‘తీవ్రపేదరికాన్ని తరిమికొట్టి ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది కేరళలోని మా ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వం. మా అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మా ప్రతిష్టను దిగజార్చేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ చైతన్యవంతమైన మా కేరళ ప్రజల ముందు వారి ఆటలు సాగవు’ అంటున్నారు కేరళ రాష్ట్ర ప్రణాళికా సంఘం బోర్డు సభ్యులు మిని కరుణాకర్. ఇటీవలె సీఐటీయూ వర్కింగ్ ఉమెన్ జాతీయ కన్వెన్షన్‌లో పాల్గొనెందుకు హైదరాబాద్ వచ్చిన ఆమెతో మానవి మాట కలిపింది.
ఇటీవలె కేరళ రాష్ట్రం తీవ్ర పేదరికాన్ని రూపుమాపింది. ఇది ఎలా సాధ్యమైంది?
దీనికి కారణం ‘న్యాయమైన పున:పంపిణి’ అనే నినాదం. దీని ఆధారంగా కేరళ రూపొందించుకున్న ప్రత్యేకమైన అభివృద్ధి నమూనాకు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు వచ్చాయి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే లక్ష్యంతో మేము ఈ నినాదం తీసుకున్నాం. ప్రజలకు అవకాశాలు సృష్టించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేరళలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారి ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించింది. మంచి ఫలితాలను కూడా అందుకుంది. ఆ తర్వాత పాలించిన వామపక్ష ప్రభుత్వాలు ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాలో పేదరిక నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రస్తుత ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తన మొదటి మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించాలనే నిర్ణయం తీసుకుంది. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, క్రమబద్ధమైన కార్యాచరణ ద్వారా మేము అనుకున్నది సాధించగలిగాం.
పేదరిక నిర్మూలన కోసం తీసుకున్న ప్రత్యేకమైన చర్యలు..?
స్థానిక స్వపరిపాలనలో భాగంగా ఆహారం, ఆరోగ్యం, ఆదాయం, గృహనిర్మాణం అనే నాలుగు అంశాలపై దృష్టి పెట్టాము. ఈ నాలుగు సూచికల ఆధారంగా తీవ్ర పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించాము. పేదరికాన్ని అర్థం చేసుకోవడానికి కేవలం ఒక్క ఆదాయం మాత్రమే పరిగణలోనికి తీసుకుంటే సరిపోదు. లోతుగా పరిశీలిస్తే దీనికి మించిన చట్రం కనిపిస్తుంది. మా అధ్యయనం ప్రకారం అలాంటి 64,006 కుటుంబాలను గుర్తించాము. జీవనోపాధి కల్పన, సమతుల్య ఆహారం, కొత్త ఇళ్లను నిర్మించడం లేదా దెబ్బతిన్న ఇళ్లను మరమ్మతు చేయడం, సరైన ఆరోగ్య సంరక్షణ, చికిత్స వంటి క్రమబద్ధమైన సహాయ చర్యల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిం చాము. వీటి మెరుగుదల కోసం అన్ని ప్రధాన విభాగాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాము. ఈ నాలుగేండ్లలో క్రమబద్ధమైన ప్రణాళిక, సరైన అమలు, రాజకీయ సంకల్పంతో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించగలిగాం.
ప్రణాళిక బోర్డు పని విధానం ఎలా ఉంటుంది?
దేశంలో జాతీయ ప్రణాళిక సంఘం రద్దు తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాలు దాన్ని ఆపేశాయి. కానీ కేరళ ఇప్పటికీ పంచవర్ష ప్రణాళిక ప్రక్రియను అనుసరిస్తోంది. వివిధ స్థాయిలలో అంతర్-విభాగ సంప్రదింపుల ద్వారా ప్రభుత్వ పంచవర్ష ప్రణాళికలు, వార్షిక ప్రణాళికల తయారీని కేరళ రాష్ట్ర ప్రణాళిక బోర్డు సమన్వయం చేస్తోంది. ప్రస్తుత పథకాల సమీక్ష, వివిధ రంగాల అవసరాల ఆధారంగా ప్రణాళిక బోర్డు అన్ని విభాగాలకు వనరుల కేటాయింపును రూపొందిస్తోంది. ఇటువంటి ముఖ్యమైన విభాగంలో భాగం పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది.
మహిళా సాధికారత కోసం మీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేకమైన చర్యలు ఏమిటీ?
రాష్ట్రంలో లింగ వివక్షను రూపుమాపేందుకు మా ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెటింగ్‌ను అనుసరిస్తుంది. రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఈ లింగ బడ్జెట్‌ను రూపొందిస్తుంది. మా బోర్డు ప్రతి శాఖతో చర్చలు జరిగి ప్రతి రంగంలో లింగ అవసరాలు, సమస్యలను అంచనా వేస్తుంది. విభాగాల్లోని నిపుణుల సహాయంతో పథకాలను రూపొందిస్తుంది. మహిళలకు ప్రత్యేకంగా (పార్ట్‌ఎ) పథకాలు ఉన్నాయి. వాటిలో మహిళలు కూడా ఉన్నారు. ముఖ్యంగా కేరళ మూడు అంచెల స్థానిక స్వపరిపాలనలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించింది. అలాగే స్థానిక పాలనా నిర్మాణంలోని అన్ని కమిటీలలో మహిళల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుంది.
విద్యార్థి ఉద్యమాలతో ఏమైనా అనుబంధం ఉందా?
కాలేజీలో చేరిన తర్వాత స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్.ఎఫ్.ఐ)లో చేరాను. విద్యార్థి ఉద్యమంలోకి వచ్చిన తర్వాతే రాజకీయాల్లో చాలా యాక్టివ్ అయ్యానని చెప్పాలి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో చేరాను. కోర్సు అయితే పూర్తి చేశాను కానీ అప్పట్లో వార్తాపత్రికల్లో కానీ మ్యాగజైన్‌లో కానీ మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు. దాంతో కొన్నేండ్లు మహిళా ఉద్యమంలో పనిచేసి తర్వాత ఎం.ఎ పూర్తి చేశాను. 2005లో కాలికట్ విశ్వవిద్యాలయంలో కొత్తగా ఏర్పడిన మహిళా అధ్యయన విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాను. మహిళా అధ్యయన నిపుణులు, కార్యకర్తలు, రచయితలు, కళాకారులను తయారు చేసే ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌లోనూ పని చేశాను. 2021 నుండి దాని జాతీయ ప్రధాన కార్యదర్శిగా వరుసగా మూడేండ్లు ఎన్నికయ్యాను.
వంద శాతం అక్షరాస్యత సాధించిన కేరళలో విద్యా విధానానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి చెబుతారా?
మా దగ్గర విద్యా వ్యవస్థ చాలా బాగుంది. చదువు అందరికీ అందుబాటులో ఉండేలా, అందరూ దాన్ని భరించగలిగేలా ఎల్.డి.ఎఫ్. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతి గ్రామంలోని బాలబాలికలు ఇంటి నుండి నడిచి వెళ్లేంత దూరంలోనే ఒక పాఠశాల ఉంటుంది. అన్ని పంచాయతీలలో ఉన్నత పాఠశాలలు, ఉన్నత మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. మా రాష్ట్రంలో అతి తక్కువ ఫీజుతో ఉన్నత విద్య కూడా అందుబాటులో ఉంది. అలాగే ప్రభుత్వం అణగారిన వర్గాలకు, ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్లు, ఫెలోషిప్‌లను కూడా అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నట్టు వింటున్నాం, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు?
అభివృద్ధిలో, విద్యలో, ఆరోగ్యంలో దేశానికే ఆదర్శరంగా ఉన్న కేరళ రాష్ట్ర లౌకిక, ప్రగతిశీల ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ రాజకీయంగా అవగాహన కలిగి ఉన్న కేరళ ప్రజల ముందు వారి పప్పులు ఉడకడం లేదు. మా రాష్ట్ర ప్రజలకు మంచి అవగాహన, విమర్శనాత్మకంగా ఆలోచించే సామర్థ్యం ఉంది. వాస్తవానికి కేరళ ప్రజలంటే బీజేపీకి భయం. కాబట్టి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరు.
మీ కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా?
నేను మధ్య కేరళలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగాను. మా అమ్మానాన్న పాఠశాల ఉపాధ్యాయులు. వారిద్దరూ వామపక్ష రాజకీయాలకు అభిమానులు. నాన్న ద్వారా చిన్నతనం నుండే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. ఆయన చదువు విషయంలో నన్నెంతో ప్రోత్సహించేవారు. చాలా పుస్తకాలు కొనిచ్చేవారు. స్థానిక లైబ్రరీకి తీసుకెళ్లేవారు. మా అమ్మ పాఠశాల ఉపాధ్యాయ సంఘంలో పని చేసేది. పదవీ విరమణ తర్వాత ఆమె మా గ్రామ పంచాయతీ అధ్యక్షురాలైంది. మా గ్రామంలో కమ్యూనిస్టు ఉద్యమం చాలా బలంగా ఉండేది. పాతతరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తిదాయకమైన జీవితాలు వింటూ పెరిగాను.
డాక్టర్ సలీమ



