నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పథకంలో భాగంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్యం పరిశుభ్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు మెడికల్ ఆఫీసర్ కంతి రాజేందర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులకు మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య పరిశుభ్రతపై ఆయన అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రతిరోజూ సబ్బుతో శుభ్రమైన స్నానం చేస్తే శరీరంలోని బ్యాక్టీరియా నశిస్తుందని, ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండవన్నారు.జుట్టును క్రమం తప్పకుండా కడగాలని, వారానికి ఒక్కసారైనా జుట్టుకు సబ్బు/షాంపూ రాసుకుని శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఉదయం లేవగానే పళ్లు తోముకోవాలని, భోజనం తర్వాత కూడా పళ్లు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం అన్నారు.దంతక్షయం, నోటిలో మురికి వాసన రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా దంత పరిశుభ్రత అవసరమని తెలిపారు.
మంచి ఆరోగ్యానికి చేతుల పరిశుభ్రత చాలా అవసరమని, తరచుగా వ్యాధులు అపరిశుభ్రమైన చేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయన్నారు. భోజనానికి ముందు, తర్వాత చేతులు కడుక్కోవాలని, టాయిలెట్‌కు వెళ్లినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, బయటి నుంచి వచ్చినప్పుడు, ఆడుకునేటప్పుడు, గార్డెనింగ్ చేసేటప్పుడు చేతులు కడుక్కోవాలని సూచించారు. చేతులు కడుక్కునేటప్పుడు సబ్బు, హ్యాండ్ వాష్ వాడాలన్నారు. వంట చేసే ముందు చేతులు కడుక్కోవాలని, గోళ్లలో మురికి ఉంటే వ్యాధులు వస్తాయి కాబట్టి చేతులు కడుక్కునేటప్పుడు గోళ్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి దుస్తుల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం అన్నారు. డిటర్జెంట్, సబ్బుతో బట్టలు ఉతుక్కోవాలని, సూక్ష్మక్రిములు త్వరగా బట్టలపై స్థిరపడి అక్కడి నుండి మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి, ఉతికిన బట్టలను మాత్రమే ఎల్లప్పుడూ ఉపయోగించాలన్నారు.
అంటువ్యాధులు వేగంగా పెరుగుతాయి, కాబట్టి మురుగునీటి నిర్వహణ సక్రమంగా జరగాలన్నారు. ఇంటి వ్యర్థాలను సకాలంలో పారవేయాలని, మనం నివసించే ప్రదేశం పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దానంతట అదే దూరంగా ఉండడంవల్ల అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు.మురికి ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి, అందువల్ల వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.



