Tuesday, November 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవారు బలమైన నాయకులు

వారు బలమైన నాయకులు

- Advertisement -

– ఆ ఇద్దరిని తేలికగా తీసుకోవద్దు
– పుతిన్‌, జిన్‌పింగ్‌లపై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. రష్యా, చైనా దేశాధినేతలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ కఠినమైన, తెలివైన నాయకులని అన్నారు. వారిని సరదాగా తీసుకోవద్దని తెలిపారు. సీబీఎస్‌ న్యూస్‌ ప్రోగ్రాం ’60 మినిట్స్‌’లో పాల్గొన్న ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది సీబీఎస్‌ ఛానల్‌తో ఆయనకు జరిగిన న్యాయపరమైన వివాదం పరిష్కారమైన తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ కావటం గమనార్హం. అయితే ఈ కార్యక్రమంలో పుతిన్‌, జిన్‌పింగ్‌లను ఉద్దేశిస్తూ అడిగిన ప్రశ్నలకు ట్రంప్‌ పై విధంగా సమాధానమిచ్చారు. ”పుతిన్‌, జిన్‌పింగ్‌ ఇద్దరూ బలమైన నాయకులు. కఠినమైనవారు, తెలివైనవారు, గంభీరమైన వ్యక్తులు. వీరిని తేలికగా తీసుకోవద్దు” అని ఓ ప్రశ్నకు ట్రంప్‌ సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపై అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ సమాధానమిస్తూ.. ఆ యుద్ధానికి బాధ్యతను అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ మీద వేశారు. అది తన పాలనలో ఎప్పుడూ జరిగేది కాదని ఆయన అన్నారు. ”నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పుతిన్‌ తాను గెలుస్తున్నానని అనుకునే పరిస్థితి లేదు. యుద్ధం నా పాలనా కాలంలో జరిగేది కాదు. పుతిన్‌ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్నందుకే యుద్ధం జరిగింది” అని ట్రంప్‌ వివరించారు. తన నాలుగేండ్ల పాలనలో ఇలాంటి యుద్ధం జరగలేదనీ, అలాంటి పరిస్థితి కూడా రాదని చెప్పారు. తన అధ్యక్ష పదవి కాలంలో సైనిక శక్తిని పెంచినట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. జిన్‌పింగ్‌తో పూర్వ సంబంధం గురించి అడిగినప్పుడు ట్రంప్‌ సమాధానమిస్తూ.. ”మేము చాలా బాగా కలిసిపోతాం. ఎప్పటినుంచో అలాగే ఉన్నాం. ఆయన శక్తివంతమైన, బలమైన, ప్రభావవంతమైన నాయకుడు” అని చెప్పారు. రెండు దేశాల మధ్య(అమెరికా, చైనా) సంబంధం ఇప్పటికీ చాలా మంచిగానే ఉన్నదని తెలిపారు. అమెరికా, చైనా రెండూ శక్తివంతమైన దేశాలు కావడంతో మంచి సంబంధం ఉండటం చాలా ముఖ్యమని ట్రంప్‌ అన్నారు. ఇక ప్రపంచ మార్కెట్లను కుదిపేసిన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై స్పందించిన ఆయన.. తన విధానం ఒక వ్యూహాత్మకమైన, తాత్కాలిక చర్యగా సమర్థించుకున్నారు.

రష్యా, చైనా, పాక్‌ భూగర్భ అణుపరీక్షలు : ట్రంప్‌ ఆరోపణలు
రష్యా, చైనా వంటి దేశాలు ప్రజలకు తెలియకుండా రహస్య భూగర్భ అణుపరీక్షలు జరిపారని ట్రంప్‌ ఆరోపించారు. అమెరికా కూడా అదే దారిని అనుసరిస్తుందని తెలిపారు. ”రష్యా పరీక్షలు జరుపుతున్నది, చైనా జరుపుతున్నది.. కానీ వారు దాని గురించి మాట్లాడరు. పరీక్షలు చేయని ఏకైక దేశం అమెరికా కావాలని నేను కోరుకోవడం లేదు” అని చెప్పారు. అణు ఆయుధాలు పరీక్షిస్తున్న దేశాల జాబితాలో ఉత్తర కొరియా, పాకిస్తాన్‌ పేర్లను కూడా ఆయన చేర్చారు. అయితే అణుపరీక్షల విషయంలో ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -