రెండింటిని సమానంగా తీసుకోవాలి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి
పాఠశాల స్థాయి దాటిన తర్వాత కూడా క్రీడలను నిత్యం కొనసాగించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి
క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని సమానంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. గురువారం గోపాలపేట మండలంలోని బుద్దారం లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన, జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు. వీరితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ లోకనాథ్ రెడ్డి, అచ్యుత్ రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి తెలకపల్లి, వెల్దండ పాఠశాలల జట్ల మధ్య కబడ్డీ మ్యాచ్ తో ఆటల పోటీలను ప్రారంభించారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ ఆటల పోటీల్లో వనపర్తి జిల్లా నుంచి గోపాల్పేట, పెద్దమందడి, కొత్తకోట, నాగర్ కర్నూల్ జిల్లా నుంచి కొల్లాపూర్, తెలకపల్లి, వెల్దండ, మన్ననూరు పాఠశాలల జట్లు పాల్గొన్నాయి. జోనల్ స్థాయిలో గెలిచిన చెట్లు రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు ఎంపిక కానున్నాయి.
అంతకుముందు కార్యక్రమంలో చిన్నారెడ్డి ప్రసంగిస్తూ వనపర్తి కేవలం వనాలపర్తి మాత్రమే కాదని ఇది ఆటలపర్తి కూడా అని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటిని విద్యార్థులు సమానంగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మీరు కూడా ఆత్మవిశ్వాసంతో చదువుతోపాటు క్రీడల్లో కూడా అత్యున్నతంగా రాణించాలని తెలియజేశారు. ఇటీవల భారత మహిళల జట్టు క్రికెట్ ఆటలో ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న విషయాన్ని విద్యార్థినులకు గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, నూతన స్పోర్ట్స్ పాలసీని తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంచి క్రీడాకారుడని, ఆయనకు ఫుట్బాల్ ఆటపై ఎంతో ఉందని, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫుట్బాల్ ఆడేందుకు ఇష్టపడతారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అమ్మాయిలు క్రికెట్, ఫుట్బాల్ ఆటల్లో రాణించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దేశంలో క్రికెట్లో నిర్వహిస్తున్న లీగ్ మ్యాచ్ల ద్వారా ఎంతోమంది ప్రతిభ కనబరిచిన వారు జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నారని, అదే మాదిరిగా ఫుట్బాల్ లో సైతం రాష్ట్రాల మధ్య లీగ్ మ్యాచ్లు నిర్వహించాలని అన్నారు.
వందేమాతర గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు అందరూ వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటాలని గుర్తు చేశారు. గోపాల్పేట ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తనకు బిడ్డలాంటిదని, ఈ పాఠశాల ఏర్పాటు కోసం తాను ఎంతో కృషి చేసినట్లు గుర్తు చేశారు. ఈ పాఠశాలకు మరో ఎకరా స్థలాన్ని క కేటాయించేందుకు ప్రతిపాదించినట్లు, దాన్ని పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చొరవ తీసుకొని కేటాయించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నిటితో పాటు విద్యార్థులు ఆరోగ్యంపై కూడా దృష్టి సాదించాలని సరేనా ఆహారం తీసుకోవడంతో పాటు, యోగ సాధన చేయాలని సూచించారు. అదేవిధంగా సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ పుట్టిన నేలను మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో ఓటమిని ఒక పాఠం గా తీసుకుని, మళ్లీ సాధన చేసి విజయాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఓటమి అనేది ముగింపు కాదని విద్యార్థినులకు సూచించారు. క్రీడలని పాఠశాల స్థాయిలో మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా ముఖ్యం ఆడుతూ కొనసాగించాలని తెలియజేశారు. అలా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య విద్యలో సీటు సంపాదించిన విద్యార్థిని హిమబిందు, కబడ్డీలో జాతీయస్థాయిలో శిక్షణ పొందుతున్న విద్యార్థిని నందినిని ముఖ్య అతిథులు శాలువాతో సన్మానించారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి హాజరై ఆటల పోటీలను ప్రారంభించిన ముఖ్య అతిథులను పాఠశాల సిబ్బంది సత్కరించారు.
చేపల మార్కెట్ను వినియోగంలోకి తేవాలి
గోపాల్పేట మండల కేంద్రంలో నిర్మించిన చేపల మార్కెట్ను వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. గోపాల్పేట లో నిర్మించి నిరుపయోగంగా ఉన్న చేపల మార్కెట్ను కలెక్టర్ పరిశీలించారు. దీని వినియోగంలోకి తీసుకురావడానికి వెంటనే బోర్ ద్వారా నీటి ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మత్స్యకార సంఘం తరఫున సభ్యులు కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు.
స్థల పరిశీలన చేసిన కలెక్టర్
మండల పరిధిలోని పోలికపాడు గ్రామ పరిధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి పరిశీలించారు. ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన మ్యాప్ ను పరిశీలన చేశారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు సంబంధిత ప్రదేశంలో కనెక్టివిటీ, సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డివైస్ సుధీర్ రెడ్డి, డిసిఒ ప్రమోద, జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, తాసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపీడీవో అయిషా, తదితరులు పాల్గొన్నారు.


