తండాను చుట్టుముట్టిన డిండి, ఎస్‌ఎల్‌బీసీ వరద నీరు 
బతుకు జీవుడా.. అంటూ పరుగుపెట్టిన గిరిజనులు
కొట్టుకుపోయిన తిండిగింజలు, వస్తువులు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
పాలకులు చేసిన పాపం.. గిరిజనులను వెంటాడుతోంది.. ప్రాజెక్టు పరిధిలోని బాధితులకు సకాలంలో పరిహారం ఇవ్వకపోవడంతో వారు తండాను ఖాళీ చేసే పరిస్థితి లేక.. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయారు. డిండి, ఎస్‌ఎల్‌బీసీ సొరంగంతోపాటు ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరు ఒక్కసారిగా నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మార్లపాడు తండాను చుట్టు ముట్టింది. వరద ఉధృతికి తండాలో విద్యుత్ స్తంభాలు, గిరిజనుల ఇండ్లు, విలువైన వస్తువులు నీటిలో కలిసిపోయాయి. బతుకు జీవుడా.. అంటూ ప్రజలు ఎత్తు ప్రాంతానికి పోయి తలదాచుకున్నారు. ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో భాగంగా నక్కలగండి రిజర్వాయర్‌లోకి నీరు వచ్చి చేరడంతో తండా వాసుల బతుకులు నీటిపాలయ్యాయి. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములకు, ఇండ్లకు పరిహారం ఇవ్వకపోవడంతో గిరిజనులు ఇండ్లను ఖాళీ చేయలేదు. పాలకులు సరైన పరిహారం సకాలంలో ఇస్తే.. ఇంత నష్టం జరిగేది కాదని గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ నివారణకు, సాగునీటి కోసం నక్కలగండి రిజర్వాయర్ తలపెట్టారు. దీని ద్వారా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. నల్లగొండ జిల్లాలో 516 గ్రామాలను ఫ్లోరైడ్ రహితంగా మార్చాలని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2005లో ఈ పనులు మొదలు పెట్టారు. శ్రీశైలం ఎడుమగట్టు కాలువ ద్వారా నీటిని తరలించి నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల సరిహద్దులోని మన్నెవారిపల్లి వద్ద చివరి దశలో ఉన్న డిండి బ్యాలెన్సింగ్ నింపి దిగువకు నీరు విడుదల చేయాలని నక్కలగండి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇటీవల మొంథా తుఫాన్ వల్ల డిండి రిజర్వాయర్‌కు వరద పోటెత్తింది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం నిండి నీరంతా నక్కలగండి రిజర్వాయర్‌లోకి ఒక్కసారిగా వచ్చి చేరింది. బయటకు వెళ్లే దారి చిన్న రంధ్రం మాత్రమే ఉండటంతో మార్లపాడు పూర్తిగా నీటిలో మునిగింది. గ్రామంలో 223 కుటుంబాలు ఉంటాయి. 29న వచ్చిన తుపాన్ వల్ల వరద స్లాబ్‌కు వరకు తాకింది. తిండి గింజలు కొట్టుకుపోయాయి. మూగజీవాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. పత్తి, ధాన్యం నీటి పాలయ్యింది. 20 ఇండ్లు కూలిపోయాయి. మరో 20 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లు కోట్టుకపోయాయి.
20 ఏండ్లుగా పరిహారం కోసం నిరీక్షణ
మార్లపాడు తండా వాసులు 20 ఏండ్లుగా పరిహారం కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగారు. ఇందులో కొంతమందికి అరకొర పరిహారం ఇచ్చారు. కొందరు పరిహారం కోసం కోర్టు గుమ్మం ఎక్కారు. సాగుభూమికి పరిహారంతోపాటు రిజర్వాయర్‌లో మునిగే ఇండ్లకు సంబంధించి పునరావాసాలు నిర్మించాలని తండావాసులు కోరుతున్నారు.
ఐదు రోజులుగా ఆకలితో..
వరదలో తండా మునిగిపోవడంతో ఐదు రోజులుగా నిద్రాహారాలు మాని ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి కనీసం తాగునీరు కూడా లేదు. గ్రామంలో ఐదు అడుగుల మేర బురద చేరింది. ఇండ్లలోకి పోవడానికి కూడా వీలు లేదు. కొన్ని ఇండ్లలో విష పురుగులు వచ్చినట్టు బాధితులు వాపోతున్నారు. వంట చేయడానికి తిండి గింజలు, గ్యాస్ కూడా లేదన్నారు.
మమ్ములను ఆదుకోవాలి సారూ.. లక్షిరాం, మార్లపాడు అచ్చంపేట మండలం నాగర్‌కర్నూల్ జిల్లా
ఐదు రోజులయింది మా ఇండ్లు నీటిలో మునిగి. ఎవరూ కనిపించడం లేదు.కనీసం తిండి గింజలు, గ్యాస్ అయినా ఇవ్వాలి. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.70 కిలోమీటర్లు పోయి ఆహార పొట్లాలు తెచ్చుకుంటున్నాం. ఇప్పటికైనా మాకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
ప్రభుత్వం వివక్ష చూపుతోంది శంకర్‌నాయక్, గిరిజన సంఘం జిల్లా నాయకులు
ఉమ్మడి జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టుల్లో అధికంగా గిరిజనుల భూములే మునిగాయి. పరిహారం చెల్లించడంలో తాత్సారం చేయడం వల్లే మార్లపాడు ఘటన జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే న్యాయమైన పరిహారం చెల్లించాలి.
ఆ కుటుంబాలను ఆదుకుంటాం : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మార్లపాడు తండాలో సుమారు 250 కుటుంబాలు నష్టపోయాయి. లంబాడీలు కట్టుబట్టలతో మిగిలారు. వరదలో అన్నీ కొట్టుకుపోయాయి. అనేక ఇండ్లు కూలిపోయాయి. వీరందరికీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. మార్లపాడుతోపాటు నక్కలగండి, కిష్ట తండా గిరిజనులకు పునర్నివాస పథకాన్ని అమలు చేసి అందరికీ ఇండ్లు కల్పిస్తాం.

                                    

