అదంతా కాంగ్రెస్ ప్రచారమే
ఉపఎన్నికల్లో బీజేపీదే విజయం
హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం : బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ, అదంతా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌రావు చెప్పారు. ఉపఎన్నికల ప్రచారంలో తమ పార్టీ నేతలు పాల్గొనడం లేదంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుట్రలకు ప్రజలే సమాధానం చెబుతారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీని గెలిపించి న్యాయబద్ధమైన తీర్పు ఇస్తారనే పూర్తి నమ్మకముందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం నిరంతరంగా శ్రమించిన ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పి ఓట్లు అడక్కుండా మతాల పేరిట ఓట్లు అడిగిందని ఆరోపించారు. ఒకవైపు బీజేపీని ‘మతోన్మాద పార్టీ’ అంటూ ముద్ర వేస్తూ, మరోవైపు కాంగ్రెస్సే మతం పేరుతో ఓట్లు అడుగుతున్నదని విమర్శించారు. ‘క్రిస్టియన్లు అందరూ కాంగ్రెస్‌కే ఓటేయాలి. బీజేపీకి కాదు’ అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రచారంలో అనడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘కాంగ్రెస్ అంటేనే ముస్లిం. ముస్లిం అంటేనే కాంగ్రెస్’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా వర్గాల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా? అని ప్రశ్నించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీపై సీఎం విమర్శలు చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి కోసం రూ.12లక్షల కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో ఎరువుల కొరత, ఉద్యోగులకు వేతనాల ఆలస్యం, విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఇంత తక్కువ కాలంలో ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం మరొకటి లేదని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో అవినీతికి తెరలేపుతున్నదని ఆరోపించారు. మూసీ పునరుద్ధరణకు ఎలాంటి రోడ్‌మ్యాప్ ఉంది? డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు ఖర్చులు ఎలా అంచనా వేశారు? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నాయకుల్లో విభేదాల్లేవ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



