మహిళ ప్రాణాన్ని కాపాడిన డయల్ 100
నవతెలంగాణ – ముధోల్
ముధోల్ పోలిస్ నారిశక్తి బృందం సమయ స్ఫూర్తితో స్పందించి ఆత్మహత్యకు యత్నించిన మహిళ ప్రాణాల్ని రక్షించిన సంఘటన ముధోల్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఈ ఘటనపై గురువారం ఉదయం పత్రిక ప్రకటనలో వివరాలు తెలియజేశారు.
ముధోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ కుటుంబ సమస్యలతో భాదపడుతూ జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సమాచారం డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న ముధోల్ పోలిస్ నారిశక్తి బృందం సమయస్ఫూర్తితో స్పందించి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళను రక్షించారు. అనంతరం ముధోల్ పోలిస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మహిళలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా.. తక్షణ సహాయం కోసం డయల్ 100 కు ఫోన్ చేయవచ్చు అని అన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల రక్షణకు సిద్ధంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. ఈసందర్భంగా ముధోల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్, ఎస్‌ఐ పెర్సిస్ పర్యవేక్షణలో విధుల్లో ఉన్న నారిశక్తి బృందం సమయానికి స్పందించి మహిళ ప్రాణాలను రక్షించినందుకు ఎస్పీ అభినందించారు.



