తమిళనాడులో మద్దతు ఇచ్చిన పార్టీలు
అప్రజాస్వామ్యపద్ధతిలో ఈసీ వ్యవహారశైలి
చెన్నై : సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ (సర్)కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. స్టాలిన్ అధ్యక్షతన బహుళ పార్టీల సమావేశం ఆదివారం జరిగింది. సర్‌కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడాలన్న తీర్మానాన్ని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. బీహార్ సర్ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికీ తీర్పును వెలువరించలేదని, దీంతో ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని తీర్మానం విమర్శించింది. ఈ సమయంలో సర్ ఆమోద యోగ్యం కాదని, ఈ ప్రక్రియను విరమించుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ)ని కోరింది. లోపాలను తొలగించిన తర్వాత , సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత తగిన సమయంలో పారదర్శకంగా దీనిని నిర్వహించాలని తీర్మానం పేర్కొంది.
తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. కేంద్రంలో ని ఎన్డీఏ ప్రభుత్వం చేతిలో ‘కీలుబొమ్మ’ అయిన ఈసీ అప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తీర్మానం పేర్కొంది. బీహార్‌లో సర్ పేరిట మైనారిటీలు, బీజేపీని వ్యతిరేకించే వారి ఓట్లను తొలగించారని, సుప్రీంకోర్టులో, బహిరంగంగా ఈ అంశంపై ప్రకటన చేయడంలో ఈసీ విఫలమైందని పేర్కొంది. తమిళనాడు సహా 11 రాష్ట్రాల్లో ఈసీ ఏకపక్షంగా ప్రకటించిన సర్, ప్రజల ఓటు హక్కును హరించడం, ప్రజస్వామ్యాన్ని నిలువునూ పూడ్చిపెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని సమావేశం పేర్కొంది.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 169 ప్రకారం గెజిట్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మాత్రమే సర్ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆధార్ పన్నెండవ పత్రంగా ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించనందున, సర్ చట్టవిరుద్దమని మండిపడింది.ఓటర్ల పుట్టిన తేదీకి సంబంధించిన పత్రాలను ఇఆర్‌ఒ కోరినపుడు సమర్పించాలని ప్రకటన పేర్కొందని, అయితే ఎప్పుడు డిమాండ్ చేస్తారు, దరఖాస్తు ఫార్మాట్ ఏమిటి, ఎన్ని రోజులు అనుమతిస్తారు, ఎవరికి సమర్పించాలని అన్న ప్రశ్నలకు సమాధానం లేదని .. అంటే ఓటర్ల పేర్లను తొలగించే ప్రణాళిక ఉన్నట్టు కనిపిస్తోందని తీర్మానం తెలిపింది.
సర్‌ను వెంటనే ప్రక టించడంపై కూడా సందేహాన్ని వ్యక్తం చేసింది. నవంబర్ 4 నుండి డిసెంబర్ 4 మధ్య ఈశాన్య రుతుపవనాలు గరిష్టస్థాయికి చేరుకుంటాయని, చాలామంది ఓటర్లు గ్రామీణ రైతులైనందున వారు ఫారాలను సమర్పించడానికి తగినంత సమయం ఉండదని, భారీ వర్షాలవల్ల తలెత్తే అత్యవసర పరిస్థితులను నిర్వహించడంలో రెవెన్యూశాఖ బిజీగా ఉంటుందని, ఈ కాలం ఎస్‌ఐఆర్‌కి తగినది కాదని తెలిపింది. సర్‌ను నిష్పాక్షికంగా, న్యాయమైన రీతిలో, పారదర్శకంగా నిర్వహించాలని తీర్మానం పునరుద్ఘాటించింది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలను కల్పించే బాధ్యతను రాజ్యాంగం ఎన్నికల కమిషన్‌కు అప్పగించిందని, కానీ ఈసీ కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.



