Saturday, November 1, 2025
E-PAPER
Homeజాతీయంఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలి

ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలి

- Advertisement -

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కారణమని, అందుకే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై నిషేధం విధించాలని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా సర్దార్‌ వల్లభారు పటేల్‌ కూడా ఒకసారి నిషేధం విధించారని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1948లో మహాత్మాగాంధీ హత్య తరువాత ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శిస్తూ సర్దార్‌పటేల్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. పటేల్‌ హయాంలో నిషేధం విధిస్తే 2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, ఇప్పుడు మళ్లీ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాశ్మీర్‌ మొత్తాన్ని దేశంలో కలపాలని సర్దార్‌ పటేల్‌ కోరుకున్నారని, అందుకు అప్పటి ప్రధాని నెహ్రూ నిరాకరించారని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే స్పందించారు.

సర్దార్‌ పటేల్‌ అప్పట్లో జన్‌సంఘ్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి రాసిన లేఖను ఖర్గే ప్రస్తావిస్తూ మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన పరిస్థితిని ఆర్‌ఎస్‌ఎస్‌ సృష్టించిందని ఆ లేఖలో పటేల్‌ పేర్కొన్నట్టు తెలిపారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ మధ్య విభేదాలున్నట్టు బీజేపీ చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరించేందుకు ఎల్లప్పుడూ యత్నిస్తోందని విమర్శించారు. అయితే నెహ్రూ, పటేల్‌ మధ్య చక్కటి సంబంధాలు ఉండేవని, ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకునే వారని తెలిపారు. దేశ ఐక్యతను పటేల్‌ తీర్చిదిద్దారని నెహ్రూ ప్రశంసించారని, దేశానికి నెహ్రూ ఆదర్శమని పటేల్‌ అభివర్ణించారని గుర్తు చేశారు. అక్టోబర్‌ 31న సర్దార్‌ పటేల్‌ జయంతితో పాటు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి అని, వీరిద్దరూ గొప్ప నేతలని కొనియాడారు.

కాంగ్రెస్‌ది నయవంచన :బీజేపీ
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. పటేల్‌ పేరును కాంగ్రెస్‌ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని తప్పుపట్టింది. పటేల్‌ వారసత్వాన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌పై దాడికి ఆయన పేరును వాడుకుంటోందని బీజేపీ ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా ఆరోపించారు. ‘ఐఎన్‌సీ అంటే ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కాదు. ఇండియన్‌ నాజీ కాంగ్రెస్‌. కాంగ్రెస్‌ ఎన్ని కుట్రలు పన్నినా ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయేతర సంస్థ అని, ఆ సంస్థ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవచ్చని కోర్టు చెప్పింది. ఇది సహించలేని కాంగ్రెస్‌ పార్టీ.. పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ, ఎంఐఎంలకు బాసటగా ఉంటూ దేశ సంక్షేమం కోసం పాటుపడుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌పై విషం చిమ్ముతోంది’ అని ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -