేంద్ర వేతన యంత్రాంగ సిఫారసుల ప్రభావం. దేశమంతా ఒకే పనికి ఒకే స్థాయి వేతనాలు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల వేతన,పెన్షన్లను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన, పెన్షన్లను నియంత్రించమనడం కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్య.
5.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల, ప్రయివేటు రంగ ఉద్యోగుల వేతన పొందిక, ప్రయోజనాలు, పని పరిస్థితులు. ప్రయివేటు రంగంలో శ్రామికుల శ్రమదోపిడీ ఎక్కువ. వేతనాలు తక్కువ. పని పరిస్థితులు అధ్వాన్నం. ఉద్యోగుల ప్రయోజనాల కంటే యాజమాన్యాల లాభాలకు ప్రాముఖ్యత ఉంటుంది. వాటితో కేంద్ర ప్రభుత్వ రంగాన్ని పోల్చడం, ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలను, పెన్షన్లను తగ్గించడానికే.

8వ వేతన యంత్రాంగ సిఫారసులు 1జనవరి 2026 నుండి అమలు కావాలి. ఈ గడువుకు రెండు నెల్లే ఉంది. సిఫారసులు అందగానే ప్రభు త్వం వాటిని అమలుచేయదు. పరిశీలనలు, విశ్లేషణలు, మంత్రివర్గ ఆమోదాలు ఉంటాయి. కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్‌, అశ్విని వైష్ణవ్‌ మంత్రివర్గం నిర్ణయించిన నాటి నుండి సిఫారసులు అమలు అవుతాయన్నారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల న్యాయమైన పెంపును కొంతకాలం ఆపడం తగదు. వయోరోగ మరణాలకు గురయ్యే పెన్షనర్ల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతాయి. మన ప్రజాప్రతినిధులు తమ జీత భత్యాలను, పెన్షన్లను తామే పెంచుకుంటారు. వేతన యంత్రాంగ నిబంధనలను ప్రకటించిన వెంటనే నేటి ప్రభుత్వ బాకా అయిన రిపబ్లిక్‌ టీవీ ఈ నిబంధనలతో కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఉపశమనం అని ఊదింది. కనీస వేతనం రూ.18 వేల నుండి 30 వేలకు పెరుగుతుందని, 13 శాతం జీతాలు పెరుగుతాయని, కేంద్ర ఖజానా పై 2.4 నుండి 3.2 లక్షల కోట్ల భారం పడుతుందని మరి కొన్ని పత్రికలు ఆ సాయంత్రమే ఘోషించాయి. వీటిని తెలుసుకున్న బడుగు జీవులు తమ అధోగతికి పాలకులు కారణమని తెలుసుకోకుండా, ఈ ఉద్యోగులపై కోపద్వేషాలు వెళ్లగక్కుతారు. సమాజంలో అనవసర అంతర్గత విరోధభావాలు తలెత్తుతాయి.

    సంగిరెడ్డి హనుమంత రెడ్డి
    9490204545

    - Advertisement -
    RELATED ARTICLES
    - Advertisment -

    తాజా వార్తలు

    - Advertisment -