ట్రంప్ ప్రభుత్వం శాస్త్ర,సాంకేతిక రంగాలకు సమకూర్చే నిధులకు పదేపదే కోత పెట్టి, ఆ రంగాల అభివృద్ధిని దెబ్బతీస్తున్నది. గతంలో ఎన్నడూ ఇలా లేదు. 2025 జనవరి, మార్చి నెలల మధ్య కాలంలో మూడు ప్రభుత్వ సంస్థలకు వెయ్యికి పైగా గ్రాంట్లను ట్రంప్ ప్రభుత్వం రద్దుచేసింది. నేషనల్ కాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు ఇచ్చే నిధుల్లో 31 శాతం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కిచ్చే నిధులలో 21 శాతం, నేషనల్ సైన్స్ ఫౌండషన్ నిధుల్లో 9 శాతం కోత పెట్టింది. కోత విధించటంలో నాసాకు సైతం మినహాయింపు లేదు. జులై 4న అమెరికా అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారిన ఒన్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్, 900 కోట్ల డాలర్లుగా వున్న నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ప్రస్తుత బడ్జెటును 56 శాతం తగ్గించాలని చెప్పింది. సిబ్బందిలో, ఫెలోషిప్‌లలో 73 శాతం కోత పెట్టాలంది. పర్యావరణ పరిరక్షణ సంస్థ అయిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నిధులపై దారుణమైన కత్తిరింపులు చేసింది. నేచర్ పత్రిక ప్రకారం, దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న 4వేల పరిశోధనల కిచ్చే గ్రాంట్లను అడ్డంగా రద్దు చేసిపారేసింది.
2023లో నోబుల్ ప్రైజ్‌ను సాధించిన ఎంఆర్‌ఎన్‌ఏ వాక్సిన్ కార్యక్రమం యాభైకోట్ల డాలర్ల కత్తిరింపులను ఎదుర్కొంటున్నది. దీనితో పాటు మరో 22వాక్సిన్ ప్రాజెక్టులకు కూడా ఇదే గతి దాపురించింది. యుఎస్‌ఏయిడ్ మొత్తంగా మూత పడే ప్రమాదం ఉన్నది. ఇది పూర్తిగా మూతపడితే ఆఫ్రికాలోని హెచ్‌ఐవి, క్షయ, మలేరియా నిరోధక కార్యక్రమాలు పూర్తిగా రద్దవుతాయి. భౌగొళికంగా ఇతర దేశాలు, సంస్థలతో కలసి నిర్వహించే వాక్సిన్ల,వ్యాధి నిరోధక కార్యక్రమాలకు అందచేసే నిధులు ఉపసంహరించబడతాయి. ఈ నిధుల కోత మూలంగా ప్రాధమికంగా జరిపే పరిశోధనలకు ప్రమాదం ఏర్పడుతుంది. సగం దారిలో వున్న నూతన సైన్స్ ఆవిష్కరణలు కుంటుపడతాయి. ఒకప్పుడు ప్రపంచంలోని ప్రతిభావంతులను ఆకర్షించే కేంద్రంగా వున్న అమెరికా, ఇప్పుడు మేధోవలస ప్రమాదాన్ని చూడబోతున్నది.
మేధోవలస
తూర్పు ఆఫ్రికా దేశమైన మెడగాస్కర్‌లో వరదలు, తుఫానులు ప్రజల ఆరోగ్యంపై చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న ఒక అంత్రోపాలాజిస్ట్ (మానవ శాస్త్రవేత్త) ఫెలోషిప్‌ను వెనక్కి తీసుకోవటంతో అతను అమెరికాకు చెందిన జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీని వదిలి బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి మారాడు. అమెరికా ఒహియో రాష్ట్ర యూనివర్సిటీకి చెందిన మరో సీనియర్ సైన్స్ పరిశోధకుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులివ్వటం నిలిపివేయటంతో గత్యంతరంలేక క్లినికల్ పరీక్షలు అర్ధాంతరంగా నిలిపివేశాడు. ఈ విషయాన్ని జులై 20, 2025 గార్డియన్ పత్రిక తెలిపింది.
అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య ఆగస్టులో లక్షా యాభై వేల మంది కంటే తక్కువకు పడిపోయిందని నేషనల్ అసోసి యేషన్ ఆఫ్ ఫారిన్ స్టూడెంట్ అడ్వైజర్స్ ఒక నివేదికలో పేర్కొంది. దీని మూలంగా 700 కోట్ల డాలర్ల ఆదాయాన్ని, అరవైవేల ఉద్యోగాలను అమెరికా కోల్పోయిందని ఆగస్టు 3, 2025 నాటి ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. 2018 నుంచి ‘చైనా ఇనిషియేటివ్’తో వేలమంది చైనా శాస్త్రవేత్తలు ప్రముఖ విశ్వవిద్యాలయాలను, సంస్థలను వదిలి తిరిగి తమ స్వదేశానికి వెళ్లిపోయారు. వీరేగాక, ఐరోపా శాస్త్రవేత్తలు కూడా అమెరికాకు యూనివర్సిటీలతో కూడిన ఐవీ లీగ్ యూనివర్సిటీలను వదిలి తమ సొంత దేశాలకు వెళుతున్నారు ( నేచర్, మే 13, 2025).
అమెరికా వైఖరికి భిన్నంగా, చైనా గత రెండు దశాబ్దాల కాలంగా శాస్త్ర, సాంకేతిక, నూతన ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులను స్థిరంగా పెంచుకుంటూ వెళ్లింది. వ్యూహాత్మక, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా దేశీయ పరిశోధనలకు ప్రాముఖ్యం ఇచ్చింది. ఈ పరిశోధన వలన వచ్చిన ఫలితాలు రాశిలోనూ, వాసిలోనూ అధిక్యతను చూపిస్తున్నాయి. నేచర్ ఇండెక్స్ రీసెర్చ్ లీడర్స్ ర్యాంకింగ్‌లో 2024 డిసెంబర్ 31 నాటికి పాశ్చాత్య సంస్థల ర్యాంకులు దిగజారాయి. చైనాలో జీవ, (బయోసైన్స్), రసాయనిక, భౌతిక, ఆరోగ్యశాస్త్ర రంగాలలో పరిశోధనలు ఎక్కువగా జరిగాయి. భౌగోళికంగా అత్యుత్తమైన పది యూనివర్సిటీల్లో చైనాకి చెందినవే ఎనిమిది ఉన్నాయి. హార్వర్డ్ యూని వర్సిటీ ర్యాంకు కన్నా పైస్థాయిలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వుంది. యూరోప్‌లో జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ సొసైటీ ఒక్క దానికి మాత్రమే ఈ జాబితాలో చోటుదక్కింది. ( నేచర్, జూలై, 24, 2025)
1990 మధ్య కాలం నుంచి, చైనా పొజెక్ట్ 211, ప్రొజెక్ట్ 985, సి9 లీగ్ లాంటి ఉన్నతవిద్యా విధానాలను అమలుపరచటంతో పరిశోధనలు పెరిగాయి, బోధనా నైపుణ్యం పెరిగింది. 2015 నాటికే చైనా ఒక డజను దాకా ప్రపంచ స్థాయి యూనివర్సిటీలను కలిగివుంది. వీటిలో చాలా సంస్థలు ఇప్పుడు పశ్చిమ దేశాల అత్యున్నత స్థాయి కలిగిన సంస్థలతో పోటీ పడుతున్నాయి. ”ప్రపంచ శాస్త్ర విజ్ఞానాభివృద్ధిలో చైనా అతి త్వరగా అమెరికాను దాటి ముందుకెళ్లింది. 2024 ఆధారంగా తీసిన డేటా చూస్తే నేచర్ ఇండెక్స్ డేటాబేస్‌లో ఒక ఏడాదిలోనే అమెరికా కంటే చైనా స్థాయి నాలుగు రెట్లు పెరిగింది,” అని నేచర్‌లోని ఒక వ్యాసంలో పేర్కొన్నారు. క్లారివేట్ ఎనాలిటిక్స్ డేటా ప్రకారం 2018 -2020 మధ్య కాలంలో ప్రపంచం ముందుకు వచ్చిన ఒకశాతం అత్యున్నత శాస్త్ర పరిశోధన పత్రాలలో చైనా సమర్పించినవి 27.2 శాతం అయితే. అమెరికా అందించినవి 24.9 శాతం మాత్రమే (గార్డియన్, ఆగష్టు 11, 2022).
మరింత అభివృద్ధి దిశలో చైనా
సైన్స్ అభివృద్ధికి సంబంధించిన అనేక విశ్లేషణలలో, రానున్న సంవత్సరాలలో చైనా అగ్రస్థానంలోకి చేరి మరింత ముందుకు పోతుందని ఊహిస్తున్నారు. అటువంటి ఒక రంగం కృత్రిమ మేధా (ఏఐ)రంగం. 2021 సంవత్సరంలో కృత్రిమ మేధకు సంబంధించిన ప్రచురణలలో యూరప్, యూ.కె కలిపి 11శాతం, అమెరికా 10 శాతం చేస్తే, వీరిని ఎంతో అధిగమించి చైనా 40 శాతం ప్రచురించింది. ప్రపంచకృత్రిమ మేధను ఉదాహరిస్తూ 2021లో చైనా 29 శాతం పరిశోధనా పత్రాలను ప్రచురించింది. యూ.కె యూరప్ 21.5 శాతం, అమెరికా 15 శాతం పరిశోధనా పత్రాలు మాత్రమే ప్రకటించగలిగాయి. (నేచర్, ఆగష్టు 10, 2023)
పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) కోసం 2023లో అమెరికా 82వేల 340కోట్ల డాలర్లు అమెరికా ఖర్చు పెట్టింది. దీనితో పోలిస్తే చైనా పెట్టిన వ్యయం 78వేల కోట్ల డాలర్లు మాత్రమే. అయితే, ఓఇసిడి డేటా ప్రకారం అమెరికా (1.7శాతం), ఈరోపియన్ యూని యన్ (1.6 శాతం), జర్మనీ (0.8 శాతం), ఫ్రాన్స్ (-0.5 శాతం) ఈ రంగంలో వ్యయాన్ని పెంచుతుంటే, వాటన్నిటికంటే చైనా ఏడాదికి 8.7 శాతం చొప్పున అత్యధికంగా వ్యయం చేస్తున్నది. అమెరికా ప్రభుత్వం యూనివర్సిటీలకు, పరిశోధనా సంస్థలకు, నేషనల్ సైన్స్ ఫౌండెషన్‌కు క్రమంగా బడ్జెట్లలో కత్తిరింపులు చేస్తుంటే, చైనా నాయకత్వం శాస్త్ర, సాంకేతిక, నూతన ఆవిష్కరణలకు, వాటి పరిశోధన అభివృద్ధికి బలం చేకూర్చే కార్యక్రమాలు చేపడుతున్నది. మేడిన్ చైనా 2025 ముగుస్తున్నది, శాస్త్ర, సాంకేతిక అభివృద్ధినుద్దేశించి మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళిక (2021-2035), శాస్త్ర, సాంకేతిక, నూతన ఆవిష్కరణల బృహత్తర కార్యక్రమం (2030) క్వాంటం పరిశోధనలోను, కృత్రిమ మేధ, సెమికండక్టర్ రంగాలలో ప్రపంచానికి శక్తి కేంద్రంగా చైనాను నిలపాలనే లక్ష్యంతో సాగుతున్నాయి.
చైనా దేశీయంగా సైన్స్ రంగంలో పరిశోధన, అభివృద్ధికి చేస్తున్న వ్యయాన్ని విస్తరించాలని సంకల్పించింది. ఇప్పుడు వున్న ఏడు శాతం నుంచి అమెరికా పెడుతున్న ఇరవై శాతం స్థాయికి కొన్ని సంవత్సరాలలో తీసుకెళ్లాలని ఆశిస్తున్నది. ఇదే సరళి గనుక కొనసాగితే రెండు లేక మూడేండ్లలోనే , శాస్త్ర పరిశోధన, అభివృద్ధికి పెట్టే ఖర్చు విషయంలోనే కాదు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో నాయకుడిగా వున్న అమెరికా స్థానాన్ని సైతం చైనా ఆక్రమిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాలుగా సైన్స్‌కి, నూతనఆవిష్కరణలకీ, ప్రపంచ స్థాయి యూనివర్సిటీలకు, సైన్స్ పురోగమనానికి, అమెరికా ప్రపంచ నాయకుడిగా వుంది. ఏమైనా, నేడు, పరిశోధన, అభివృద్ధి రంగానికి , ఉన్నత విద్యకు పెట్టే ప్రభుత్వ పెట్టుబడి తీవ్రంగా తగ్గించటంతో అమెరికా ఇప్పుడు అనుభవిస్తున్న హోదాకు ప్రమాదం వాటిల్లింది. ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గంలోనే సాగితే, నికరంగా, భారీ నిధులు అందిస్తూ, సమన్వయ రీతిలో పనిచేస్తే 21వ శతాబ్దపు భౌగోళిక రాజకీయలను పునర్‌నిర్మిస్తూ అమెరికాను దాటి చైనా ఎదుగుతుంది.
(‘ది హిందూ’ సౌజన్యంతో)
అనువాదం: కర్లపాలెం
వెన్ని వి.కృష్ణ



