ఉచిత కంటి వైద్య శిబిరం పేదలకు వరం లాంటిది
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేయడమే ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. హనుమండ్ల రాజేందర్ ఝాన్సీ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి హైదరాబాద్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో బుధవారం మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమాన్ని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామీణ ప్రాంత పేదలకు వరం లాంటిదని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు కంటిచూపు సమస్య ఎక్కువగా ఉందని, కంటి చూపు సమస్యను పరిష్కరించేందుకు అనుమాండ్ల రాజేందర్ ఝాన్సీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాలను నియోజకవర్గంలోని మండలాల్లో నిర్వహించి సేవా కార్యక్రమాల్లో ముందుండే విధంగా కృషి చేస్తామన్నారు. కంటి చూపు సమస్యతో బాధపడే వారితోపాటు కంటి ఆపరేషన్ చేసుకునే వారికి చారిటబుల్ ట్రస్టు ఉచితంగా అద్దాలను అందజేస్తుందని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేసే వారికి ప్రభుత్వం చేయూతను అందిస్తుందని తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుండి అపూర్వ స్పందన లభించిందని, ప్రజలు తండోపతండాలుగా తరలిరావడం అభినందనీయమన్నారు.
30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు: టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
గ్రామీణ ప్రాంత పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో గత 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. ప్రజాసేవ చేయడంతో పాటు ఆరోగ్య సేవలు అందించడంలో ట్రస్టు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సేవ చేయడమే ట్రస్టు లక్ష్యమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అనాధ ఆశ్రమాలకు సహాయం అందించడంతోపాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడంలో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల, ప్రభుత్వ వైద్యాధికారి సిద్ధార్థ రెడ్డి, శంకర కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ మనోజ్ఞ, నిర్వాహకులు భూక్య బాలరాజు, ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఆకుల రాజన్న, ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్ఓ రమణమ్మ, సూపర్వైజర్ ఇంద్రాణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి లతోపాటు నాయకులు పాల్గొన్నారు.



