అమెరికాలోని పెద్ద నగరమైన న్యూయార్క్ ప్రపంచ పెట్టుబడి దారుల రాజధాని. ఆ నగర మేయర్‌గా అన్ని రకాల ఆటంకాలు, కుట్రలను అధిగమించి డెమోక్రటిక్ పార్టీలోని సోషలిస్టు జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక ప్రపంచంలోని యావత్ వామపక్ష శక్తులకు ఎంతో ఊపునిచ్చే పరిణామం. ఎన్నికల సర్వేల్లో పేర్కొన్నట్లుగానే 50శాతంపైగా ఓట్లు సాధించాడు. ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు అన్నట్లుగా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లోని కార్పొరేట్ల ప్రతినిధి న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రు కుమో స్వతంత్ర అభ్యర్ధిగా 41.6శాతం ఓట్లతో మట్టికరిచాడు. డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలను ధిక్కరించి పోటీలో నిలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి కర్టిస్ సిల్వాకు 7.1 ఓట్లు శాతం వచ్చాయి.న్యూజెర్సీ, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లుగా, వర్జీనియా లెప్టి నెంట్ గవర్నర్‌గా డెమోక్ర టిక్ పార్టీకి చెందిన అభ్యర్ధు లు మైక్ షెరిల్, అబిగెయిల్ స్పాన్‌బెర్గర్, హైదరాబాద్ మూలాలున్న గజాలా హష్మీ మంచి మెజారిటీలతో ఎన్నికయ్యారు. ఇది డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి చెంపదెబ్బ లాంటిదే. నేతలు, మీడియా మతకండ్లద్దాలను తగిలించు కొని ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ సామాన్య జనం ముఖ్యంగా కార్మికవర్గం పట్టించు కోలేదు. కంగుతిన్న ట్రంప్ చివరికి యూదులు కూడా మమ్దానీకి ఓటు వేశారని ఉక్రోశం వెళ్లగక్కాడు.
పాలస్తీనియన్లను ఊచకోత కోసిన ఇజ్రాయిల్ చర్యలను ఖండించటంలో మమ్దానీ ముందున్నవారిలో ఒకడు. అధికారిక పోలింగ్‌కు ముందే మూడోవంతు మంది ఓట్లు వేశారు, వారిలో 58శాతం మంది మమ్దానీకి మద్దతు ఇచ్చారనే వార్తలు వెలువడినపుడు అతని విజయం ఖరారైంది.తన ప్రయత్నాలన్నీ విఫలమై ఏ రీత్యా చూసినా మమ్దానీ విజయం ఖాయమని నిర్ణయించుకున్న తర్వాత చివరి నిమిషంలో ే స్వంత పార్టీని పక్కన పెట్టి ట్రంప్ స్వతంత్ర అభ్యర్ధి ముసుగులో ఉన్న డెమోక్రటిక్ పార్టీ తిరుగుబాటుదారుకు మద్దతు ప్రకటించాడు. మానవాళి చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ, ఎక్కడా విప్లవాలు చెప్పిరాలేదు, వాటికి ముహూర్తాలు, వాస్తు వంటివి కూడా లేవు. మమ్దానీ ఎన్నికను వాటితో పోల్చకూడదు గానీ శత్రువులు అలానే భావించారని ట్రంప్ చర్య వెల్లడించింది. జోహ్రాన్ గెలిస్తే ఆర్థిక, సామాజిక విపత్తు సంభవిస్తుందని, మిలిటరీని దింపుతానని, నిధులు విడుదల చేసేది లేదని బెదిరించినా ఓటర్లు లెక్కచేయలేదు. అమెరికా సమాజంలో ఒక మధనం జరుగుతున్నది.
లక్షలాది మంది ఇటీవలి కాలంలో సోషలిస్టులమని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేసినా ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అక్కడి కార్మికవర్గం మార్పును కోరుకుంటున్నారని, వామపక్షం వైపు మొగ్గేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒక సూచికగా చెప్పవచ్చు. దీని అర్ధం తెల్లవారేసరికల్లా అధికారానికి రాబోతున్నారని కాదు. జోహ్రాన్ పక్కా కమ్యూనిస్టు అని ప్రకటించి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుట్రచేసి ఫలితాలను ప్రభావితం చేసేందుకు చూసినా ఓటర్లు అయితే మాకేంటి అన్నట్లుగా ఓటువేశారు. ప్రపంచ పెట్టుబడిదారుల కుంభస్థలం మీద తొలిసారిగా ఒక సోషలిస్టు గద్దెనెక్కాడు. 1892 తర్వాత ఒక యువమేయర్‌గా కూడా జోహ్రాన్ చరిత్రకెక్కాడు. న్యూయార్క్ మేయర్ ఎన్నిక అమెరికా చరిత్రలో ఒక ప్రత్యేక పేజీకి నాంది పలికింది. ఇటీవలి కాలంలో ఫాసిస్టు ధోరణులు పెరుగుతున్న పూర్వరంగంలో కార్మికవర్గం వామపక్ష అభ్యర్ధివైపు మొగ్గటం యావత్ పురోగామిశక్తులకు ఉత్సాహం ఇచ్చే పరిణామం. అమెరికాలో సోషలిస్టు శక్తుల పెరుగుదలకు తోడ్పడే పరిస్ధితి కనిపిస్తున్నది.
డోనాల్డ్ ట్రంప్ జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంటా బయటాఅనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. వాటిలో ఒక ప్రధాన అంశంగా న్యూయార్క్ నగర మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ ఎన్నికను అడ్డుకోవటం కూడా ఉంది. బహుశా అమెరికా అధ్యక్షుల చరిత్రలో గడచిన శతాబ్దికాలంలో మరొకరెవరికీ ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాలే దని చెప్పవచ్చు. ఈ ఎన్నికల ఫలితం, పర్యవసానాలు వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు మధ్యంతర ఎన్నికల మీద కూడా ప్రభావం చూపవచ్చు అని చెబుతున్నారు. ఆ కారణం గానే ట్రంప్ స్వంత పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టడమే కాదు, అతగాడికి ఓటేస్తే జోహ్రాన్‌కు ఓటేసినట్లే అని చెప్పేంతవరకు వెళ్లాడు. మహాభారతంలో అభిమన్యుడిని అంతం చేసేందుకు చూసినట్లు జోహ్రాన్ ఓటమికి అన్ని రకాల శక్తులు ఏకమైనా సర్వేలు అతనికి అనుకూలంగా చెప్పాయి. ఈ అభిమన్యుడు కుట్రలను వమ్ము చేసి పద్మవ్యూహం నుంచి జయప్రదంగా బయటపడి విజయదుందుభి మోగించాడు. అమెరికాలో సరికొత్త రాజకీయాలకు నాంది పలికాడని చెప్పవచ్చు. డెమోక్రటిక్ పార్టీలో ఉన్న పురోగామి శక్తులు మరింతగా తమ స్థానాన్ని పటిష్టపరుచుకొనేందుకు ఈ విజయం ఎంతగానో తోడ్పడుతుంది, ఎంతో ఊపునిస్తుంది, సమీకరణ వేగం పుంజుకుంటుంది. ఈ విజయం ఏ పరిణామాలకు నాంది పలికిందో మున్ముందు చూడాల్సిందే!
పెట్టుబడి కుంభస్థలంపై సోషలిస్టు మేయర్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



