నవతెలంగాణ కోయంబత్తూర్: తన స్నేహితుడితో కలిసి కారులో కూర్చొని మాట్లాడుతున్న కళాశాల విద్యార్థినిపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది. పరారీలో ఉన్న నిందితుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారు పారిపోయేందుకు యత్నించడంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపి, అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం రాత్రి కారులో ఓ విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు.. వారితో వాగ్వాదానికి దిగారు. కోపోద్రిక్తులైన ఆ ముగ్గురు తమ వద్ద ఉన్న కొడవలితో ఆ యువకుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతను స్పృహ కోల్పోగానే.. వారు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడి, నిర్జన ప్రాంతంలో వదిలేసి, అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన ఆ యువకుడు తన సెల్‌ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పీళమేడు పోలీసులు అక్కడికి చేరుకొని యువతీయువకులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపుచర్యలు చేపట్టడంతో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితుల ఆచూకీని గుర్తించారు. అయితే పారిపోవడానికి ప్రయత్నించడంతో.. వారి కాళ్లపై కాల్పులు జరిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

                                    

