సెంట్రల్ ప్యానెల్‌లోని అన్ని పదవులు క్లీన్‌స్వీప్
ఏబీవీపీకి చావుదెబ్బ… ఉన్న ఒక్కటి ఊడింది
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాల ప్యానెల్ ఘన విజయం సాధించింది. సెంట్రల్ ప్యానెల్‌లో ఉన్న నాలుగు ప్రధాన పోస్టులను లెఫ్ట్ ప్యానెల్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీకి చావుదెబ్బ తగిలింది. సిట్టింగ్ జాయింట్ సెక్రెటరీ స్థానాన్ని కూడా ఏబీవీపీ కోల్పోయింది. జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికలు నవంబర్ 4న జరిగాయి. ఆ రోజు నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టులతో పాటు, 42 కౌన్సిలర్ల పోస్టులకు పోలింగ్ జరిగింది. 67 శాతం ఓటింగ్ జరిగింది. మంగళవారం రాత్రి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగగా, గురువారం సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నాలుగు సెంట్రల్ ప్యానెల్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి పదవులలోనూ లెఫ్ట్ యూనిటీ (ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ, డీఎస్‌ఎఫ్) సొంతం చేసుకుంది. ఏబీవీపీ తుడిచిపెట్టుకుపోయింది.
జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలిగా లెఫ్ట్ ప్యానల్ తరపున పోటీ చేసిన అదితి మిశ్రా (1,937), ఏబీవీపీ అభ్యర్థి వికాస్ పటేల్ (1,488)పై 449 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఉపాధ్యక్షురాలిగా లెఫ్ట్ ప్యానల్ తరపున పోటీ చేసిన కిజాకూట్ గోపిక బాబు (3,101), ఏబీవీపీ అభ్యర్థి తన్యా కుమారి (1,797)పై 1,314 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా లెఫ్ట్ ప్యానల్ తరపున పోటీ చేసిన సునీల్ యాదవ్ (2005), ఏబీవీపీ అభ్యర్థి రాజేశ్వర్ కాంత్ దూబే (1901)పై 104 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సహాయ కార్యదర్శిగా లెఫ్ట్ ప్యానల్ తరపున పోటీ చేసిన డానిష్ అలీ (2,083), ఏబీవీపీ అభ్యర్థి అనుజ్ డమరా (1,797)పై 286 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
దీనితో పాటు, వామపక్ష కూటమి మూడు ఐసీ స్థానాలను, కౌన్సిలర్ పదవులను గెలుచుకుంది. అందులో ఒక ఐసీ స్థానాన్ని, ఏడు కౌన్సిలర్ స్థానాలను ఎస్‌ఎఫ్‌ఐ గెలుపొందింది. మొత్తం తొమ్మిది స్థానాలకు ఎస్‌ఎఫ్‌ఐ పోటీ చేయగా, అందులో ఎనిమిది స్థానాలను సొంతం చేసుకుంది. సెంట్రల్ ప్యానెల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థి కిజాకూట్ గోపిక బాబు అత్యధిక మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఈ విజయం జేఎన్‌యూ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ చేసిన ప్రయత్నాలకు ప్రతిఘటన అని ఎస్‌ఎఫ్‌ఐ జేఎన్‌యూ కార్యదర్శి పి.పార్వతి అన్నారు. గత సంవత్సరాల్లో ఏబీవీపీ ఆధిపత్యం చెలాయించిన స్కూల్స్‌లో కూడా వామపక్ష కూటమి విజయం సాధించడం దీనికి ఉదాహరణ అని ఆమె అన్నారు.
జేఎన్‌యూ విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ శుభాకాంక్షలు
జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో సంఘ్ పరివార్ మతతత్వ, విభజన రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించినందుకు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ విప్లవాత్మక శుభాకాంక్షలు తెలిపింది. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం సాజి, శ్రీజన్ భట్టాచార్య ప్రకటన విడుదల చేశారు. లెఫ్ట్ యూనిటీ ప్యానెల్‌ను ఎన్నుకోవడంతో జేఎన్‌యూ విద్యార్థులు విశ్వవిద్యాలయం ప్రగతిశీల, ప్రజాస్వామ్య, లౌకిక వారసత్వం పట్ల తమ నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన ఆదేశం మితవాద నిరంకుశత్వాన్ని స్పష్టంగా, చేతనంగా తిరస్కరించడాన్ని, విమర్శనాత్మక ఆలోచన, ప్రతిఘటన కోటగా జేఎన్‌యూ పాత్రను నిరంతరం నొక్కిచెప్పడాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎ, డీఎస్‌ఎఫ్‌లతో కూడిన లెఫ్ట్ యూనిటీ ప్యానెల్ గణనీయమైన మెజార్టీతో నాలుగు కేంద్ర ప్యానెల్ పదవులను గెలుచుకుని, అఖండ విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు.
వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థి కె. గోపికా బాబు, దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారని, ఇది క్యాంపస్ లోపల వామపక్ష ప్రగతిశీల ఉద్యమానికి ఒక ప్రధాన రాజకీయ విజయాన్ని సూచిస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితం కేవలం సంఖ్యాపరంగా విజయం మాత్రమే కాదని, ద్వేషం, మత ధ్రువీకరణ, కాషాయీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక రాజకీయ ప్రకటన అని పేర్కొన్నారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం సమ్మిళితత్వం, సామాజిక న్యాయం, ప్రగతిశీల రాజకీయాల విలువలను కొనసాగి స్తుందని ఫలితాలు పునరుద్ఘాటిస్తున్నాయన్నారు. సెంట్రల్ ప్యానెల్ పదవులు, కౌన్సిలర్ పదవులలో లెఫ్ట్ యూనిటీ విజయం మితవాద విభజన ఎజెండాపై సామూహిక, సమస్యల ఆధారిత రాజకీయాల శాశ్వత బలాన్ని ప్రదర్శిస్తుందని స్పష్టం చేశారు.



