Wednesday, November 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసామినేని హంతకులను అరెస్టు చేయాలి

సామినేని హంతకులను అరెస్టు చేయాలి

- Advertisement -

12 రోజులైనా నిందితుల జాడేది..?
డీజీపీ శివధర్‌రెడ్డికి సీపీఐ(ఎం) నేతల వినతి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ పార్టీ రాష్ట్ర నాయకులు సామినేని రామారావును హత్యచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ మేరకు డీజీపీ బి.శివధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేసింది. డీజీపీని కలిసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్‌, మధిర డివిజన్‌ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, తదితరులున్నారు. ‘ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడుకి చెందిన సామినేని రామారావును అక్టోబర్‌ 31 తెల్లవారు జామున ఉదయం 5:30 ప్రాంతంలో వారి కొట్టంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ వ్యక్తులు బొర్రా ప్రసాద్‌, కంచుమర్తి, రామకృష్ణ, మద్దినేని నాగేశ్వర్‌రావు, కండ్రా పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లుతో పాటు మరికొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి అతి దారుణంగా నరికి చంపారు. చంపిన వారిని స్వయంగా చూశానని రామారావు భార్య స్వరాజ్యం చెప్పింది. ఆ పేర్లతో పిటిషన్‌ కూడా రాసి ఇచ్చింది. హత్య జరిగి 12 రోజులు పూర్తయినా ఇప్పటివరకూ నిందితులను అరెస్టు చేయలేదు. ఇది ఆందోళన కలిగించే విషయం. రామారావు నిస్వార్ధ ప్రజా నాయకుడు. ఆ గ్రామంలో ఏకగ్రీవ సర్పంచ్‌గా రెండు సార్లు చేశారు. వారి సతీమణి ఒకసారి సర్పంచ్‌గా చేసింది. పేదలకు ఇండ్లు కట్టించేందుకు తమ సొంత భూమిని పంచిన చరిత్ర రామారావుది. 50 ఏండ్లుగా సీపీఐ(ఎం) జిల్లా, రాష్ట్ర నాయకునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పేదలు, రైతుల పక్షాన అనేక పోరాటాలు చేశారు. గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. రామారావు బతికి ఉంటే గ్రామంలో సీపీఐ(ఎం)ను ఓడించడం సాధ్యం కాదనీ, తమ రాజకీయ మనుగడ సాధ్యం కాదనే కక్షతో ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు కుట్రపన్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. హంతకులను, కుట్రకు పాల్పడిన వారిని అరెస్టు చేసి, చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలి’ అని డీజీపీకి జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌ విన్నవించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -