నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటన తీవ్ర సంక్షోభంలో పడింది. ఇస్లామాబాద్‌లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భద్రతా కారణాలతో 16 మంది సభ్యుల జట్టులోని 8 మంది ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంతో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. టెలికామ్ ఏషియా స్పోర్ట్ నివేదిక ప్రకారం రావల్పిండి వేదికగా ఈరోజు రెండో వన్డే జరగాల్సి ఉండగా, దానికి కొన్ని గంటల ముందే దేశం విడిచి వెళ్లాలని ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. తొలుత పాకిస్థాన్ అధికారులు భద్రతపై పూర్తి హామీ ఇవ్వడంతో పర్యటన కొనసాగించాలని భావించినా, జట్టు సభ్యులు హోటల్‌లో సమావేశమైన తర్వాత 8 మంది ఆటగాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని వెనుదిరగాలని పట్టుబట్టారు.
పర్యటన నుంచి మధ్యలోనే వైదొలిగితే రెండేళ్ల పాటు నిషేధం విధిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) హెచ్చరించినా ఆటగాళ్లు వెనక్కి తగ్గలేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డులోని కొందరు సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితిని చక్కదిద్దేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్, ఆ దేశ మంత్రి మోహ్సిన్ నఖ్వీ రంగంలోకి దిగారు. ఆయన ఇస్లామాబాద్‌లోని హోటల్‌లో శ్రీలంక ఆటగాళ్లతో సమావేశమై పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పాకిస్థాన్‌లోని శ్రీలంక హైకమిషనర్‌తోనూ చర్చలు జరిపారు. ఆయన పాక్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, ఆటగాళ్లలో భయాందోళనలు తగ్గలేదు. మంగళవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మరణించడం, అదే రోజు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ క్యాడెట్ అకాడమీపై ఉగ్రదాడి జరగడం ఆటగాళ్లలో తీవ్ర ఆందోళనకు కారణమైంది.



