తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి
శంషాబాద్‌లో భరోసా సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-శంషాబాద్
అన్యాయానికి గురైన బాధిత మహిళలు, చిన్నారులకు ఆత్మస్థైర్యం కల్పించి అండగా నిలవాలనే ఉద్దేశంతో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) శివధర్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయం పక్కన నిర్మించిన నూతన భరోసా కేంద్రాన్ని డీజీపీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 33వ భరోసా కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. 2016లో మొదటిసారి భరోసా కేంద్రాన్ని ప్రారంభించినట్టు గుర్తు చేశారు. త్వరలో మరో ఆరు జిల్లాల్లో ఈ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. మహిళలు, చిన్నారులు, బాలికలకు భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
మనసు విప్పి చెప్పుకోలేని కొన్ని విషయాలను వారి నుంచి రాబట్టి వారికి భరోసా కల్పించేందుకు ఈ కేంద్రాలు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. భరోసా కేంద్రాల్లో నిపుణులైన కౌన్సిలర్లు ఉంటారని, వారి ద్వారా బాధితులకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వింగ్ ఆధ్వర్యంలో భరోసా కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కేంద్రాల్లో బాధితుల మహిళలు చిన్నారులకు ఆర్థిక సాయం కూడా అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్ చారుసిన్హా, శంషాబాద్ డీసీపీ రాజేష్, ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్, ఇన్స్‌స్పెక్టర్ కె.బాలరాజు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



