సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్యా నాయక్
నవతెలంగాణ – అచ్చంపేట
పేదరికం పోవాలని, అందరికీ భూమి దక్కాలని, అందరికీ ఇల్లు ఉండాలని, సమానంగా జీవించాలని ఉద్యమం చేస్తూ నక్సలైట్ల చేతిలో చనిపోయిన కామ్రేడ్ ఎంఏ రహీం 35 వర్ధంతిని మండల పరిధిలోని బొమ్మనపల్లిలో సోమవారం నిర్వహించారు. మండల కార్యదర్శి వర్ధం సైదులు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశనాయక్ మాట్లాడుతూ.. కామ్రేడ్ రహీం ఆశయాలను కొనసాగిస్తామన్నారు. బూర్జో రాజకీయ నాయకులతో చేతులు కలిపి ఓ ఇంట్లో సమావేశమైన రహీమును మాటుగాసి నక్సలైట్లు తుపాకులతో కాల్చి గొడ్డలితో నరికి చంపారని అన్నారు. రహీం ను చంపారు కానీ అతని ఆశయాన్ని చంపలేరని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ రాజ్యాలు ఏలుతున్న అమెరికా లాంటి దేశంలోని న్యూయార్క్ లోనే ఎర్రజెండా సరైందని ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్న పరిస్థితిని మీరు చూస్తున్నారని, రాబోయే కాలంలో భారత దేశంలో కూడా మతాలు ఏలిన తర్వాత ఎర్రజెండా ఎగురుతుందన్నారు. దేశంలో నిపుణులు, మేధావులు ఇదే చెప్తున్నారని, దాని దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాన పార్టీ విస్తరణ కోసం కృషి చేయాలని అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా నాయకులు శంకర్ నాయక్, ఎస్. మల్లేష్, పార్టీ నాయకులు నారమోని వీరయ్య, గోపాల్, పర్వతాలు, మల్లయ్య, కరీం, వీరయ్య, వెంకటయ్య, సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.



