500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం
బాధ్యతతో హైడ్రా బాధితులకు న్యాయం చేస్తాం : హైడ్రా అరాచకాలపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పెద్దల జోలికి వెళ్లకుండా కేవలం పేదలపై అరాచకాలకు పాల్పడుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన హైడ్రా అరాచకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందనీ, బాధ్యతతో హైడ్రా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత కేసీఆర్ పాలనలో నగరం నిర్మాణాలతో నిండిపోయిందని గుర్తుచేశారు. సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 42 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక ఒక్క నిర్మాణం చేపట్టలేదని తెలిపారు. పేదల ఇండ్లను అత్యంత దయనీయంగా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలను మాత్రం వదిలేస్తున్నదని విమర్శించారు.
”రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారు. మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ లోపల ఇల్లు కట్టుకున్నారంటూ… ” వీరికి నోటీసులు ఇచ్చే ధైర్యం హైడ్రా చేస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి గాజులరామారంలో ఉన్న 11 ఎకరాలకు ప్రభుత్వమే అండగా ఉందని కేటీఆర్ ఆరోపించారు. యుపీలో బుల్డోజర్ తన శరీరంపై నుంచే వెళ్లాలని అడ్డుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణలో పేదల ఇండ్లపైకి బుల్డోజర్ వెళ్లకుండా రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తప్పు జరిగితే కూలగొట్టడం తప్పనీ, రెగ్యులరైజ్ చేయాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు.
ప్రజలు చరమగీతం పాడుతారు కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక
మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి దహనం చేసిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గుండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని మండిపడ్డారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే కేటీఆర్ ఆ జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడారు. 60 లక్షల మంది బీఆర్‌ఎస్ కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందనీ, ధైర్యంగా ఉండాలని కోరారు. త్వరలోనే మణుగూరును సందర్శిస్తానని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ తెచ్చిన రౌడీల రాజ్యం, అరాచకత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైన్యంపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అవి నీచమైన కామెంట్స్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని మండిపడ్డారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మనలను సురక్షితంగా ఉంచడం వల్లే రాజకీయాలు చేసుకోగలుగుతున్నామని గుర్తుచేశారు. సరిహద్దుల్లో సైన్యం వల్లే అందరం హాయిగా కుటుంబాలతో జీవించగలుగుతున్నామని తెలిపారు. పాకిస్తాన్‌ను ఏ ఉద్దేశంతో పొగుడుతున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.



