భారత క్రికెట్ చరిత్రలో ఇది చిరస్మరణీయ సందర్భం! ఏండ్లకేండ్లుగా ఊరిస్తూ వస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్‌ను వరించింది. సొంత ఇలాఖాలోనే తమ కలను తొలిసారి సాకారం చేసుకుంది. ఇంత పెద్ద విజయాన్ని దేశానికి అందించిన టీమిండియాకు జయహోలు. ఇదంతా నాణేనికి ఒకవైపు..మరోవైపు పురుషుల క్రికెట్‌తో పోల్చితే అంతగా స్పాన్సర్స్ ఉండరు…ప్రభుత్వ ప్రోత్సాహమూ అంతంత మాత్రమే. వీటితో పాటు వీక్షణపరంగానూ ఆదరణ చాలా తక్కవ. అయినా, ఇప్పుడీ టైటిల్‌నూ గెలిస్తే మరికొంత మంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారని కౌర్ నాయకత్వంలోని మహిళల జట్టు బలంగా విశ్వసించింది. అందుకే ఆదివారం ముంబై వేదికగా ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో పదకొండు మందీ ప్రాణం పెట్టి ఆడగా.. జట్టంతా చేయి చేయి కలిపి సమిష్టిగా కదలగా.. కలల కప్పును ఒడిసిపట్టింది తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. పురుషులతో ఏ మాత్రం తీసిపోదని వన్డే ప్రపంచకప్ సాక్షిగా మన మహిళా జట్టు నిరూపించింది.
సొంతగడ్డపై జరుగుతున్నా..వరల్డ్ కప్‌లో మన మహిళాజట్టును టైటిల్ ఫేవరెట్లలో ఒకరిగా క్రికెట్ పండితులు అంచనా వేయలేదు. అంతేకాదు మెగా టోర్నమెంట్‌లో భారత్ ప్రస్థానమూ అంత సాఫీగా ఏమీ సాగలేదు. శ్రీలంక, పాకిస్థాన్‌లాంటి జట్లపై గెలుపొందినా.. బలమైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీమ్‌లతో భారత్ ఎదురొడ్డలేకపోయింది. ఈనేపథ్యంలో అసలు సెమీఫైనల్‌కు చేరగలమా అనే అనుమానాలు రేకెత్తాయి. లీగ్ దశలో భారత్ మూడు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ విమర్శించిన వారే. ‘ఎక్స్’లో అయితే భారత మహిళల జట్టును ఓ ఆట ఆడుకున్నారు. ‘మీకేందుకు క్రికెట్’ అంటూ కామెంట్స్ చేశారు. చోకర్స్ అంటూ పేరు కూడా ఇచ్చేశారు. టీమిండియా పురుష క్రికెటర్లతో సమాన వేతనాలు కావాలంటారు.. వారిలా మాత్రం ఆడరు అంటూ తిట్టారు. ‘ఇక మీరు గ్రౌండ్‌లో కాదు వంటింట్లో ఉండాలంట’ తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే టీమిండియా మాత్రం ఇవేం పట్టించుకోలేదు. వాటన్నింటికీ తమ ఆటతోనే సమాధానం చెప్పింది. కీలక పోరులో కివీస్‌పై విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక సెమీస్‌లో 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది.
మరోవైపు సెమీస్‌లో ఆసీస్‌పై శతకంతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్ ‘నా గెలుపులో జీసస్ నాకు తోడు ఉన్నాడు’ అని చెప్పినందుకు ఆమె ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. అంతకు ముందు కూడా ”ఎప్పుడు చూసినా మైదానంలో తిరుగుతూ ఉంటావు. రీల్స్ చేసుకుంటూ ఉంటావు. ఆడేదెప్పుడు? అనవసరంగా జట్టులో ఉంచారు”.. అంటూ తమ అక్కసు వెళ్లగక్కారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జెమీమా అత్యుత్తమ ఫీల్డింగ్ నైపుణ్యాలతో ‘జాంటీ రోడ్స్’ను గుర్తుకుతెచ్చేలా తన ఆటతో మెరిసిన క్రీడాకారిణి. అలాంటి ఆమెను విచక్షణ మర్చి మరి ట్రోలింగ్ చేయడం సిగ్గుచేటు. టోర్నమెంట్‌లో సెమీస్ ముందుకు వరకు టీమిండియా ఆట ఒక ఎత్తయితే… నాకౌట్ నుంచి సాగిన భారత ఆట నిస్సందేహంగా మరో ఎత్తు! మహిళల క్రికెట్ చరిత్రలో ‘నభూతో..’ అనే మ్యాచ్‌ను ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. ఆల్‌రౌండ్ షోతో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను పడగొట్టిన ఉత్సాహంతో ఫైనల్లోనూ ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అదరగొట్టారు. 
అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఓపెనర్ షెఫాలి వర్మ విలువైన ఇన్నింగ్స్ ఒకవైపు… బౌలింగ్, బ్యాటింగ్‌తో అదరగొట్టిన దీప్తిశర్మ మరోవైపు.. .కెప్టెన్ కౌర్, జెమీమా ఇంకోవైపు, ఆడిన తొలి ప్రపంచకప్‌లోనే పన్నెండ్లు వికెట్లు తీసి సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీచరణి… ఇలా కౌర్ సేన స్ఫూర్తిదాయక పోరాటంతో కదంతొక్కింది. మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో తిరుగులేని ప్రదర్శన కనబరచి విశ్వ విజేతలుగా నిలిచింది. ఏదిఏమైనా సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో ఇదోక సువర్ణధ్యాయం. మన అమ్మాయిలు క్రికెట్ ప్రపంచాన్ని జయించి తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టారు. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తూ ప్రపంచ విజేతలుగా నిలిచారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్న రీతిలో ప్రాణం పెట్టి పోరాడుతూ ఫైనల్లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించారు. ఏడాది కిందట ఇదే సఫారీలను అబ్బాయిలు ఓడించి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిస్తే.. తాజాగా మహిళామణులు వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందుకున్నారు. వేలాది మంది అభిమానుల మద్దతు మధ్య అద్భుత ప్రదర్శన కనబరుస్తూ అంతర్జాతీయ వేదికపై కోట్లాది భారతీయుల ఆకాంక్షలను నిజం చేస్తూ మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించిన మన భారత మహిళామణులకు హాట్సాఫ్.
వనితల ఘనత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

