అదుపులో ముగ్గురు వైద్యులు
13కి చేరిన మృతుల సంఖ్య
ఘటనపై రాష్ట్రపతి ఆరా
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లపై సమగ్ర దర్యాప్తును మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేపట్టింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే రెండుసార్లు ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని కోణాల్లో నుంచి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఈ దారుణానికి బాధ్యులైన వారిని, కుట్ర పన్నిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది. బాధితులకు రూ.10లక్షల నష్టపరిహారాన్ని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. పేలుడు సంభవించిన కారులోని వ్యక్తిని పుల్వామా నివాసి డాక్టర్ ఉమర్‌గా భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు హిందూ పత్రికకు తెలిపాయి. ఢిల్లీ పోలీసులు ఉపా కింద, పేలుళ్ల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అదుపులో ముగ్గురు వైద్యులు క్యాంపస్‌లో ఉంటూనే అద్దెకు గదులు
ఢిల్లీ పేలుళ్ల ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఫరీదాబాద్ అల్ ఫలాV్‌ా యూనివర్సిటీ నుంచి మరో ముగ్గురు వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ముజామ్మిల్ షకీల్, ఉమర్ మహ్మద్, షాహీన్ షాహిద్‌లుగా గుర్తించారు. వీరిలో షాహిన్ లక్నోకు చెందిన వ్యక్తి కాగా మిగిలిన ఇద్దరు కాశ్మీర్‌కు చెందినవారు. వీరు ముగ్గురు కూడా ఫరీదాబాద్ ఆస్పత్రిలోనే పని చేస్తున్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. పైగా యూనివర్సిటీ కమ్ ఆస్పత్రి అయిన ఆ సెంటర్‌లో వీరు సీనియర్ డాక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫరీదాబాద్‌లో 2900 కిలోల పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్న కేసులో ముజామ్మిల్ పేరు బయటకు వచ్చింది. ఫరీదాబాద్‌లో ముజామ్మిల్ అద్దెకు తీసుకున్న రెండు గదుల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. నిజానికి ముజామ్మిల్ యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఉంటున్నా ఈ గదులను అద్దెకు తీసుకున్నాడు. పైగా ముజామ్మిల్ సహచరునికి చెందిన కారు నుంచి రైఫిల్స్, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. జైషే మహ్మద్ మహిళా విభాగానికి భారత్‌లో ఒక బ్రాంచిని ఏర్పాటు చేసే బాధ్యతను షాహిన్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఎర్రకోట మెట్రోస్టేషన్ మూసివేత
ఎర్రకోట మెట్రోస్టేషన్‌ను బుధవారం కూడా మూసివేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. పేలుళ్ల నేపథ్యంలో భారత్-నేపాల్ సరిహద్దు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
మూడు రోజులుగా అజ్ఞాతం
ఢిల్లీ ఆత్మాహుతి దాడి అనుమానితుడుగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ ఈ ఘటనకు ముందు మూడు రోజులుగా తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు జరిగిన ఐ 20 కారును చివరిగా కొనుగోలు చేసిన వ్యక్తి కూడా తనే అని అనుమానిస్తున్నారు. ఈ కారు ఉమర్ చేతికి రావడానికి ముందుగా అనేక చేతులు మారింది. ఈ ఘటనలో ఉపయోగించిన పేలుడు పదార్ధాలు ఏమిటనేది తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్‌లో పెద్దమొత్తంలో దొరికిన పేలుడు పదార్ధాలకు, ఢిల్లీలో పేలుడుకు సంబంధం ఉందని భావిస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
పేలుడు పదార్థాల్లో ఏమున్నాయి?
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లలో అమ్మోనియం నైట్రేట్, ఇంధన ఆయిల్, డిటొనేటర్లు వాడి ఉండొచ్చునని ప్రాధమిక నిర్ధారణలను బట్టి తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు.
రాష్ట్రపతి ఆరా
అంగోలా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు గురించి ఆరా తీశారు’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పెరిగిన మృతుల సంఖ్య
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 13కు చేరింది. గాయపడిన మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం..ప్రధాని మోడీ
ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు పేలుడుకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ప్రధాని మోడీ వెల్లడించారు. నిందితులు ఎక్కడున్నా పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్‌ఐఏ దర్యాప్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



