Monday, November 10, 2025
E-PAPER
Homeదర్వాజజాను తెనుగు జాలువారించిన 'మొలాటు'

జాను తెనుగు జాలువారించిన ‘మొలాటు’

- Advertisement -

కూకట్ల తిరుపతి కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సామాజికోద్యమకారుడిగా, సాహితీ సంస్థల బాధ్యుడిగా, రంగస్థల నటుడిగా, ఉపాధ్యాయుడిగా అందరికీ చిరపరిచితం. ఆయన వత్తి రీత్యా పిల్లలకు మాతభాషా మాధుర్యాన్ని పంచుతూ, ప్రవత్తి రీత్యా మూడు దశాబ్దాలుగా సాహిత్య సజన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన ఆలోచనలకు పదునుపెట్టుకుంటూ, సామాజిక న్యాయం కోసం కలం కదుపుతున్న అభ్యుదయ కవి కూకట్ల తిరుపతి. ఇతని రచనల్లో పల్లెటూరి జీవితం పరిపూర్ణంగా కనబడుతుంది. పల్లెసీమల ప్రకతితో, పరిసరాలతో ఎంతో అనుభవాన్ని గడించిన వ్యక్తికావడం వలన ఆయన కవిత్వంలో జాను తెలుగు జాలువారుతుంది.

తెలంగాణ జానపదుల జీవన విధానం, అక్షరాలా పుష్కలంగా కనబడుతుంది. కార్మికులు, కర్షకులు, బడుగు జీవుల జీవితాలే ఈయన కవితా ఇది వత్తాలు. ప్రజల పక్షాన కూకట్ల కలం నిలబడుతుంది. నిత్తెం ప్రజా సమస్యల సాధనకు ఖలేజాతో కలెవడుతుంది. జానపదుల భాషను, జీవనశైలిని, ఇంపైన భావనా రీతులను సొంతం చేసుకుని, ఆధునిక సాహిత్య ప్రక్రియ అయిన వచన కవిత్వంలో ఈయన వాస్తవికంగా అస్తిత్వవాదాన్ని పలికిస్తున్నారు. కూకట్ల తిరుపతి కవితా నిర్మాణం ఆలోచనత్మకంగా, ఆకర్షణీయంగా, కథనాత్మక శైలి, వర్ణనాత్మక శైలిలో ఉండి, పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. వ్యవసాయ వత్తి పదాలు, గ్రామీణ పదాలు, చేతివత్తి పదాలు ఈయన కవిత్వంలో ఎక్కువగా ఉంటాయి. ఎర్రగాలు, పల్లె, ఆరుద్ర పురుగు, జల్లెడ, నల్లాలం పూలు, ఆట కోయిలు ఇప్పుడు మొలాటు ఇలా తన పుస్తకాలకు కూడా గ్రామీణ నేపథ్యంలో ఉన్న పేర్లను పెట్టి, తాను పుట్టి పెరిగిన పల్లె వాతవరణాన్ని తన కవిత్వంలో రంగరించి పోస్తాడు. ఈ మొలాటు పుస్తకంలో కూడా సొక్కం లాంటి తెలంగాణ పల్లె పదాలు కోకొల్లలుగా కనబడతాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో అంతరించిపోతున్న కుల వత్తులకు తన కవిత్వం ద్వారా ఓదార్పునిస్తున్నాడు. గొల్ల కురుమల చేతివత్తుల పైనే కాకుండా సబ్బండ వర్ణాల కుల వత్తుల పైన, కార్మిక, కర్షక కష్టాల పైన ఈ కవికి మంచి సోయి ఉంది. వరి గింజలను నానబెట్టి, నారుమళ్లలో వేసి, వాటికి నీరు పెట్టినప్పుడు అది కొద్దీ రోజులకు పచ్చబడి నారుగా మారుతుంది. అలా తొలిసారి పచ్చగా మొలకెత్తిన నారుమడినే మొలాటు అంటారు. అంటే విత్తనం వేసిన తర్వాత మొలకెత్తిన క్షేత్రం మొలాటు అన్నమాట. మొలాటును కాపాడుతనే పంట కాలంలో ఏపుగా పెరిగి, మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘మొలాటు’ లక్ష్యం సామాజిక హితమే. తన జీవితానుభవాలను కవిత్వంగా మలిచిన సామాజిక సజనకారుడు కూకట్ల. ఇందులో మొదటి కవిత ‘బువ్వ చెట్టు’. ఈ కవితా శీర్షిక చాలా సరళంగా ఉన్నప్పటికీ ఇందులో కవిత్వం ఎంతో విస్తత అంతరార్థాన్ని కలిగి ఉంది.

వ్యవసాయం, శ్రమ, ఆకలి, ఆశ, పెట్టుబడి, ప్రతిఫలం వంటి తీవ్రమైన సామాజిక అంశాలను ఇందులో స్పశించారు. జీవనోపాధి కోసం పడే కష్టంలో ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని లోకకవిగా ప్రశ్నించారు. శ్రమ దోపిడీని గుర్తించాడు ‘ఆనెలు కాసిన అరికాళ్ళ కింద మంటలు/ బండెడు చాకిరిని మెడల మీద గుంజడం’ వంటి పంక్తులు కార్మిక కర్షకులు పడే కష్టాన్ని చూపిస్తాయి. రైతు పడే కష్టంతోనే ఆహారం పండుతుందనే వాస్తవాన్ని చెప్పాడు. చెట్టు, బువ్వ, చెమట, ఉప్పు వంటి పదాలు ఈ కవితకు సహజత్వాన్ని జోడించాయి. ఇది శ్రమజీవుల ఆత్మకథగా సాగుతూ, పాఠకుల హదయాన్ని తాకే అద్భుతమైన కవిత. పుస్తక శీర్షికైన ”మొలాటు” కవితలో మానవ జీవితంలో ఆశావాదం, అంతర్గత శక్తి గురించి చక్కగా వివరించారు. కవి దైనందిన ఒడిదొడుకులకు లొంగిపోకుండా, మనిషితనాన్ని నిలుపుకుంటూ, ఉన్నత లక్ష్యాల వైపు సాగిపోవాలని ఉద్బోధించారు. అందుకొరకు ‘బొండిగల మట్టుకు మునిగిన అహాన్ని బొందవెట్టుకోవాలె/ మనిషితనపు మొలాటుగ ఇగురువెట్టాలె’ అని అంటారు.

‘వడ్లపిట్ట తల్కాయల పుట్టిన ఇగుర మోలె/ సొంతగూడును సోయితో సుకోశిగ దిద్దుకొనాలె’ అని ప్రకతిని పరిశీలించి మనం నేర్చుకోవాలని సూచిస్తారు. ‘పండు బుడుంకాయల పక్వాన్ని’, ‘బుడ్డగాశి పండ్ల తీయటి రసాన్ని’ వంటి పదప్రయోగాలతో కవిత్వం యొక్క రుచిని, సహజత్వాన్ని పెంచారు. చివర్లో ‘ఎర్రమట్టి కుంకుమను గట్టిగా అలుకు పూత పూయాలి’ అనే పంక్తి శుభాన్ని, ఆశను, మరియు బలమైన అనురాగాన్ని, శ్రమ జీవన సౌందర్యాన్ని సూచిస్తుంది. ఇంకా ప్రకతి పట్ల ప్రేమను, భూత దయను మరియు జీవన మాధుర్యాన్ని, పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించారు. భవిష్యత్తు కోసం, త్యాగపూరితమైన ఆశయాల కోసం ముందడుగు వేయాలనే సందేశంతో ఈ కవిత కొనసాగింది. ‘ఎనగర్ర’ కవితలో కవి కూకట్ల తన తల్లి అంకవ్వ ఓర్పును, నేర్పును, పది మందికి సాయం చేసే గుణం గురించి, కుటుంబం కొరకు తను పడిన కష్టాన్ని మన కళ్లముందుంచారు. ఇంటికి ఎనగర్ర ఆధారం. ఎనగర్ర లేకపోతే ఇల్లు నిలబడదు. అదేవిధంగా మెట్టినింటికి తన తల్లి ఆధారమై ఎనగర్రగా నిలిచిందని అంటారు.

‘ఇత్తునం’ కవితలో కూకట్ల తిరుపతి పుట్టిన ఊరులో అనుభవించిన బాల్యపు తీపి జ్ఞాపకాలను రాసి పోశారు. పల్లెటూరి జీవిత నేపథ్యమున్న పాఠకుడికి తన బాల్యాన్ని గుర్తుకు తెస్తుంది. ‘పాయిరంగల్ల యిల్లు’ కవిత ఉమ్మడి కుటుంబంలోని ప్రేమలను, ఆప్యాయతలను, సామూహికతను తెలియజేస్తుంది. అలాగే రైతు సమస్యలపై ‘నిలువు దోప్కం’, ‘ఆ.. పాదాలకు పబ్బతులు’, ‘సాలెన్క సాలు’, ‘బుగులు మొగులు’ మొదలైన కవితలను ఆర్ద్రంగా చిత్రించారు. అంతేకాక ఆడపిల్లలపై జరుగుతున్న ఆకత్యాలను ప్రశ్నించి, స్త్రీల పట్ల తనకున్న గౌరవ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. గతి తప్పి న కాలం, నెత్తుటి పునాది, జీగంజి, కలానికి కళ్ళు ఉంటాయి, తలపోత, ఆత్మగళ్ల మట్టి, వలస గోస, పొద్దుపొడుపు మొదలగు కవితలన్నీ వేటికవి ప్రత్యేకమైనవే. ఇలా తన కవిత్వంలో అనేక సామాజిక సమస్యలను ఎత్తిచూపారు. బడుగు, బలహీనుల గొంతుకై తన కవితా స్వరాన్ని వినిపించారు. వస్తు వైవిధ్యంతో కూడిన యాభై కవితలతో ‘మొలాటు’ను కళాత్మకంగా తీర్చిదిద్దినారు. ఈ పుస్తకం పాఠకుడికి జాను తెలుగు పట్ల ఆరాధన భావాన్ని కలిగిస్తుంది.

  • కందుకూరి భాస్కర్‌, 9441557188.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -