Thursday, November 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఉద్యోగాలివ్వలేం…విదేశాలకెళ్లండి

ఉద్యోగాలివ్వలేం…విదేశాలకెళ్లండి

- Advertisement -

కేంద్రంలో 9.79 లక్షల ఖాళీ పోస్టులు
భర్తీ చేయలేక చేతులెత్తేస్తున్న మోడీ సర్కార్‌
భారతీయ నిరుద్యోగుల్ని ఉపాధి పేరుతో విదేశాలకు పంపే కుట్రలు
దానికోసం ‘లేబర్‌ మొబిలిటీ యాక్ట్‌’కు రూపకల్పన
1983 ఇమ్మిగ్రేషన్‌ చట్టానికి ప్రత్యామ్నాయంగా కొత్త చట్టం
అభ్యంతరాలకు ఈ నెల 7 ఆఖరి తేదీ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ అంచనాల ప్రకారం కేంద్రంలో 28 శాతం అంటే దాదాపు 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు మోడీ సర్కార్‌ సిద్ధంగా లేదు. ప్రయివేటీకరణ మంత్రంతో, కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తుతున్న కేంద్ర ప్రభుత్వం సర్కారు కొలువుల భర్తీని వృధా ఖర్చుగా భావిస్తోంది. నిరుద్యోగుల మధ్య పోటీని పెంచి, ప్రయివేటు సంస్థలకు మేథస్సును చౌకగా అందించేందుకు శాయశక్తులా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోంది. తాజాగా దేశంలోని నిరుద్యోగ యువతకు విదేశాలనే ఎండమావుల్ని చూపుతూ, 1983 నాటి ఇమ్మిగ్రేషన్‌ చట్టానికి ప్రత్యామ్నాయంగా కొత్తగా ‘విదేశీ మొబిలిటీ సౌలభ్యం మరియు సంక్షేమ ముసాయిదా చట్టం-2025’ను తీసుకొచ్చింది.

ఈ చట్టంలో అన్నీ లొసుగులే ఉన్నాయి. విదేశీ వ్యవహారాలశాఖ వెబ్‌సైట్‌లో ఈ ముసాయిదా చట్టం డ్రాఫ్ట్‌ను పెట్టి, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్‌ 7వ తేదీ లోపు మెయిల్‌కు లేదా పోస్ట్‌ ద్వారా పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ముసాయిదా చట్ట రూపకల్పనపై స్టేక్‌ హోల్డర్లతో ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరపలేదు.కార్మిక సంఘాలతో చర్చించలేదు. నిరుద్యోగ యువతీయువ కులతో మాట్లాడలేదు. అఖిలపక్ష సమావేశాల ఊసే లేదు. రాజకీయపార్టీల సలహాలు, సూచనలు స్వీకరించలేదు. అంతా ఏకపక్షమే. ”మేం వెబ్‌సైట్‌లో పెట్టాం…చూస్తే చూడండి లేకుంటే లేదు” అనే నిర్లక్ష్యధోరణితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. మోడీ విదేశీ పర్యటనలు, పత్రికా ప్రకటనలకోసం వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, ఈ చట్టంపై ప్రచారం కోసం ఒక్కరూపాయి కూడా వెచ్చించలేదు. వెబ్‌సైట్‌లో ముసాయిదా చట్టాన్ని పెట్టేసి సైలెంట్‌ అయిపోయింది.

జెన్‌జెడ్‌ భయం..
ప్రపంచ వ్యాప్తంగా జెన్‌జెడ్‌ ఉద్యమాలు (జనరేషన్‌-జెడ్‌…1997-2012 మధ్య జన్మించిన తరం) తీవ్రమౌతున్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా ఈ తరహా ఆందోళనలు పెరుగుతున్నాయి. దీన్ని గమనించిన కేంద్రం ప్రభుత్వ వైఫల్యాలపై వ్యతిరేకత తగ్గించుకోవడం కోసం ‘విదేశీ కొలువు’ అనే నినాదాన్ని తలకెత్తుకొంది. దానిలో భాగంగానే విదేశీ మొబిలిటీ చట్టాన్ని తెస్తున్నట్టు మేథావులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌కు ఉన్న సానుకూల అంశం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో యువ కార్మికులు ఉండటమే. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వారికి సరిపడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించలేక పోతున్నది. దీంతో దేశంలో చాలా మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వీరిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం.

దీనికోసం గడచిన ఆరేండ్లలో భారతదేశం యూరప్‌, ఆసియా దేశాలతో సుమారు 20 కార్మిక ఒప్పందాలు కుదుర్చుకుంది. జపాన్‌, జర్మనీ, ఫిన్లాండ్‌, తైవాన్‌ వంటి దేశాలు కార్మిక లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి పలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి అక్కడకు పంపుతామని ముసాయిదా బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏడాదికి 7 లక్షల మందిని విదేశాలకు పంపుతున్నది. 2030 నాటికి ఆ సంఖ్యను 15 లక్షలకు పెంచాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల యువతరం ఉపాధి కోసం విదేశాలకు వలసలు వెళ్లిపోతుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటూ స్వదేశంలో ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీ దేశం లోని యువతను విదేశాలకు వలస కార్మికులుగా పంపాలని ప్రయత్నించడం గమనార్హం!

అభ్యంతరాలు ఇలా పంపాలి
భారత విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ‘విదేశీ మొబిలిటీ సౌలభ్యం మరియు సంక్షేమ ముసాయిదా చట్టం-2025’ పై అభ్యంతరాలు, సూచనలు అభిప్రాయాలను నవంబర్‌ 7వ తేదీలోపు పంపాలి. ఆన్‌లైన్‌ ద్వారా అయితే వెబ్‌సైట్‌కు పంపాలి. ఇ-మెయిల్‌లో మీ పూర్తి పేరు, ఉంటే సంస్థ పేరు, చిరునామా తెలపాలి. రాతపూర్వకంగా పంపాలనుకుంటే జాయింట్‌ సెక్రటరీ (ఓవర్సీస్‌ ఎంప్లారుమెంట్‌ అఫైర్స్‌), మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నెల్‌ ఆఫైర్స్‌, రూం నెంబర్‌ – 509, అక్బర్‌ భవన్‌, చాణక్యపురి, న్యూఢిల్లీ – 110021 చిరునామాకు పంపాలి.

ముసాయిదా చట్టంలో లోపాలు
”మొబిలిటీ” అనే పదానికి అర్థమే అస్పష్టంగా ఉంది. ఇది కేవలం ఉద్యోగాలకు మాత్రమే సంబంధించిందా? లేక విద్యార్థులు, శిక్షణార్థులు, పరిశోధకులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారా? అనే ప్రశ్నకు సమాధానం లేదు.
నియామక సంస్థల నియంత్రణ లోనూ స్పష్టత లేదు. రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలపై లైసెన్సింగ్‌, పర్యవేక్షణ, రద్దు వంటి అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతల్ని స్పష్టంగా నిర్వచించలేదు. ఎవరి అధికారాలు ఏమిటనే విషయంపై స్పష్టత లేదు.
పాత ఇమ్మిగ్రేషన్‌ చట్టంలోని రక్షణాత్మక వ్యవస్థల్ని తొలగించారు. 1983 చట్టంలో ఉన్న ‘ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ రిక్వైర్డ్‌’ (ఈసీఆర్‌) విధానం వల్ల వలస కార్మికులకు రక్షణ ఉండేది. కొత్త చట్టంలో ఆ వ్యవస్థనే పూర్తిగా మార్చేశారు. దీనివల్ల వేతన కార్మికులు మోసపూరిత నియామకాల బారిన పడే అవకాశం ఉంది.

వలసదారుల సంక్షేమ నిధిని ముసాయిదాలో ప్రస్తావించారు. కానీ ఆ సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? దాని వినియోగం ఎవరి ఆధీనంలో ఉంటుంది? అర్హతలు ఏంటి? అనే ప్రశ్నలకు
సమాధానాలు లేవు.
‘మొబిలిటీ రెగ్యులేటర్‌’ అనే అధికారి పదవిని సృష్టించారు. ఆయన అధికార పరిమితి, బాధ్యతలు, సమన్వయ అంశాలపై స్పష్టత లేదు. రాష్ట్ర స్థాయి అధికారులు, విదేశాంగ మిషన్‌లతో ఆ అధికారి ఎలా పనిచేస్తారో వివరణ లేదు.
మహిళా వలసదారుల సమస్యలకు కొత్త చట్టంలో ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పటికే గల్ఫ్‌ దేశాల్లో పనిచేసే మహిళా వలసదారులు అనేక వేధింపులు, దోపిడీలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారు. ఈ చట్టంలో వారికోసం ప్రత్యేక విభాగమే లేదు.

వలసదారుల న్యాయపరమైన హక్కులపై స్పష్టత లేదు. విదేశాల్లో మోసపోయిన కార్మికుడికి భారత ప్రభుత్వం ఎలాంటి న్యాయ సహాయం లేదా పరిహారం అందించాలనే విషయంలో స్పష్టమైన విధానం లేదు. సంక్షేమం పేరుతో పరిపాలనా నియంత్రణకే కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
వలసదారుల ఫిర్యాదుల పరిష్కా రానికి ‘విదేశీ మొబిలిటీ ట్రిబ్యునల్‌’ ఏర్పాటుపైనా అస్పష్టతే. ఆ ట్రిబ్యునల్‌ తీర్పులు చట్టపరంగా బైండింగ్‌గా ఉంటాయా? అప్పీల్‌ ఎలా వేయాలి? అనే స్పష్టత లేదు. వలసదారుల వివరాలు డిజిటల్‌ డేటాబేస్‌లో నమోదు చేస్తే, దాని గోప్యత, వినియోగ పరి మితులు, భద్రతా ప్రమాణాలను ప్రస్తావించలేదు.
కొత్త చట్టం అమలు, పర్యవేక్షణ మొత్తం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, వలస కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలకు స్థానం లేదు. వాటి గురించి నామ్‌కే వాస్తేగా ప్రస్తావించి వదిలేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -