– క్యూ2లో రూ.20,160 కోట్ల లాభాలు
– తగ్గిన ఎన్పీఏలు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్లకు చేరి.. నూతన మైలురాయిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.20,160 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. యెస్ బ్యాంక్‌లో వాటాల విక్రయం, నిరర్థక ఆస్తులు తగ్గడం ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలకు ప్రధాన కారణం. ఇటీవల యెస్ బ్యాంక్‌లోని తన 13.18 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ.4,593 కోట్ల లాభాలను నమోదు చేసింది. ఇది నికర లాభాల పెరుగుదలకు ప్రధాన మద్దతును అందించింది. కాగా.. 2024-25 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.18,331 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. దీంతో పోల్చితే గడిచిన క్యూ2లో 10 శాతం వృద్ధి చోటు చేసుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 3.3 శాతం పెరిగి రూ.42,984 కోట్లుగా నమోదయ్యింది. గతేడాది ఇదే క్యూ2లో రూ.41,620 కోట్ల ఎన్‌ఐఐని ఆర్జించింది.
2025 సెప్టెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 40 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 1.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 0.42 శాతానికి పరిమితమయ్యాయి. గడిచిన క్యూ2 త్రైమాసికంలో 64 శాతం సేవింగ్ బ్యాంక్ ఖాతాలు కూడా యోనో ద్వారా తెరువబడ్డాయనిఎస్బీఐ వెల్లడించింది. గడిచిన సెప్టెంబర్ త్రైమాసికంలో ఎస్బీఐ రుణాల జారీ 12.7 శాతం పెరిగి రూ.55.9 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయానికి రూ.44.2 లక్షల కోట్ల రుణ పుస్తకం నమోదయ్యింది. 2025 సెప్టెంబర్ ముగింపు నాటికి ఎస్బీఐ రుణాలు, డిపాజిట్లు తదితర మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్లకు చేరింది. మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నప్పటికీ.. బీఎస్‌ఈలో ఎస్బీఐ షేర్ 0.72 శాతం పెరిగి రూ.957.05 వద్ద ముగిసింది.
ఎస్బీఐ వ్యాపారంఏ 100 లక్షల కోట్లు
- Advertisement -
- Advertisement -



