– 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషిగా తేలి మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోలీని నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులకు సంబంధించి అతడిపై ఉన్న ఆరోపణలపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం సురేందర్ కోలీని తక్షణమే విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది.
నిఠారీ హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోలీ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేవలం ఒక కత్తి ఆధారంగా అతడిని నిందితుడిగా భావించలేమని పేర్కొంది. ఇప్పటికే 12 కేసుల్లో అతడు నిర్దోషిగా తేలినందువల్ల సురేందర్ కోలీని విడుదల చేయాలని ఆదేశించింది. 2006లో నొయిడాలోని నిఠారీ వద్ద మోనిందర్‌సింగ్ పంఢేర్ ఇంటి వెనుక మురుగుకాల్వలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడటం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన సిబిఐ పంఢేర్‌తోపాటు అతడి ఇంట్లో సహాయకుడైన కోలీని అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో మొత్తం 19 కేసులను 2007లో నమోదు చేసింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిలో మూడింటిని మూసివేసింది. మిగతా 16 కేసులకుగాను పన్నెండింటిలో కోలీని నిర్దోషిగా 2023 అక్టోబరు 16న అలహాబాద్ హైకోర్టు తేల్చింది.
అప్పటికి పంఢేర్‌పై మూడు కేసులు మిగిలి ఉండగా.. వాటిలోనూ అతణ్నీ నిర్దోషిగా నిర్ధారించింది. దర్యాప్తులో సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నిందితులే నేరం చేసినట్టు ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ, మృతుల తరఫు బంధువులు పిటిషన్లు వేశారు. వాటన్నింటినీ సుప్రీంకోర్టు ఈ ఏడాది జులైలో కొట్టివేసింది. అయితే- నిఠారీ హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలికకు సంబంధించిన హత్య కేసులో నిర్దోషిగా తేలకపోవడంతో ఇప్పటి వరకూ కోలీ జైల్లోనే ఉన్నాడు.
సురేందర్ కోలీ నిర్ధోషి
- Advertisement -
- Advertisement -



