జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ఐ డి ఓ సి లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
నవతెలంగాణ – వనపర్తి
భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి బలమైన పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కే దక్కుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ హాజరై మౌలానా చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పాల్గొని మౌలానా అజాద్ కు అర్పించారు.
మౌలానా జయంతి సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. మహనీయుడి జయంతి రోజునే జాతీయ విద్యా దినోత్సవం (నవంబరు 11) నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అబుల్ కలాం ఆజాద్ వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషిచేశారని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పని చేశారని గుర్తు చేశారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ, మైనారిటీ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపిఓ తరుణ్ చక్రవర్తి, కలెక్టరేట్ ఏవో భాను ప్రకాష్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి అఫ్జల్, డిపిఆర్ఓ సీతారాం నాయక్, డీఈవో అబ్దుల్ ఘని, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



