Wednesday, November 12, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుజూబ్లీ బై పోల్‌లో 48.47 శాతం ఓటింగ్‌

జూబ్లీ బై పోల్‌లో 48.47 శాతం ఓటింగ్‌

- Advertisement -

– పెరగని పోలింగ్‌ శాతం…
– ఆసక్తి చూపని ఓటర్లు
– చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం
– ఓటేసిన ప్రముఖులు, వృద్ధులు, వికలాంగులు
– ఈవీఎంలలో ‘ఫలితం’.. 14న కౌంటింగ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగి సింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్‌ శాతం 48.47 శాతానికే పరిమితమైంది. కాగా ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఈనెల 14న వెలువడనుంది. దీంతో ఈ ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల విస్త్తృత పర్యటనలు, పార్టీల మధ్య ఆధిపత్య పోరు, తీవ్ర ఆరోపణలు, ఘర్షణ లతో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ వాడీవేడిగా సాగింది.

ఉదయం 7 గంటల నుంచే 407 కేంద్రాల్లో పోలింగ్‌ ప్రారంభమైంది. మొదట మందకొడిగా ఓటింగ్‌ కొనసాగగా కొన్నిచోట్ల వృద్ధులు, వికలాంగులు ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి రెండు గంటల్లో కేవలం 9.2 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతానికి చేరుకుంది. ఈ సమయంలో పలువురు ప్రముఖులు, సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, నటుడు తనికెళ్ల భరణి వంటి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి తదితరులు ఉదయాన్నే తమ ఓటును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ 31.94 శాతంగా నమోదవ్వగా.. 3గంటలకు 40.20 శాతానికి చేరింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం ఓటింగ్‌ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే, క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. పూర్తి పోలింగ్‌ శాతం తెలవడానికి అర్థరాత్రి అవుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.

తగ్గిన ఓటింగ్‌ శాతం.. సాంకేతిక లోపాలు!
2023 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో పోలింగ్‌ శాతం కొంచెం అటుఇటుగా నమోదైంది. షేక్‌పేట్‌, రహమత్‌నగర్‌, వెంగళ్‌రావునగర్‌లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్‌ కాసేపు ఆలస్యమైంది. శ్రీనగర్‌ కాలనీలోని నాగార్జున కమ్యూనిటీ హాల్‌లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కారణంగా పోలింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. యూసఫ్‌గూడలోని సవేరా ఫంక్షన్‌ హాల్‌ వద్ద బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీత, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్‌ నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తూ కరపత్రాలు పంచుతున్నారని సునీత ఆరోపించారు. ఇరు పార్టీ శ్రేణులు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండు గ్రూపులను చెదరగొట్టారు. వెంగళ్‌రావు నగర్‌ డివిజన్‌లోని 120వ పోలింగ్‌ బూత్‌ వద్ద బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించుకుంటూ బాహాబాహీకి దిగారు. దాంతో పోలింగ్‌ కేంద్రం వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది. షేక్‌పేట్‌ డివిజన్‌లోని అపెక్స్‌ హైస్కూల్‌ వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. రహమత్‌నగర్‌, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలోని అనేక ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఓటుకు రూ.2000 నుంచి రూ.5000 వరకు పంపిణీ చేశాయని పరస్పరం ఆరోపించుకున్నాయి.
మరోపక్క పోలింగ్‌కు ఈసీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించింది. దేశంలోనే తొలిసారిగా ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నియోజకవర్గంలో ఉన్న స్థానికేతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

అభ్యర్థుల పర్యటనలు.. పరస్పర ఆరోపణలు..!
ప్రధాన పార్టీల అభ్యర్థులు డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తూ పోలింగ్‌ సరళిని పర్యవేక్షించగా, పలుచోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. డబ్బు పంపిణీ ఆరోపణలు, పరస్పర దాడులతో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా కదిలారు.
ఉదయాన్నే తన ఓటు హక్కు వినియోగించుకున్న సునీత.. అనంతరం నియోజకవర్గంలోని కీలక డివిజన్‌లైన యూసఫ్‌గూడ, వెంగళ్‌రావు నగర్‌, బోరబండ, రహమత్‌నగర్‌లో పర్యటించారు. పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి, ఏజెంట్లతో మాట్లాడి పోలింగ్‌ సరళిని అడిగి తెలుసుకు న్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్‌ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. నవీన్‌యాదవ్‌ సైతం తన ఓటు వేసిన తర్వాత షేక్‌పేట్‌, జూబ్లీహిల్స్‌, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు డబ్బు పంచి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. తన కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు. ఇక బీజేపీ అభ్యర్థి దీపక్‌ రెడ్డి సైతం పలు డివిజన్లలోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి తమ పార్టీ ఏజెంట్లతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు డబ్బు, మద్యంతో ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు.

పలువురిపై కేసు
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్‌, శ్రీ రాందాస్‌పై మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినరు భాస్కర్‌, మెతుకు ఆనంద్‌పై బోరబండ పోలీస్‌ స్టేషన్‌లో ఒక కేసు నమోదైందని సీపీ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -