Thursday, November 6, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆరెస్సెస్‌ ఆర్ధశాస్త్రం ఒక 'నీతిచంద్రిక'

ఆరెస్సెస్‌ ఆర్ధశాస్త్రం ఒక ‘నీతిచంద్రిక’

- Advertisement -

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)కు ఆర్థిక శాస్త్రం పట్ల ఆసక్తి ఎప్పుడూ లేదు. ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్తలు కన్న కల హిందూ రాష్ట్రమైతే, ఆ లక్ష్యం సాధించిన తర్వాత ఒక అద్భుతమైన సుసంపన్న రాజ్యం నిర్మించాలంటే ఏదో ఒక విధమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలనే ఆలోచన దానికి లేకపోవడం వింతైనా విషయం. ఈరోజు దాకా ఆరెస్సెస్‌కు అత్యంత గౌరవనీయుడైన సిద్ధాంతకర్తగా వున్న రెండవ సర్సంఘ్‌ చాలక్‌ ఎం.ఎస్‌. గోల్వాల్కర్‌, స్వాతంత్య్రానంతరం ఆర్థిక సమస్యలపై కొంత దృష్టి సారించారు. సమకాలీన ఆర్థికాభివృద్ధి సమస్యలపై కొన్నింటికి పాక్షికంగా సమాధానమి చ్చారు. వీటిలో పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామికీకరణ, ఆహార కొరత లాంటివి ఉన్నాయి. మరికొన్ని ఉన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం గురించిన పాక్షిక సమాధానాలు ఉన్నాయి. అతని ఆలోచనలు ఇంటర్వ్యూలోను, వ్యాసాలలోను, విలేకరుల సమావేశాలలోను, అంతర్గతంగా జరిగిన చర్చల నుంచి లభ్యమవుతున్నాయి. ఇవి ‘శ్రీ గురూజీ సమగ్ర’ అనే సంకలిత పుస్తకాల్లోనూ, ఆ తర్వాత చిన్న పుస్తకాల రూపంలోనూ, టాకింగ్‌ పాయింట్స్‌లోను దొరుకుతున్నాయి. ఆర్థిక వ్యవస్థపై ఆరెస్సెస్‌ ఆలోచనలు తెలుసుకోవడానికి ఇవి ఆధారమవుతాయి.

ఈ ఆలోచనలన్నిటిని ఒక చోట పోగుచేసి చూస్తే, ఆర్థిక శాస్త్రం మీద ఆరెస్సెస్‌ ఊహలు అద్భుతమైన చందమామ కధలను తలపిస్తాయి. ఈ విషయాన్ని ఈ వ్యాసంలో తర్వాత చర్చిద్దాం. 1980లో బీజేపీ ఏర్పడిన తర్వాత దాని పెరుగుదల, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, ఆ తరువాత అటల్‌ బీహారీ వాజ్‌పాయి నాయకత్వంలో కేంద్రంలో అధికారం అందుకోవడం, ఆ తర్వాత 2014లో నిర్ణయాత్మకంగా గెలవడంతో ఒక పొందికైన ఆర్థిక విధానం గురించి బీజేపీ, అలాగే దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌ ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, వారి చందమామ కథలు ఏ మాత్రం మార్పు లేకుండా అలానే కొనసాగుతున్నాయి. వీటిని ఆరెస్సెస్‌ శాఖలకు, శిక్షణ శిబిరాలకు పరిమితమై చర్చిస్తుంటారు. కానీ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను తప్పనిసరిగా, కిందమీదా పడైనా ఆరెస్సెస్‌ సమర్థించవలసిన పరిస్థితుల్లో, ప్రపంచానికి అంతటికి తెలిసిన ఆర్థిక విధానాన్నే అవలంబించవలసి వచ్చింది.

ఆ విధానం ఇంకేదో కాదు, విఫలమైన మూర్ఖపు నయా ఉదారవాదఆర్ధిక విధానం. ఇది చందమామ కథల తర్వాత ఇది రెండో దశ. ఈ రెండో దశను మనం ‘జంతు ఆత్మ’ ( యానిమల్‌ స్పిరిట్‌ )అని పిలవచ్చు. కార్పొరేట్‌ ఆర్థిక విధానాలను దూకుడుగా అమలుపరచడం, ‘ ట్రికిల్‌ డౌన్‌’ (పైనున్న కోటీశ్వరులకు కోట్లు ఇస్తే, అధమ స్థాయిలో ఉన్న పేదవాడికి పైసా దక్కుతుందన్న) సిద్ధాంతంపై నమ్మకం, సామాజిక సంక్షేమంలో కోతలు (ఎన్నికల సమయం మినహాయింపు అనుకోండి), నియంత్రణలు అన్ని ఎత్తివేయడం, విదేశీ పెట్టుబడికి స్వాగతం పలకడం, ప్రభుత్వ రంగాన్ని నాశనం చేయడం, కార్మికులను పీల్చి పిప్పిచేయడం చేయటం ఈ జంతుస్ఫూర్తి లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ చందమామ కధలు అనే మొదటి దశను, జంతు ఆత్మ అనే రెండో దశను పరిశీలించి, ఆరెస్సెస్‌ గజిబిజి దారిని కనిపెడదాం.

చందమామ కథలు
ఆరెస్సెస్‌ స్థాపించాలనుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై గోల్వాల్కర్‌ ఆలోచనలు, అలాగే తక్షణ ఆర్థిక సమస్యలపై అతని వ్యాఖ్యలు చాలా తక్కువసంఖ్యలోనూ, అమాయకంగాను వున్నాయి. గోల్వాల్కర్‌ ప్రకారం, ” అభివృద్ధిని సాధించడానికి రెండు మార్గాలు. ఒకటి, ప్రభుత్వ బలాన్ని ఉపయోగించి జాతి సంపదను విభజించటం; రెండవది, ఇదే లక్ష్యాన్ని ప్రజల హృదయాలను పరివర్తించడం ద్వారా సాధించడం. మనం ప్రజల హృదయాలను పరివర్తించడం అనే మార్గాన్నే అంగీకరిస్తాం.” ( శ్రీ గురూజీ సమగ్ర కాండ 2, పే 100-101). ఇదే ఆరెస్సెస్‌ ఆలోచనా సారం. ‘మొదటి మార్గం’ సోషలిజానికి సంబంధించినది. ప్రయివేటు ఆస్తిగా వున్న ఉత్పత్తి సాధనాలను ప్రజలకు ప్రయోజనం, ఉపయోగం కలిగే విధంగా సమాజపరం చేయటం సోషలిజం. గోల్వాల్కర్‌ దీన్ని వ్యతిరేకిస్తూ, ధనికులు తమ సంపదలో కొంతభాగాన్ని పేద ప్రజలకు ఇవ్వమని ధనవంతులను బతిమిలాడే అద్భుత నీతికథను అనుసరించమంటాడు.

దత్తోపాంత్‌ తెంగడి తన ‘మూడవ మార్గం’ అనే పుస్తకంలో ఈ అద్భుత కధకి తాత్వికమైన వివరణ ఇచ్చారు : ” దేనికైనా ముందు సరియైన ఆత్మగత, మానసిక పరివర్తన జరగకపోతే భౌతిక మార్పు జరగటం విజయవంతం కాదు.” కానీ, చరిత్ర అంతా దీనికి విరుద్ధమైన రుజువులతో నిండి ఉంది. భౌతికమైన మార్పులవలనే ఆత్మగత, మానసిక పరివర్తన జరుగుతుంది. ఆత్మగతానికి ప్రాధాన్యత ఇచ్చే మౌలికమైన తప్పును ఆరెస్సెస్‌ సమర్థించింది. ఆరెస్సెస్‌ మాత్రమే కాదు, నిజానికి పాలక పక్షం అన్ని సిద్ధాంతాలు తమ పాలనను శాశ్వతంగా నిలబెట్టుకోవడానికి ఈ మౌలికమైన తప్పునే సమర్థిస్తున్నాయి. గొప్ప ఆలోచనగా ముసుగు ధరించిన ఈ అద్భుత కథల పర్యవసానాలు ఎంత హాస్యాస్పదం వుంటాయో ఒకసారి పరిశీలిద్దాం.

”(దారిద్య్ర సమస్య)ను దేశంలోని ప్రతి ఒక్కవ్యక్తి తన స్వార్ధాన్ని అదుపులో పెట్టుకుని, నిజాయితీగా దేశ సంపదను పెంచటానికి కృషి చేయటం ద్వారా పరిష్కరించుకోవచ్చు,” అని గోల్వాల్కర్‌ రాశారు. (శ్రీ గురూజీ సమగ్ర కాండ 5, పే. 263-264). కనుక, పేదరికం అనేది వ్యక్తుల వైఖరి సమస్య అన్నమాట. నీవు గనుక, నిజాయితీతో, నిస్వార్ధంతో, దేశ సంపద పెరగటానికి తోడ్పడితే, పేదరికం మాయం అయిపోతుంది. అదేవిధంగా, ఆకలి, పౌష్టికాహారం లేమి పాదార్థిక సమస్యలు కావు, అవి ఆలోచనలలో వున్న లోపం. ”మన సమాజంలో చాలామంది సహోదరులకు ప్రతిరోజూ ఆహారం దొరకటం లేదు. ఈ సమస్య పరిష్కారం నిమిత్తం, పురాతన కాలంలో బలి వైశ్వ యాగం’ చేసేవారు. ఈ యాగం ఆచారం ఏమిటంటే మొదట ఆకలిగొన్నవారికి ఆహారం ఇవ్వాలి, ఆ తరువాతనే మిగతావారు భుజించాలి. ఇప్పుడు మనం ప్రతిదినం ప్రతి ఒక్కరి నుంచి ఒక పిడికెడు ఆహారధాన్యాలు ఆకలితో ఉన్నవారి కోసం సేకరించవచ్చు.

అదే నిజమైన ”బలి వైశ్వ యాగం.” (శ్రీ గురూజీ సమగ్ర కాండ 5, పే. 92) ఈ సందర్భంలో గోల్వాల్కర్‌ ఆలోచనల్లో ‘సోదరులు’ కనపడ్డారు కానీ, ‘మాతృమూర్తులు, సోదరీమణులు’ కనపడలేదని గమనించండి. ఇతర సందర్భాలలో మాత్రం వీరిని ఎక్కువగా పేర్కొంటుంటారు. దీనితో పాటు మరొక విషయం కూడా జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. 1960లలో భారత దేశ ప్రజలు అతి భీకర కరువును ఎదుర్కొంటూ, ఆహారం కొరతతో, ఆకలితో అల్లాడుతున్న రోజులలో అతను ఈరాతలు, ప్రసంగాలు చేశారు. ఆహార సంక్షోభాన్ని పేర్కొంటూ, గోల్వాల్కర్‌ పదే పదే ఈ చిట్కాను పేర్కొన్నారు. ”మనం ఆహార సంక్షోభాన్ని తీసుకుందాం. మనకేమి దక్కిందో, దానినుంచి ఒక రవంత తీసి, అవసరమున్నవాడికి ఇవ్వాలని మనమెందుకు ఆలోచించటం లేదు. మనం ఇతరులతో మన ఆహారాన్ని పంచుకోవటానికి సిద్ధంగా వుండాలి. మన సంప్రదాయంలో, సంసారి ఆహారం వండటం అయిన తరువాత, ముందుగా ఆకలికి అలమటించే వ్యక్తిని ఆహ్వానించి, గౌరవంగా, అతనికి తృప్తితీరా తినిపించి, మిగిలిన ఆహారాన్ని ప్రసాదంగా భావించి, తాను తినాలి ” ( శ్రీ గురూజీ సమగ్ర, కాండ 3, పే. 258)

గ్రామీణప్రాంతాల అభివృద్ధికి సంబంధించి గురూజీ సూక్తులు ఇదే విధంగా తేలికగా, అర్ధరహితంగా వున్నాయి. ” విదేశాల నుంచి తీసుకునే సహాయంమీద, వారి యంత్రాల మీద ఆధారపడటం మన దేశ అభివృద్ధికి సహాయ పడదు. మన రుషులు బిక్షాపాత్ర మీద ఆధారపడి, అవమానాలు పడుతూ జీవించమని బోధించలేదు. గ్రామ ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి, తమ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి; ఇదే మేలైన మార్గం.” (శ్రీ గురూజీ సమగ్ర, కాండ 5 పే. 13-14) అతను యంత్రాలకు వ్యతిరేకంగా దెబ్బలాడుతున్నాడు. ప్రపంచాన్ని చూసే విధానంలో అయన కట్టుబడి వున్న మరొక శాశ్వత లక్షణం ఇది. ఒక సమయంలో అయన ఇలా అన్నారు, ”… యంత్రాలు మనుషులను పనినుంచి గెంటివేస్తాయి. అలా జరగకూడదు. పాశ్చాత్య సిద్ధాంతం కోరికలను ఎన్నో రెట్లు పెంచుతుంది, వాటిని అందుకోవటానికి ఎక్కువెక్కువ యంత్రాలు కావాలి, ఇలా కొనసాగుతూ, చివరికి మనిషి యంత్రానికి బానిస అవుతాడు. మనిషి సంతోషాల కోసం యంత్రాలు అవసరమనేది స్పష్టం. కానీ ఇది ఒక భస్మాసురుడు లాంటిది. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే, దాన్ని తయారుచేసిన వాడినే నాశనం చేస్తుంది.

నైతిక బలమున్న జ్ఞానులు మాత్రమే భస్మాసురుడు లాంటి దీన్నిఅదుపులో పెట్టుకుని శాసించగలరు. అటువంటి సర్వశక్తివం తులైన పురుష పుంగవులు మాత్రమే మనిషి తన లక్ష్యాన్ని చేరుకోవటానికి మార్గదర్శకత్వం చేయగలరు.” చివరికి, రాజ్య పరిపాలన అంటే ఈ పైన చెప్పిన చిత్రవిచిత్ర ఆలోచనలను అమలు పరచటంగా ఆరెస్సెస్‌ భావిస్తున్నది. ” రాజ్యానికి సంపద వుండకూడదు, సంపద ఉన్నవాడికి అధికారం వుండకూడదు. రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడి వుండాలి. అప్పుడే త్యాగం, నిస్వార్ధపరత్వంతో న్యాయమైన పరిపాలన జరుగుతుంది.ఇటువంటి సామాజిక నిర్మాణం గురించి మన హిందూ సంస్కృతి ఆలోచించివుంది. ఆ పద్ధతిలో శక్తివంతులు గాని, ధనవంతులు గాని అన్యాయమైన ప్రవర్తన ద్వారా సమాజంలోని ఇతరులకు బాధను కలిగించలేరు. (శ్రీ గురూజీ సమగ్రకాండ 5, పే. 89-90).ఇంతకీ అతను కపటంగా నిర్దేశిస్తున్నది ఏమిటంటే, నాలుగు కులాల చాతుర్వర్ణ వ్యవస్థను. త్యాగ జీవులు, నిస్వార్థ పురుషులు సంపద ఉన్నవారిని, శక్తివంతులను పరిపాలిస్తారు. అయితే, సకల సంపదలు ఉత్పత్తి చేసే శ్రామిక ప్రజల గురించి కనీస ప్రస్తావన లేదు.

జంతు ఆత్మ
2014 నుంచి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానం, దీనికంటే ముందు బీజేపీ పాలన కింద ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఈ జంతాత్మ దశను తెలుపుతాయి. ఈ విధానాలను గురించి అనేక సంవత్సరాలుగా చెబుతున్నాము కనుక, వాటిని మళ్లీ తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాల్సి ఉంది.
ఆర్థిక విధానాల గురించి ఆరెస్సెస్‌ నిశిత పరిశీలన లేకుండా మాట్లాడుతూ, మరో పక్క బీజేపీి ప్రభుత్వ ఆర్థిక విధానానికి రక్షణ కవచంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా తలెత్తిన దుష్పరిణామాలను గురించి ఒక పక్కన ప్రశ్నలు లేవనెత్తుతూ, అలాగే కొన్ని విధానాలపై నిర్లక్ష్య వైఖరిని మాట వరసకు విమర్శిస్తూ ఆరెస్సెస్‌ తన పాత్ర పోషిస్తున్నది.

ఉదాహరణకు, హిమాలయ పర్వతాలు కరిగిపోవటం , నదీ జలాల కలుషితం, అడవుల నరికివేత లాంటి పర్యావరణ క్షీణత గురించి ఆరెస్సెస్‌ క్రమం తప్పకుండా తన బహిరంగ ప్రకటనలో మాట్లాడు తుంటుంది. అదేవిధంగా, కార్మికుల ప్రయోజనాల గురించి బిఎంఎస్‌ మాట్లాడుతుంది. రైతుల డిమాండ్ల గురించి బికేఎస్‌ లేవనెత్తుతుంది. ఎంఎస్‌ఎంఇ కష్టాల గురించి లఘు ఉద్యోగ భారతి మాట్లాడుతుంది. ఆర్థిక స్వావలంబన, విదేశీ పెట్టబడుల కట్టడి గురించి ఎస్‌జెఎం కబుర్లు చెబుతుంది. మధ్య మధ్యలో అఖిల భారతీయ ప్రతినిధి సభ (ముఖ్య నాయకులతో కూడిన అఖిల భారత సభ) స్వదేశీ ప్రాముఖ్యత గురించి, స్వావలంబన గురించి తీర్మానాలు చేస్తుంది.

(మిగతా రేపటి సంచికలో)
(”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం: కర్లపాలెం

  • సావేరా
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -