Tuesday, November 4, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు..

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు..

- Advertisement -

ప్రయివేటుకు అనుమతి చేటే
55 సీటింగ్‌ కేపాసిటీనే ప్రమాణమైతే
బస్సులు మూడు రెట్లు పెరగాలి
రోడ్డు ఇంజినీరింగ్‌ కీలకమే
ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు తనిఖీలు
చేవెళ్ల ఘటన హెచ్చరికలు

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కర్నూలు బస్సు దగ్ధం ఘటన మరువకముందే చేవెళ్ల రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడం సంచలనాలకు కారణమవుతున్నది. దీంతో అనేక అంశాలు చర్చలోకి వస్తున్నాయి. రెండు ఘటనలు వేర్వేరు నేపథ్యంలో జరిగినప్పటికి బాధితులు, క్షతగాత్రులు పదుల సంఖ్యలో ఉండటంతో దేశవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఇతరులు స్పందించిన విషయం తెలిసిందే. ఈతరుణంలో రోడ్డు ఇంజినీరింగ్‌తోపాటు తెలంగాణ ఆర్టీసీ చేపట్టాల్సిన అనేక చర్యలను గుర్తు చేస్తున్నది. ఈ విషయమై సాధారణ ప్రజలతోపాటు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు దీర్ఘకాలికంగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాయి. బస్సుల సంఖ్యను పెంచాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. చేవెళ్ల ప్రమాద ఘటనకు టిప్పర్‌ అతివేగం, కంకర ఓవర్‌లోడ్‌ కారణమని ఆర్టీసీ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఆమేరకు మీడియాకు ఒక ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఇదిప్పుడు చర్చకు అవకాశం కల్పించింది. ఆర్టీసీ చెప్పేది నిజమే కావచ్చు. కానీ ఆర్టీసీ అంతర్గత పరిస్థితి ఏంటి? ఒక్కో బస్సు సీటింగ్‌ కేపాసిటీ 55 మాత్రమే. చేవెళ్ల ప్రమాద బస్సులో 72 మంది ప్రయాణిస్తున్నారు. అంటే 17 మంది అధికంగా ఉన్నారు. రోడ్డు ఇరుకుగా ఉందనీ, డివైడర్‌ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చని రవాణా శాఖ మంత్రి సైతం చెప్పారు. ప్రమాదాలకు ఆర్టీసీ నిర్లక్ష్యం కారణం కాదా ? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో సమస్య జఠిలమవుతూ వస్తున్నది. భౌతిక పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. జనాభా పెరుగుతున్నది. బస్సుల సంఖ్య పెరగకపోగా, తగ్గిపోతున్నాయి.

గత రెండేండ్లల్లో అదనంగా ఒక్క బస్సును పెంచలేదంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో తొమ్మిది వేల బస్సులు ఉన్నాయనేది అధికారిక సమాచారం. సీటింగ్‌ కెపాసీటీ ప్రకారం మూడు రెట్లు పెరగాలి. అంటే రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం 27 వేల బస్సులు అవసరం. కానీ అలా లేవు. చట్టం అమలు కావడం లేదు. సీటింగ్‌ కెపాసిటీ ప్రకారం బస్సులు నడపాలంటే తెలంగాణలో ఒక్క బస్సు తిరగదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సంఖ్యను పెంచడంతోపాటు ప్రయివేటు వాహనాలను రోడ్లమీదకు అనుమతించకూడదు. లోడ్‌ పర్యవేక్షణ చేయాలి.

రోడ్లను ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించాలి. పాతవాటిని తీర్చిదిద్దాలి. రవాణా వాహనాలకు ఒకే పర్మిట్‌ వచ్చింది. అలాగే హైదరాబాద్‌తోపాటు తెలంగాణ ప్రధాన నగరాలు, పట్టణాలకు దాదాపు 5000 బస్సులు తిరుగుతున్నాయి. వీటిపై నియంత్రణ ఎవరిది ? అలాగే తెలంగాణ ఆర్టీసీ హైర్‌ చేసుకున్న బస్సులు 3200. మొత్తం బస్సుల ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయగలిగితే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే రోడ్డు ఇంజినీరింగ్‌ను పరిశీలిస్తే అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంది. రోడ్ల నిర్మాణంలో ప్రణాళిక, డిజైన్‌, నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -