Tuesday, November 4, 2025
E-PAPER
Homeఆటలుమహిళా క్రికెటర్లపై కనకవర్షం

మహిళా క్రికెటర్లపై కనకవర్షం

- Advertisement -

ఐసీసీ రూ.39.80కోట్లు, బీసీసీఐ రూ.51కోట్లు నజరానా
5న ఆటగాళ్లతో కలిసి రండి : ప్రధాని కార్యాలయం నుంచి బీసీసీఐకి లేఖ

దుబాయ్ : తొలిసారి వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళా క్రికెటర్లపై కనకవర్షం కురుస్తోంది. ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా.. విశ్వ విజేతగా నిలవడంతో క్రీడాభిమానులంతా సంబరాలు జరుపకుంటుండగా.. ట్రోఫీ నెగ్గిన భారత మహిళా జట్టుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ట్రోఫీతో పాటు రూ.39.80కోట్లు నగదు బహుమతి అందజేసింది. ఇక భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బీసీసీఐ) తొలిసారి ఐసీసీ ట్రోఫీ ముద్దాడిన భారతజట్టుకు రూ.51కోట్ల నగదు బహుమతి సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే భారతజట్టు తరఫున ఆడిన క్రికెటర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నజరానాలు ప్రకటిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళలను ఓడించి తొలిసారి టైటిల్‌ నెగ్గిన హర్మన్‌ప్రీత్‌ సేనకు రికార్డు స్థాయిలో 44లక్షల 80వేలడాలర్లు (రూ. 39కోట్ల 80 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది.

రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19కోట్ల 90 లక్షలు) లభించాయి. సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లకు ఒక్కో జట్టుకు 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 94 లక్షలు) చొప్పున అందుకున్నాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6కోట్ల 21లక్షలు) చొప్పున… ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2కోట్ల 48 లక్షలు) చొప్పున లభించాయి. అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 22 లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్‌ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34 వేల 314 డాలర్ల (రూ. 30లక్షల 47 వేలు) చొప్పున లభించాయి.

300 శాతం పెరిగిన ప్రైజ్‌మనీ
వన్డే ప్రపంచకప్‌ విజేతకు అందజేసే ప్రైజ్‌మనీ ఈసారి ఏకంగా 300 శాతం పెరిగడం గమనార్హం. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ పెంపుదల చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా స్పష్టం చేశారు.
బీసీసీఐ రూ.51కోట్లు నజరానా
రెండుసార్లు(2002, 2017)లలో ఫైనల్‌కు చేరినా.. రన్నరప్‌కే పరిమితమైన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరి విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలో విజేతగా నిలిచిన భారత మహిళలజట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు రూ.51 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు సైకియా సోమవారం తెలిపారు. ఈ బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బందితోపాటు, సెలెక్షన్‌ కమిటీ సభ్యులందరూ ఈ మొతాన్ని పంచుకోనున్నారు. దీంతో కోచ్‌, ఆటగాళ్లు ఒక్కొక్కరు కనీసం రూ.2.5 నుంచి రూ.3కోట్లు, సహాయ కోచ్‌లు, అధికారులు రూ.25నుంచి రూ.30లక్షల వరకు అందుకోనున్నారు.

బీసీసీఐకి ఆహ్వానం
తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను నెగ్గిన భారత మహిళా క్రికెటర్లకు భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి ఆహ్వానం లభించింది. సోమవారం(5న) భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బీసీసీఐ) ఛాంపియన్స్‌ జట్టుతో కలిసి రావాల్సిందిగా అందులో రాసి ఉంది. దీంతో ముంబయిలోనే ఉన్న టీమిండియా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం తమ తమ రాష్ట్రాలకు బయల్దేరి వెళ్లనున్నారు.

వరల్డ్‌ కప్‌ జట్టులో నలుగురికి చోటు
ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌ సంగ్రామం ముగిసింది. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. 13వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన నలుగురు భారత క్రికెటర్లు ‘వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ’లో చోటు దక్కించుకున్నారు. క్రీడాభిమానులను అలరించిన వన్డే ప్రపంచకప్‌ ముగియడంతో క్రికెట్‌ వెబ్‌సైట్‌(ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో)జట్టును ప్రకటించింది. ఇందులో భారత్‌ నుంచి నలుగురు, రన్నరప్‌ దక్షిణాఫ్రికా జట్టు నుంచి ముగ్గురు ఎంపికవ్వగా.. ఆస్ట్రేలియా జట్టులోని ముగ్గురు, ఇంగ్లండ్‌ నుంచి ఒకరికి చోటు లభించింది. స్మృతి మంధాన ఓపెనర్‌గా, మిడిలార్డర్‌ బ్యాటర్‌గా జెమీమా రోడ్రిగ్స్‌, వికెట్‌ కీపర్‌గా రీచా ఘోష్‌.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా దీప్తి శర్మలు ఎంపికయ్యారు. మెగా టోర్నీలో నాకౌట్స్‌లో శతకాలతో రెచ్చిపోయిన లారా వొల్వార్డ్త్‌ కెప్టెన్‌, ఓపెనర్‌గా ఎంపికయ్యారు. రెండు సెంచరీలు కొట్టిన అష్‌ గార్డ్‌నర్‌, సథర్లాండ్‌, అలనా కింగ్‌(ఆస్ట్రేలియా), సోఫీ ఎకిల్‌స్టోన్‌(ఇంగ్లండ్‌)లు తుది జట్టులో నిలిచారు. వరల్డ్‌ కప్‌ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సోఫీ డెవైన్‌ 12వ ప్లేయర్‌గా ఎంపికైంది.

వన్డే ఉత్తమ జట్టు : లారా వొల్వార్డ్త్‌(కెప్టెన్‌), మంధాన, రోడ్రిగ్స్‌, మరిజానే కాప్‌, అనబెల్‌ సథర్లాండ్‌, గార్డ్‌నర్‌, రీచా ఘోష్‌(వికెట్‌ కీపర్‌), డీక్లెర్క్‌, దీప్తి శర్మ,కింగ్‌, ఎకిల్‌స్టోన్‌. 12వ ప్లేయర్‌: సోఫీ డెవినె.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -