బీహార్ ఎన్నికలపై సీఈసీ జ్ఞానేశ్‌కుమార్
కాన్పూర్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలో ఎలాంటి హింసను సహించమని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ఆదివారం స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు శాంతియుతంగా, స్వేచ్ఛగా ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సంఘం దీనికి పూర్తి సిద్ధంగా ఉందని చెప్పారు. ఉత్తప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన విషయాన్ని తెలిపారు. పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా ఇసికి అందరూ సమానమేనని చెప్పారు. బీహార్‌లోని మోకామాలో జేఎస్‌పీ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ హత్యను తీవ్రంగా పరిగణించిన ఈసీ , పాట్నా ఎస్పీ (గ్రామీణ), మరో ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకున్న ఒక రోజు తరువాత సీఈసీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ హత్య కేసులో మోకామా జేడీ(యూ) అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్ అనే ఇద్దర్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
బీహార్‌లోని ఓటర్లందరికీ ప్రజాస్వామ్య పండుగను నిర్వహించుకునే అవకాశం వస్తుదని, ఇది ఒక మోడల్ ఎన్నిక అవుతుందని జ్ఞానేశ్‌కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘243 మంది రిటర్నింగ్ అధికారులు, అదే సంఖ్యలో పరిశీలకులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, పోలీసు పరిశీలకులు, వ్యయ పరిశీలకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. బీహార్ ఎన్నికలు కేవలం పారదర్శకతకు మాత్రమే కాకుండా సామర్థ్యం, నిరాడంబతర, ప్రజాస్వామ్యం యొక్క పండుగ స్ఫూర్తికి కూడా యావత్తు ప్రపంచానికి ఒక మోడల్‌గా నిలుస్తాయని నేను విశ్వాసంగా ఉన్నాను’ అని సీఈసీ తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొనాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘బీహార్‌లోని ఓటర్లంతా ఈ ప్రజాస్వామ్య పండుగను జరుపుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావాలి. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించు కుంటారని నేను ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్’ అని జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
మొదటిదశలో 32 శాతం మంది క్రిమినల్స్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ముప్పై రెండు శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ చేసిన అధ్యయనంలో తేలింది. మొదటి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1,314 మంది అభ్యర్థులలో 1,303 మంది స్వయంగా సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించగా.. 423 (32 శాతం) మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు.
ఎలాంటి హింసను సహించం
- Advertisement -
- Advertisement -



