ఈ ఏడాది జూన్ నెలలో నెదర్లాండ్స్ దేశంలోని హేగ్ నగరంలో నాటో దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. సైనిక వ్యయాలను తమ జీడీపీలో కనీసం ఐదు శాతానికి తగ్గకుండా ఉండేలా 2035 నాటికి పెంచాలని అక్కడ అన్ని సభ్యదేశాలూ ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం అమెరికా సైనిక వ్యయం ఆ దేశపు జిడిపిలో 3.5 శాతం ఉంది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు) సైనిక వ్యయం 1.9 శాతం ఉంది. అంటే, రానున్న రోజుల్లో అమెరికా, ఇ.యు దేశాలు తమ సైనిక వ్యయాన్ని గణనీయంగా పెంచబోతున్నాయన్న మాట. ఇక జపాన్ సైనిక వ్యయం ఆ దేశపు జీడీపీలో ఒక శాతానికి మించకుండా గతంలో ఆంక్షలు ఉండేవి. వాటిని క్రమంగా జపాన్ ఉల్లంఘిస్తూ వచ్చింది. తాజాగా ప్రధాని బాధ్యత తీసుకున్న సానే తకైచీ తమ సైనిక వ్యయాన్ని ఇప్పుడున్న 1.8 శాతం నుండి రెండు శాతానికి పెంచనున్నట్టు ప్రకటించారు. సామ్రాజ్యవాద దేశాలన్నీ ఈ విధంగా కూడబలుక్కుని తమ సైనిక వ్యయాలను పెంచడానికి పూనుకోవడం సైనికీకరణ వేగం పుంజుకోడానికి దారితీస్తుంది. ఇది ఒక కొత్త పరిణామం.
తమ సైనికీకరణ వేగాన్ని పెంచుకోడాన్ని సమర్ధించుకుంటూ నానా రకాల వాదనలనూ ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా రష్యా నుండి ప్రమాదం పొంచివుందన్న వాదన చేస్తున్నారు. రష్యా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు పూనుకుందని,ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోడానికి సాగిస్తున్న యుద్ధం అందులో భాగమేనని సామ్రాజ్యవాదుల ప్రచార సాధనాలు కోడై కూస్తున్నాయి. నిజానికి విస్తరణకు ప్రయత్నాలను ప్రారంభించినదే సామ్రాజ్యవాద కూటమి. గతంలో రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్‌కు క్లింటన్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ రష్యా సరిహద్దు వరకూ ఉన్న దేశాలన్నింటికీ నాటో సభ్యత్వాన్ని ఇచ్చి రష్యాను సైనికపరంగా చుట్టుముట్టింది సామ్రాజ్యవాదులే. ఆ సమయంలో మిన్స్క్‌లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్, రష్యా దేశాలు తమ ఉభయుల మధ్యా ఎటువంటి సైనిక ఘర్షణా ఉండకూడదని ఒప్పందం చేసుకోడానికి సిద్ధపడ్డాయి. అప్పటి బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పనిగట్టుకుని ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు పయనమై అటువంటి ఒప్పందం చేసుకోవద్దని ఉక్రెయిన్‌ను వెనక్కి లాగాడు. ఆ ఒప్పందమే గనుక జరిగివుంటే ఇప్పుడు ఉక్రెయిన్, రష్యాలు ఇలా యుద్ధంలో చిక్కుకునేవే కావు. ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్ర. ఎవరు విస్తరణ కాంక్షతో వ్యవహరిస్తున్నారో దీనిని బట్టే అర్ధం అవుతోంది. తమ యుద్ధ కాంక్షలను సమర్ధించుకోడానికే ఇప్పుడు వాళ్లు రష్యా బూచిని సాకుగా చూపిస్తున్నారు.
ఇటువంటి ప్రచారాన్ని యూరప్‌లో ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్లని రష్యన్ ఏజంట్లుగా, పుతిన్‌కు తాబేదార్లుగా చిత్రిస్తున్నారు. సహ్రా వేజెన్‌నెక్ట్ జర్మనీలో వామపక్ష నాయకురాలు. డై లింక్ అనే పార్టీ నుండి విడగొట్టుకుని ఇటీవల వేరే పార్టీని ప్రారంభించారు. యూరప్ దేశాల భద్రత రష్యాతో స్నేహం ద్వారా మాత్రమే సాధ్యం అని, రష్యా దురాక్రమణదారుకాదని ఆమె ప్రకటించారు. దాంతో ఆమెను జర్మన్ మీడియా యావత్తూ రష్యన్ ఏజంటుగా ముద్రవేసి దాడి చేస్తోంది. నిజానికి యూరప్ దేశాలు రష్యా పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. రష్యాపై సామ్రాజ్యవాద దేశాలు విధించిన ఆంక్షల ఫలితంగా ఈ దేశాలు అంతవరకూ చౌకగా రష్యా నుంచి వచ్చే చమురు బదులు ఎక్కువ ఖరీదైన అమెరికన్ చమురును బలవంతాన కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దాని వలన యూరప్ దేశాల్లో జీవన వ్యయం బాగా పెరిగిపోయింది. కార్మిక వర్గాన్ని అది మరిన్ని భారాల వైపు నెట్టింది. 
పైగా జర్మనీ వంటి దేశాలు తయారు చేసే ఉత్పత్తుల ఖరీదు పెరిగిపోయింది. ఆ సరుకులు అంతర్జాతీయ పోటీలో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. దాని వలన జర్మనీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి వచ్చింది. ఉన్న పరిశ్రమలే మూతవేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ ఆంక్షల వలన అమెరికా తన చమురును మరింత ఎక్కువగా యూరప్‌కు అమ్ముకోగలిగింది. కాని యూరప్ దేశాలకు నష్టమే కలిగింది. అయినప్పటికీ అవి తమ స్వంత ప్రయోజనాలను బలి చేసుకుంటూ అమెరికా ఆంక్షలను వ్యతిరేకించకుండా పూర్తిగా లొంగిపోవడం విచిత్రం.
ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి ఒక కారణం ఇప్పుడు యూరప్ దేశాల ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తున్న శక్తులే. ఈ నాయకుల్లో ఎక్కువమంది పెట్టుబడిదారులే. వారంతా అమెరికన్ పెట్టుబడిదారీ వ్యవస్థతో సన్నిహితంగా పెనువేసుకుని వున్నవారే. ఉదాహరణకు: అమెరికన్ బహుళజాతి పెట్టుబడుల కంపెనీ అయిన బ్లాక్‌రాక్‌కు అనుబంధం గా ఉన్న జర్మన్ సంస్థ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరించిన ఫ్రెడరిక్ మెర్జ్ ఇప్పుడు జర్మనీ చాన్సలర్‌గా ఉన్నాడు. 
ఇప్పుడున్న యూరోపియన్ దేశాల నాయకత్వం అమెరికన్ వ్యాపార ప్రయోజనాలను వ్యతిరేకించి యూరోపియన్ దేశాల ప్రయోజనాలను సంరక్షించగల స్థితిలో లేదు. గతంలో చార్లెస్ డి గాల్ (ఫ్రాన్స్), విల్లీ బ్రాండ్ట్ (జర్మనీ) వంటి నాయకులు తమ తమ దేశాల ప్రయోజనాల కోసం అమెరికాతో తలపడగలిగారు. ఇప్పటి యూరోపియన్ నాయకులలో అటువంటి తెగువ లేదు.
అయితే, యూరోపియన్ దేశాలు ఇప్పుడు ఆర్థికంగా చేసుకుంటున్న ఆత్మహత్య వైనాన్ని ఇదొక్కటే వివరించలేదు. రష్యాలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూలదోసేవరకూ ఎలాగైనా ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని కొనసాగించి రష్యాలో కూడా ఉక్రెయిన్‌లో మాదిరిగానే తమ తాబేదారులను అధికారంలో కూర్చోబెడితే అప్పుడు అమెరికాకు, యూరప్ దేశాలకు రష్యాలో ఉన్న అపారమైన సహజ సంపద అంతా చేజిక్కుతుంది. ఇప్పుడు చైనా, ఇరాన్ తదితర దేశాలతో కూటమిగా వ్యవహరిస్తున్న రష్యాను దెబ్బ తీయగలిగితే, పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదపు పెత్తనానికి ఆ కూటమి నుండి ఎందురౌతున్న సవాలు బలహీన పడుతుంది. ఇదే సామ్రాజ్యవాదుల అసలు కుతంత్రం.
మరోపక్క డొనాల్డ్ ట్రంప్ వెనిజులాలో కూడా ఎలాగైనా సైనిక జోక్యం చేసుకోవాలని, అక్కడ తమ తొత్తు ప్రభుత్వాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం అక్కడ ఉన్న వామపక్ష అధ్యక్షుడు నికొలస్ మదురోను ”మాదకద్రవ్యాల రవాణా చేసే ఉగ్రవాది” అని, మాదక ద్రవ్యాల వ్యాపారుల ముఠాకు నాయకుడు అని ముద్ర వేసి అప్రదిష్టపాలు చేసే ప్రచారానికి స్వయంగా ట్రంప్ పాల్పడ్డాడు. నిజానికి విక్టర్ హ్యూగో చావెజ్‌కు, బొలివేరియన్ విప్లవస్ఫూర్తికి వారసుడిగా అక్కడ మదురో ఉన్నాడు. అయినా సరే ట్రంప్ ఇటువంటి తప్పుడు ప్రచారానికి దిగాడు. వెనిజులా కూడా సహజ వనరులు సమృద్ధిగా ఉన్న దేశం. దానికి తోడు సామ్రాజ్యవాదుల పెత్తనాన్ని సవాలు చేస్తున్న బ్రిక్స్ కూటమితో వెనిజులా కలిసి వ్యవహరిస్తోంది. అందుకే ట్రంప్ ఈ కుట్రకు పాల్పడుతున్నాడు.
ఇలా ఆయా దేశాల ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూలదోసి తమ తొత్తులను అక్కడ కూర్చోబెట్టే కుట్ర ఇక్కడితో ఆగలేదు. 
కొలంబియా లో అధ్యక్షుడిగా ఎన్నికైన వామపక్ష నేత గుస్తావో పెట్రోను కూడా ”మాదక ద్రవ్యాల వ్యాపారి”’ అని ముద్ర వేశాడు ట్రంప్. దానిని రుజువు చేసే చిన్నపాటి సాక్ష్యం కూడా చూపలేదు. ఇక్కడ గనుక ట్రంప్ ప్రభుత్వాలను కూలదోయడంలో విజయం సాధిస్తే మొత్తం లాటిన్ అమెరికా లోని అన్ని దేశాలలోనూ తన తొత్తులను అధికార పీఠం ఎక్కించేందుకు ట్రంప్‌కి ధైర్యం వస్తుంది. ట్రంప్ కుట్రకు క్యూబా కూడా మినహాయింపు కాదు. సామ్రాజ్యవాద దేశాలు సాగిస్తున్న సైనికీకరణ తమ దేశాల భద్రతకు ముప్పు వాటిల్లినందువలన కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ తమకు లొంగి పడివుండే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం సామ్రాజ్యవాదుల లక్ష్యం. అ లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి అడ్డుగా నిలబడ్డ ఏ దేశంలోని ప్రభుత్వం మీదనైనా సైనిక పరంగా దాడులకు పూనుకోడానికే ఇప్పుడు సైనికీకరణ వేగం పెంచుతున్నారు. 
సామ్రాజ్యవాద ఆధిపత్యానికి ఏ దేశం నుండీ ఎటువంటి సైనికపరమైన ప్రమాదమూ లేదు. ఉన్నదల్లా సామ్రాజ్యవాదుల ఆర్థిక, రాజకీయ ఆధిపత్యానికి సవాలు మాత్రమే. ఈ సవాలు విసురుతున్న దేశాలలోని ప్రభుత్వాలను వెంటనే కూలదోయకపోతే వాటిని ఆర్థికంగా, రాజకీయంగా ఎదుర్కొనే శక్తి సామ్రాజ్యవాదులకు సన్నగిల్లిపోవచ్చు. అదే సామ్రాజ్యవాదుల అసలు భయం. ఈ భయానికి కారణం సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలే. ఇప్పుడు ఆ నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందు దారి లేకుండా మూసుకు పోయింది. నయా ఉదారవాద చట్రాన్ని బద్దలుగొట్టి దాన్నుండి బైటపడకుండా ముందుదారి ఏర్పడడం అసాధ్యం. రెండో ప్రపంచ యుద్ధం అనంతర కాలంలో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైనది గత దశాబ్ద (2012-21) కాలంలోనే. ఇప్పుడు తమను ఉద్ధరిస్తుందని వీళ్లు ఆశలు పెట్టుకున్న ఎఐ బుడగ కాస్తా పేలిపోతే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. ఆ ఎఐ కారణంగా పెరిగిపోయే నిరుద్యోగం ఇప్పుడున్న నిరుద్యోగానికి అదనంగా తోడవుతుంది.
ఈ నిరుద్యోగం వలన ఎక్కువగా దెబ్బ తినబోయేది మూడవ ప్రపంచ దేశాల ప్రజలు. దానికి ట్రంప్ సుంకాల యుద్ధం తోడైంది. పొరుగు దేశాలను బిచ్చగాళ్ళుగా దిగజార్చి తాను మాత్రం బాగుపడి పోవాలనుకునే ట్రంప్ విధానాలు మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. సామ్రాజ్యవాద దేశాలు తమ తమ మధ్య పరస్పరం ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ సుంకాల వ్యవస్థను సర్దుబాటు చేసుకుంటున్నాయి. కాని మూడవ ప్రపంచ దేశాలు మాత్రం తమ సుంకాలను తగ్గించుకుని మరీ అమెరికన్ దిగుమతులను తెచ్చుకోవలసి వస్తోంది. అమెరికా విధించే అధిక సుంకాల కారణంగా వాటి ఎగుమతులు బాగా దెబ్బ తినిపోనున్నాయి. ఇదంతా మొత్తంగా మూడవ ప్రపంచ దేశాలను మరింత దుర్భర స్థితిలోకి నెడుతోంది. ఆ కారణంగానే సామ్రాజ్యవాదుల పెత్తనం కింద నడిచే ఆర్థిక ఒప్పందాల వ్యవస్థ నుండి బైటపడి ప్రత్యామ్నాయంగా వేరే వ్యవస్థ వైపు మళ్లాలన్న ఒత్తిడులు కూడా మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాల మీద దిగువ నుండి పెరుగుతున్నాయి. 
ఇంతవరకూ బ్రిక్స్ వంటి కూటములు ప్రత్యక్షంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పాత్రను పోషించి వుండకపోవచ్చు. కాని రానున్న రోజుల్లో మూడవ ప్రపంచ దేశాలు మరింత దుర్భర పరిస్థితుల్లోకి జారిపోతున్న కొద్దీ ప్రత్యామ్నాయ ఆర్థిక విధా నాలను చేపట్టగల ప్రభుత్వాలను ఏర్పాటు చేయగల అవకాశాలు పెరుగుతాయి. అటువంటి ప్రభుత్వాలు మాత్రమే ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచగలుగుతాయి. ఇప్పుడు సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న వ్యూహంలో మూడు అంశాలు ఉన్నాయి. మొదటిది: అన్ని దేశాల్లోనూ నయా ఫాసిస్టు ప్రభుత్వాల ఏర్పాటును ప్రోత్సహించడం. ప్రత్యేకించి మూడవ ప్రపంచ దేశాలలో ఈ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. 
రెండవది: సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వెలుపల ఒక ప్రత్యామ్నాయ కూటమిగా జరుగుతున్న ఏర్పాటు నుంచి దూరంగా ఉండడం, వీలైతే అటువంటి ఏర్పాటుకు కుట్రపూరితంగా ద్రోహం చేయడం కోసం ఈ నయా ఫాసిస్టు ప్రభుత్వాలను ఉపయోగించడం (ప్రస్తుతం మోడీ ప్రభుత్వం మీద ట్రంప్ తెస్తున్న ఒత్తిడి ఈ వ్యూహంలో భాగమే). మూడవది: తమకు లొంగి వుండేలా తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో విఫలమైతే అటువంటి దేశాలమీద సైనిక శక్తిని ప్రయోగించి వాటిలో జోక్యం చేసుకోవడం. నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా తలెత్తిన సంక్షోభంతో సామ్రాజ్యవాదం ఒక మూలకు నెట్టబడింది. ఈ నయా ఉదారవాద చట్రం లోపలనే ఈ సంక్షోభం పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. అందుచేత సైనికపరంగానైనా సరే మూడవ ప్రపంచ దేశాల మీద తెగబడి వాటిని తమకు లొంగి వుండేలా చేసుకోడానికే అవి సిద్ధపడుతున్నాయి. పెరుగుతున్న సామ్రాజ్యవాద సైనికీకరణ దీనినే సూచిస్తోంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్

                                    

