– ప్రధాన పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠ
– ఓటర్లలో గందగోళం సృష్టిస్తున్న ‘సర్వే’ నివేదికలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారం హౌరాహౌరీగా సాగుతోంది. మరోవైపు ఓటర్ల నాడిపై ఆయా ప్రయివేటు సంస్థలు చేస్తున్న సర్వేలు ప్రధాన పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు తలపడుతుండగా, రోజుకో సర్వే పేరుతో వెలువడుతున్న నివేదికలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసి, తమకు అనుకూలంగా ఓట్లు దండుకునేందుకు పార్టీలు ఈ సర్వేలను ఒక అస్త్రంగా ప్రయోగిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోజుకో సర్వే.. గందరగోళం
ఉపఎన్నికల బరిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ‘కేకే సర్వే’, ‘చాణక్య స్ట్రాటజీస్’, ‘సైదులు సర్వే’, ‘పల్స్ టుడే సర్వే’ వంటి పలు సర్వేలు తెరపైకి వచ్చాయి. ఈ సర్వేలు ఒకదానికొకటి పూర్తి భిన్నమైన ఫలితాలను వెల్లడించాయి. పార్టీల వారీగా చేయించుకున్న సర్వేలని తెలుస్తున్నా.. అవే నిజమనే భ్రమలో మీడియాలో ప్రచారం అవుతున్నాయి.
కాంగ్రెస్ ఆగ్రహం.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
కేకే సర్వే ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి(ఆర్వో) అధికారికంగా ఫిర్యాదు చేశారు. మరో కాంగ్రెస్ నాయకుడు, ఫిషరీస్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ సైతం నకిలీ సర్వేలను అడ్డుకోవాలని కోరుతూ.. ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు డైరెక్షన్‌లోనే ఈ సర్వేను విడుదల చేశారని, ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వారు ఆరోపించారు.
గందరగోళం సృష్టిస్తున్న సర్వే
కేకే సర్వేకు పోటీగా సైదులు సర్వే పేరుతో మరో నివేదిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సర్వే ఫలితాలు కేకే సర్వేకు భిన్నంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుండటంతో, ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే, సర్వేలో సంబంధించిన పూర్తి వివరాలు.. ఎలా చేస్తున్నారనేది స్పష్టత లేదు. ఊహాగానాల ఆధారంగా నడుస్తోంది. పల్స్ టుడే పేరుతో సర్వే ప్రచారంలో ఉన్నప్పటికీ, ఆ సంస్థ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి ఎలాంటి అధికారిక నివేదికనూ విడుదల చేసినట్టుగా ఆధారాలు లేవు. మొత్తం మీద రకరకాల సర్వేల ఫలితంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులు, పార్టీల నాయకులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న సర్వేలను ప్రచారం చేసుకుంటూ, ప్రతికూల సర్వేలను ప్రత్యర్థుల కుట్రగా కొట్టిపారేస్తున్నారు. ఈనెల 11న జరగనున్న పోలింగ్ వరకు ఈ సర్వేల టెన్షన్ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో ప్రచారంలో ఉన్న చాలా సర్వేలు ఈసీఐ మార్గదర్శకాలను పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సర్వేల టెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



