ఏదో ఒక ఆశాకిరణం
ఎప్పుడూ మెరుస్తూనే వుంటుంది
కాల యవనికలో అది తూరుపు నుండి
పడమర వైపు తిరిగింది
ఇంకేమీ మిగల లేదు అనుకున్నప్పుడంతా
ఒక మిణుగురు గుంపు
చిక్కపడ్డ చీకట్లోంచి
చింతల తోపులోంచి మెరుస్తూ వస్తుంది
సమాధుల మీద
లేలేత ఎర్రని పూవులేవో చల్లుతూ
పిడికిలెత్తి నేనింకా మీకోసం
నిలబడి వున్నానని నవ్వుతూ విశ్వ వేదికపై
నుండి మాటిస్తుంది
అది మొలకెత్తింది
పెట్టుబడుల ఏకధ్రువ ప్రపంచంలోనే కావచ్చు
కానీ, ఆ గొంతు అమరుల నెత్తుటితో
తడిచిన నేల చిరునామాది కదా
గాజా పసిపాపల నెత్తుటి ముద్దల
వాసన ఎరిగినదే కదా
సూడాన్ పిల్లల ఎండిన డొక్కల ఎముకల
పట పటమని విరిగిన శబ్దం విన్నదే కదా
ముస్లిం అయినంత మాత్రాన
ప్రవేశద్వారం ముందు
నగంగా నిలబెట్టి శోధన ఎదుర్కొన్న
అవమానం తెలిసినదే కదా
వేచి చూద్దాం..ఈ కాంతి పుంజం
భూమంతా పరచుకునే వరకు..
(న్యూయార్క్ మేయర్‌జోహ్రాన్ మమ్దానీకి అభినందనలతో)
- కెక్యూబ్ వర్మ, 94934 36277



